పార్ధసారధి పోట్లూరి ……….. భారతీయ రూపాయలని ఏం చేసుకోవాలి ? రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్ ప్రశ్న !
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ [Sergey Lavrov ] SCO సమావేశాల కోసం వచ్చినప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదించాడు!
గత సంవత్సరం ఫిబ్రవరి 23 న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టగానే యూరోపుతో పాటు అమెరికా కూడా రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ! దాంతో రష్యాకి చెందిన వివిధ అంతర్జాతీయ బాంకులలో డాలర్లు ఉన్నా, వాటిని వాడుకోవడానికి వీలు లేకుండా పోయింది. భారత్ రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుకి చెల్లింపులు ఎలా చేయాలో ఆలోచించకుండా రష్యా మన దేశానికి ముడి చమురు ని సరఫరా చేస్తూ పోయింది.
Ads
యుద్ధం మొదలయిన నెల తరువాత రష్యా భారత్ రూబుల్ – రూపీ లలో వర్తక వాణిజ్య వ్యవహారాలు జరపాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం రష్యా ముడి చమురుతో పాటు ఇతర వస్తువులు భారత్ కి అమ్ముతుంది, భారత్ రూపాయలని ఇస్తుంది రష్యాకి. అలాగే భారత్ నుండి రష్యాకి ఎగుమతి అయ్యే వస్తువులకి రష్యా తిరిగి రూపాయలలో చెల్లింపులు చేస్తుంది. అప్పట్లో రష్యా అవసరం రష్యాది మరియు భారత్ అవసరం భారత్ ది.
రష్యా నుండి భారత్ ముడి చమురు దిగుమతులని 6 రెట్లకి పైగా పెంచింది. భారత్ మాత్రం రూపాయలలో చెల్లింపులు చేస్తూ వస్తున్నది. రష్యా మన దేశంలోని వివిధ బాంకులలో అక్కౌంట్లని తెరిచింది. భారత దేశపు దిగుమతి దారులు ముడి చమురు దిగుమతి చేసుకోగానే రూపాయల రూపంలో రష్యా సెంట్రల్ బాంక్ అక్కౌంట్లలో జమ చేస్తూ పోయారు. అలాగే రష్యా మన దేశం నుండి చేసుకుంటున్న దిగుమతుల కోసం అదే అక్కౌంట్ల నుండి రూపాయాలని మన దేశ ఎగుమతి దారులకి చెల్లిస్తూ వచ్చింది !
ఇప్పుడు రష్యాకి చెందిన అకౌంట్లలో దాదాపుగా $40 బిలియన్ విలువ చేసే రూపాయలు ఉన్నాయి మన దేశంలో! వాటిని ఏం చేసుకోవాలి? ఇదే ఇప్పుడు రష్యా ముందు ఉన్న ప్రధాన సమస్య ! రష్యా మన దేశానికి చేసిన దిగుమతుల విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉండగా అదే మన దేశం నుండి రష్యా దిగుమతి చేసుకున్న వాటి విలువ 2 బిలియన్ డాలర్లు మాత్రం ! అంటే దీనర్ధం వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది అన్నమాట ! So ! రష్యా దీనికి పరిష్కారం చూపకపోతే ముడి చమురుని సరఫరా చేయబోమని చెప్పేసింది !
ఇప్పుడు అసలు సమస్య మన దేశం ముందు ఉంది ! అదేమిటంటే 40 బిలియన్ విలువ చేసే వేరే కరెన్సీని మనం రష్యాకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ! ఇలా చేయాలంటే మనం చైనా యువాన్ కరెన్సీని కొని రష్యాకి ఇవ్వాల్సి ఉంటుంది లేదా దీర్హామ్ ల రూపంలో అయినా రష్యాకి ఇవ్వాల్సి ఉంటుంది. OK! చైనా మన రూపాయలని ఎందుకు తీసుకుంటుంది ? డాలర్లు ఇస్తే యువాన్ లు ఇస్తుంది, అలాగే సౌదీ కానీ UAE లు కానీ మన రూపాయలని తీసుకోవు కాబట్టి వాళ్ళకి కూడా డాలర్ల రూపంలో ఇచ్చి వాళ్ళ కరెన్సీని రష్యాకి ఇవ్వాల్సి ఉంటుంది.
