Murali Buddha ……….. ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర… జ్ఞాపకాలు
2004 లో తెలుగుదేశం ఓడిపోయాక ఓరోజు ఎన్టీఆర్ భవన్ లో నన్నపనేని రాజకుమారి ‘‘చూడు మేం ఓడిపోయినా ఎన్టీఆర్ భవన్ ఎప్పుడూ కళకళలాడుతోంది’’ అంటే… ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను ‘‘క్యాంటిన్ బంద్ చేసి చూడండి, ఎన్టీఆర్ భవన్ ఎంత కళకళలాడుతుందో చూడండి అన్నాను … ఆమె ఫకాలున నవ్వి అంతేనా ? అన్నారు .
పేరుకు క్యాంటిన్ కానీ అక్కడ ఎన్నో చర్చలు జరిగేవి . ఎర్రంనాయుడు , ఉమ్మారెడ్డి , లాల్ జాన్ బాషా వంటి హేమాహేమీలు అక్కడ భోజనం చేస్తూ మీడియాతో బోలెడు సంగతులు పంచుకునే వారు . అప్పుడప్పుడు బాబు కూడా …
Ads
పార్టీ పుట్టినప్పటి నుంచి హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉండేది . ఆ భవనం ఓ నవాబులది . పార్టీ నాయకుడు కూడా .. ఎన్టీఆర్ ను బాబు దించేశాక ప్రభుత్వం , పార్టీ , బ్యాంకు డిపాజిట్లు అన్నీ బాబు తీసేసుకున్నా పెద్ద మనసుతో ఈ అద్దె భవనాన్ని మాత్రం ఎన్టీఆర్ కు వదిలేశారు . అదే హిమాయత్ నగర్ లో ఈ భవనానికి కొద్ది దూరంలోనే అదే నవాబు గారికి ఇంకో భవనం ఉండేది . దాన్ని బాబు టీడీపీకి ఇచ్చారు .
బాబు నాయకత్వంలో టీడీపీ తొలుత ఇక్కడి నుంచే పని చేసేది . బాబు బంజారాహిల్స్ లోని తన ఇంటికి వచ్చేటప్పుడు , వెళ్లేటప్పుడు దారిలోని ఓ విశాలమైన ఖాళీ స్థలంపై పడింది చూపు . అది ప్రభుత్వ స్థలం. mch వాళ్ళు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాడనికి ఏర్పాట్లు చేశారు .
ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోవడం ఎంత పని … ఎన్టీఆర్ విధానాల పై విస్తృత చర్చ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అంటూ , ఆ ట్రస్ట్ పేరు మీద ఈ స్థలం తీసుకోని బిల్డింగ్ కట్టారు … దాదాపు 16 ఏళ్ళు రోజూ వెళ్ళాను . ఎన్టీఆర్ విధానాలపై రహస్యంగా ఏం చర్చలు జరుపుతారో తెలియదు .
సుదూర ప్రాంతాల్లో సమావేశాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి మీడియాను అక్కడికి తీసుకువెళ్లడం మామూలే . హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయం నుంచి వాహనాలు ఏర్పాటు చేసి, బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు తీసుకువెళ్ళేవారు … ఇప్పుడంటే ఎన్టీఆర్ భవన్ సిటీ మధ్యలో ఉన్నట్టు కానీ అప్పుడు దూరం అనిపించేది . అందుకే కొద్ది రోజులు మీడియాకు వాహనాలు ఏర్పాటు చేశారు . భవనంలో దాదాపు ఒకేసారి వెయ్యి మంది భోజనం చేయగల క్యాంటిన్ ప్రత్యేకం …
దాదాపు రాష్ట్ర విభజన వరకు క్యాంటిన్ సందడిగా ఉండేది … ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాయకులు మొక్కుబడిగా మాట్లాడినా, ఆ క్యాంటిన్ లో మనసు విప్పి ఆలోచనలు పంచుకునే వారు . ఆ క్యాంటిన్ లో ఎన్నో రుచికరమైన వార్తలు దొరికాయి . ఈ భవన్ , క్యాంటిన్ గురించి అన్ని పార్టీల వారిలో ఆసక్తి ఉండేది . పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యం . సత్యనారాయణ రావు ఓ సారి బహిరంగంగానే మీ భవన్ అద్భుతంగా ఉంటుందట … చేయి పెట్టగానే ట్యాప్ నుంచి నీళ్లు వస్తాయట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఓ సారి వచ్చి చూస్తాను అన్నారు . ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడు బహిరంగంగా పొగడడం అదే మొదటి సారి చివరిసారి .
