Bharadwaja Rangavajhala………. పాట కట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేషన్ అర్ధం చేసుకోవాల .. డైరక్టరుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు కవిగారితో కూర్చోవాల …
ఇక్కడే మహదేవన్ ప్రత్యేకత … ముందు కవిగారిని రాసేయమనండి … అప్పుడే ట్యూను కడదాం … అలా చేసినప్పుడే సరస్పతికి సరైన గౌరవం ఇచ్చినట్టు అనేవారాయన.
ఇక ట్యూను కట్టేసిన తర్వాత అది పాడుతున్న సింగరుకు సౌకర్యవంతంగా ఉందా లేదా అనేది కూడా చూసుకునేవాడాయన.
Ads
తనతో పనిచేసే ప్రతి ఒక్కరూ కంఫర్ట్ జోన్ లో ఉంటేనే మంచి ఔట్ పుట్ వస్తుందని బలంగా నమ్మేవారు.
అందుకే ఆయన పుహళేందిని తన తోటి సంగీత దర్శకుడుగానే చూసేవారు తప్ప సహాయకుడుగా కాదు.
అలా చూసినందుకు శంకరాభరణం నిర్మాతతో మరో సినిమాకు పన్జేయడానికి ఆయన అంగీకరించలేదు.
రచయిత ఎంత కష్టపడి ఎంత ఆవేశంగా ఏం రాసినా దాన్ని ట్యూనులోకి తీసుకొచ్చి మరింత అర్ధవంతంగా తీర్చిదిద్దడం తన బాధ్యత అనుకునేవారాయన.
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనిషి అనేవాడున్నాడా అని దేవుడికొచ్చెను అనుమానం
అని ఆత్రేయ ఆవేశపడ్డా …
ఇది కవిత్వమా? ట్యూనుకు ఒదుగుద్దా అని అనుమానం పడ్డ ఆదుర్తి అనుమానాన్ని పటాపంచలు చేసి హిట్టు పాటగా మార్చిన వాడు మహదేవను.
స్వరం కట్టేప్పుడు వేసిన సంగతులు గాయకుడ్ని ఇబ్బంది పెడుతున్నాయని అనిపిస్తే చాలు తక్షణం దాన్ని మార్పు చేసి ఇలా పాడేయండి హాయిగా అని చెప్పి పని నడిపించేయగల సహృదయుడాయన.
నెమ్మదిగా ఉండాల … ప్రశాంతంగా ఉండాల … ఆందోళన పడరాదు … అప్పుడే కళ పండుద్ది అని నమ్మిన కళాజీవి ఆయన.
శివం అనే ఓ సంగీత కళాకారుడు తిరువనంతపురానికి చెందిన ఓ నాటక సంగీత దర్శకుడ్ని తీసుకొచ్చి ఇతని పేరు పుహళేంది … అని పరిచయం చేయగానే తన స్నేహబంధంలోకి తీసేసుకున్నారాయన్ని.
అసలు పేరు వేలప్పన్ నాయర్ అయినా తనకు నచ్చిన కవి పేరును తన పేరుగా పెట్టేసుకోవడం పుహళేందిలో ఆయనకు నచ్చిన లక్షణం.
అలా మొదలైన బంధం … రెండు వందల యాభై సినిమాలకు విస్తరించింది.
పుహళేందే తనను రికార్డింగు థియేటర్ కు తీసుకురావాలి .. పుహళేందే తనను ఇంటి దగ్గర దింపాలి ..
పాట ట్యూను కట్టేప్పుడు ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలియదుగానీ రికార్డింగు థియేటర్ కు వచ్చాక వారిద్దరి మధ్యా చాలా అరుదుగా మాటలు నడిచేవి.
దాదాపు కళ్లతోనే మాట్లాడుకునేవారని నాటి గాయకులు చెప్తారు.
ఒకరి మనసు ఒకరికి పూర్తిగా తెల్సినప్పుడు మాటలెందుకు మధ్యలో అన్నారట వెనకటికెవరో అలాన్నమాట …
మామూలుగా
నాగిరెడ్డి చక్రపాణి అంటే ఒక్కరే అనుకున్నాం అనేవాళ్లు మనకు తగుల్తారు …
బాపు రమణల్లాగా …
అయితే మామా అప్పూ కూడా అంతే … పుహళేందిని మహదేవన్ అప్పూ అనే పిల్చేవారు.
రికార్డింగ్ థియేటర్ లో మహదేవన్ జస్ట్ అలా కూర్చుని అబ్జర్వ్ చేయడమే … సింగర్స్ కు పాట నేర్పించడం దగ్గర నుంచీ ఆర్కెస్ట్రా కండక్ట్ చేయడం వరకూ అన్నీ పుహళేందే చూసుకునేవారు.
కానీ అడుగడుగునా మామ కళ్లల్లోకి చూడడం ఆయన ఆమోద ముద్రతోనే పనులు నడిపించడం సాగేది.
ఈ సమన్వయం వారిద్దరినీ బాగా ఎరిగిన వారికే అవగతమయ్యేది తప్ప అన్యులకు కుదిరే పని కాదు.
అలా .. వీరిద్దరూ కల్సి ఓ పాటకు స్వరం కడుతున్న సందర్భం … మీ కళ్ల ముందు పెడుతున్నా …
అందుకోసం ఇదంతా చెప్పాను తప్ప మీకు తెలియదని కాదు …
ఈ ఫోటో లో…
బాల సుబ్బరమన్నెం ముందు హార్మోనియం పెట్టుక్కూర్చున్న కుర్రాడే అప్పు అంటే…
Share this Article