చచ్చింది గొర్రె ! ఎలా చూసినా మన దేశం దగ్గర ఉన్న డాలర్లకి రెక్కలు వచ్చినట్లే ! అంటే 40 బిలియన్ డాలర్లు మన రిజర్వ్ నుండి తీసి వాటితో దీర్హంలు కానీ యువాన్ లు కానీ కొని రష్యాకి ఇవ్వాల్సిందే అన్నమాట ! దీని వల్ల మన డాలర్ రిజర్వ్ మీద ఒత్తిడి పడుతుంది ! ఇన్నాళ్లూ చాలా చవకగా రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటూ రూపాయలలో చెల్లింపులు చేస్తున్నామని సంబర పడ్డాము కానీ ఇలాంటి స్థితి వస్తుంది అని మన అధికారులు ఊహించలేదా ?
మొదటి నుండి మొత్తుకుంటున్నది ఏమిటంటే సర్వీసెస్ రూపంలో మన దేశం నుండి ఎగుమతులు చేయడం కంటే వస్తువుల రూపంలో ఎగుమతి చేసి ఉంటే ఈ రోజు ఇలాంటి స్థితి వచ్చి ఉండేది కాదు ! IT ఎగుమతుల రూపంలో మన దేశంలోకి వచ్చే డాలర్లు తిరిగి వస్తువులు కొనడం వలన తిరిగి డాలర్ల రూపంలో బయటికి వెళ్లిపోతున్నాయి. మరో వైపు చమురు దిగుమతుల బిల్లు పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు.
ఇప్పటి మన పరిస్థితిని చూసి అమెరికా, యూరోపులు నవ్వుకుంటూ ఉండి ఉండవచ్చు ! దీని వల్ల ఎవరు లాభ పడుతున్నారు ? ఖచ్చితంగా చైనా లాభ పడుతుంది. రష్యా మన దేశం కంటే చైనా నుండే ఎక్కువ దిగుమతులు చేసుకుంటుంది కాబట్టి చైనా కరెన్సీ అయిన యువాన్ కి విలువ ఇస్తుంది రష్యా !
అయితే గత సంవత్సరం నుండి దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు మన అధికారులు ? జస్ట్ వాడుకుంటూ పోదాం ! అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం ! మన దేశం నుండి 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఎగుమతి కావు రష్యాకి అని తెలిసినప్పుడు ఎందుకు ఉదాసీనంగా ఉన్నట్లు ? నిజమే ! మన రూపాయలని మన దేశ బాంకులలో రష్యా అక్కౌంట్లలో ఉండడం వలన రష్యాకి నష్టమే !
తికమక పడవద్దు ! UPI ద్వారా చాలా దేశాలలో నేరుగా రూపాయలలోనే చెల్లింపులు చేస్తున్నాం కదా ? అంటే దీనర్ధం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు చేస్తే 2% దాకా మాస్టర్ లేదా వీసా కార్డుకి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేరుగా UPI ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది మన ప్రభుత్వం. మన UPI ద్వారా వేరే దేశాలలో చెల్లింపులు చేస్తే మన రూపాయలని ఆయా దేశాలు స్వీకరిస్తున్నట్లుగా అర్ధం చేసుకోవద్దు. మహా అయితే మన దేశం నుండి ఎగుమతులు అయిన వాటికి తిరిగి అవే రూపాయలని మన అక్కౌంట్లలో పంపిస్తాయి ఆయా దేశాలు… కానీ ఎక్కువ అయితే మన రూపాయలని తీసుకొని వాళ్ళకి డాలర్ల రూపంలో చెల్లించాల్సిందే ఎప్పటికయినా,
ప్రస్తుతం శ్రీలంక మరియు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలలో మాత్రం మన రూపాయలని తీసుకుంటున్నారు తప్పితే వేరే దేశాలలో తీసుకోరు ! వస్తువులు తయారు చేసి ఎగుమతులు చేయడం ద్వారానే మనం అభివృద్ధి చెందగలం కానీ IT సేవల రూపంలో మాత్రం కాదు.
Share this Article