తెలంగాణ నేతలు – అద్దెకు షాప్
అక్కడ క్యాంటిన్ కే కాదు భవన్ లో భాగంగా ఒక పక్కకు ఓ టీ షాప్ ఉండేది . సిగరెట్లు , టి , సమోసా అమ్ముతారు . దానికీ ఓ చరిత్ర ఉంది .
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు ఆ షాప్ ముందు టీడీపీ నేత అమర్నాథ్ తో పిచ్చాపాటి .. తెలంగాణ వెనుకబడి ఉంది అంటే ఈ ప్రాంత నేతల వైఫల్యమే… ప్రాజెక్ట్ లు కట్టమని అడగకపోవడం వాళ్ళ తప్పే కదా ? ఇలా సాగుతుంది ఆయన వాదన …
నేను అంతా విని, బాగా మాట్లాడావు అని మనం టి తీసుకున్న షాప్ ఉంది కదా ? మీ వాదనకు ఇదే సమాధానం అన్నాను . దివాకర్ అని అప్పుడు డీసీలో ఉండేవారు సీనియర్ రిపోర్టర్ . ఓ రోజు సరదాగా మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్ బయట ఉన్న ఆ చిన్న షాప్ అద్దెకు ఇప్పించు మురళీ, ఈ ఉద్యోగం కన్నా అది బెటర్ అంటే నేను సీరియస్ గానే తీసుకోని విచారించాను . అడగాలే కానీ అదెంత పని అనుకున్నాను . విషయం తెలుసుకుంటే ఆమ్మో అనిపించింది ..
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తులసీ రామ్ అని ఉండేవారు.. మాజీ ఎంపీ .. తన కుమారుడి కోసం ఆ షాప్ అద్దెకు అడిగారు .. బాబును ఎన్నిసార్లు కోరినా కాలేదు … ఉపాధ్యక్షుడు అంటే బాబు తరువాత స్థానం … ఆయన అడిగితే ఓ షాప్ అద్దెకు ఇవ్వలేదు . షాప్ దగ్గర కూడా ఆయన పలుకుబడి పని చేయలేదు … ప్రాజెక్ట్ ల దాకానా ? అంటే నవ్వుతూ వాదన అంగీకరించాడు … హేమాహేమీలు ఎందరు ప్రయత్నించినా దిక్కులేదు . నారా భువనేశ్వరి సిఫారసుతో ఒకరికి ఇచ్చారు … అందుకే మహా భక్త రామదాసులు కూడా మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అటు నుంచి నరుక్కు వస్తారు …
తెలంగాణ వాళ్ళు ఆ క్యాంటిన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు కానీ … తెలంగాణను దక్కించుకోవడంలో విజయం సాధించారు ..
ఎన్టీఆర్ భవన్ బయట ఖాళీ స్థలంలో కింద కూర్చొని దాదాపు అరడజను మంది ఖద్దరు బట్టలు అమ్మేవారు …. పార్టీ సమావేశం ఉంటే కనీసం డజను మంది ఖద్దరు బట్టలు అమ్మేవారు .
ఎవరు అధికారంలోకి వస్తారు ? ఎవరు పోతారు అని ముందుగా పోలీసులు గ్రహిస్తారు అంటారు … తెలంగాణ ఏర్పడగానే అక్కడ డజను మంది బట్టల వ్యాపారుల స్థానంలో ఇద్దరే కనిపించారు . తరువాత ఒక్కరూ కనిపించ లేదు …
ఏ లెక్కలో తెలియదు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కూడా రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీ విలువ పదివేల కోట్లు ఉంటుంది అన్నారు . నాకు ఆ లెక్కలు తెలియవు కానీ ఈ సెంటర్ లో మ్యారేజ్ హాల్ లేదు … ఎన్టీఆర్ భవన్ మ్యారేజ్ హాల్ కు సరిగ్గా సరిపోతుంది అన్నాను . ఇప్పటికీ అదే అభిప్రాయం …..
కబుర్లకేం కానీ ఎన్టీఆర్ భవన్ సిటీకి దూరం అనుకున్న కాలం నుంచి టీడీపీ రిపోర్టర్ ను అంటున్నావు మరి ఏమైనా భూములు , ప్లాట్స్ వెనకేశావా అంటారా ? ఆయనే ఉంటే… అన్నట్టు భూములు , ప్లాట్స్ కొని ఉంటే ఈ కథలు కాకరకాయలు రాస్తూ ఎందుకుంటాను ? భూముల లెక్కలు చూసుకుంటూ ఉండే వాడిని కానీ…..
Share this Article