Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుపుత్రో భవతి- కుమాతా నభవతి… అమ్మకు ఓ దినమేంటి అసయ్యంగా…

May 14, 2023 by M S R

తల్లీ! నిన్ను తలంచి…
———
అమృతానికి , అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి , ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
ప్రతి మనిషి పుట్టకకే పట్టుగొమ్మ అమ్మ
ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ

– మాడుగుల నాగఫణి శర్మ
—————–

కుపుత్రో భవతి
కుమాతా నభవతి

Ads

(లోకంలో చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ , చెడ్డ తల్లులు ఉండరు )

-శంకరాచార్యులు

————

ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అని ఒకటే మెసేజులు . నాకు నిజంగా తెలియదు . ఇలాంటి దినం ఒకటి ఉండడం ప్రపంచంలో అమ్మలందరికీ నిజానికి అవమానం . ఈరోజయినా ప్రపంచం అమ్మను అమ్మా ! అని పిలుస్తున్నందుకు ఒక పక్క ఆనందం .

తెలుగులో పిచ్చి తల్లి అని ఒక మాట . అమాయకమయిన అనే ఇక్కడ అర్థం తప్ప నిజంగా పిచ్చి కాదు . ఈమాట ఎలా పుట్టినా ఏ తల్లిని చూసినా ఇప్పుడు పిచ్చి తల్లి అని అనకతప్పడం లేదు . లేదా తల్లికి పిచ్చి ఉందని కొడుకులు నిరూపించడానికో , లేని పిచ్చి తెప్పించడానికో ప్రయత్నిస్తుంటారుకాబట్టి ఈ మాట అలా అలా అలవోకగా వాడేస్తున్నారేమో భాషాశాస్త్రవేత్తలు , మానసిక నిపుణులు , సామాజిక శాస్త్రజ్ఞులు కనుక్కుని చెప్పాలి . ప్రేమ – పిచ్చి ఒకటే అన్న ప్రమాణం ఉండనే ఉందికాబట్టి కొడుకులమీద ప్రేమతో తల్లి పిచ్చి ముద్రనుకూడా ప్రేమగా భరిస్తుంది . అవసరమనుకుంటే కోడలు మనసు తృప్తిపరచడానికి నిజంగా పిచ్చిని నటిస్తుంది .

అంతవరకూ అమ్మ అభిరుచులు , రుచులే తనవిగా ఉన్నకొడుకు – భార్యరాగానే అమ్మను వ్యతిరేకిస్తాడు . భార్య రాగానే అమ్మలో చాదస్తం హెచ్ డీ , 4 కే క్లారిటీతో కనబడుతుంది . అమ్మ వంటలు నచ్చవు . అమ్మ – భార్య ఒకే పైకప్పు కింద ఉండలేరు అని పెళ్లయిన ఆరునెలలకే కొడుకు తీర్మానిస్తాడు . ఆ అమృతవాక్యం కోసమే ఎదురు చూస్తూ అనారోగ్యంతో లేస్తే కూర్చోలేని , కూర్చుంటే లేవలేని భర్తను వెంటబెట్టుకుని అమ్మ మరో పైకప్పుకోసం వెతుక్కుంటూ వెళుతుంది . పిల్లలకోసం అప్పుడు మిమ్మల్ను పట్టించుకోలేదు – ఇప్పుడు దేవుడు నాకు తగినశాస్తి చేశాడు అని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటూ పతిసేవల్లో తరిస్తూ ఉంటుంది . చుట్టపుచూపుగా వచ్చే మనవళ్లు , మనవరాళ్లకు సేవలు అదనం .

అమ్మ ప్రాణం పణంగా పెడితే ఈ లోకంలో మెడకాయమీద తలకాయ ఉన్నవారు పుట్టారు . అమ్మ రక్త మాంసాలు పాలు ప్రేమ పంచితే ఈ లోకం పెరుగుతోంది . అమ్మ కంటిచూపుతో ఈ జగతిని పెద్ద చేస్తోంది . మనమంతా అమ్మకు బహిర్ ప్రాణాలు . మనమంతా అమ్మ తీర్చిన బొమ్మలం .

అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ
తన్ను లోనమ్మినవారి మనంబుల ఉండెడి అమ్మ – అన్నాడు మన పోతన .
అమ్మకు ఒక దినం ఏమిటి అసహ్యంగా ? అవమానంగా ?
అన్నీ అమ్మ రోజులే . అమ్మే అనంత సౌందర్యం అంటూ సౌందర్యలహరిలో ఈ భూ ప్రపంచంలో ఇంకెవరూ కీర్తించలేనంత గొప్పగా అమ్మను ఆరాధించారు శంకరాచార్యులు .

అమ్మ ప్రేమ అనంతం . దాన్ని కొలవడానికి కొలమానాలు పుట్టలేదు , పుట్టబోవు . ఎన్ని జన్మలకయినా తీరనిది అమ్మ రుణం . లోకంలో అందరు అమ్మల పాదాలకు నమస్కారం . అమ్మ పాదధూళితోనే పుడమిపావనమవుతూ ఉంటుంది . దేవుడు – అమ్మ ఒకేసారి ఎదురుపడితే ముందు అమ్మనే పట్టించుకోండి . లేకపోతే దేవుడు శపిస్తాడు . దేవుడయినా అమ్మ కడుపులో పుట్టాల్సిందే .

“తల్లీ ! నిన్ను తలంచి…”
ప్రతిరోజూ అమ్మ రోజే .
మనం ఆ అమ్మ కొమ్మకు పూచిన ఆఫ్టర్ ఆల్ ఒక పువ్వు- అంతే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions