నిజానికి అక్షరదోషాలు పత్రికల్లో వస్తూనే ఉంటయ్… చిన్న పత్రికల్లోనైతే భీకరంగా కనిపిస్తుంటయ్… తప్పులు సరిచూసుకుని, సరిదిద్దుకునే సాధనసంపత్తి, సంకల్పం లేవు కదాని మనమూ చూసీచూడనట్టు భరిస్తుంటాం… కానీ కొన్ని వేల కోట్ల మీడియా ఎంపైర్స్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి పెద్ద పత్రికల్లో తప్పులు వస్తే…? ఏటా వందల కోట్ల ప్రజాధనాన్ని యాడ్స్ రూపంలో… నేరుగా ప్రభుత్వ ధనాన్ని సైతం పొందే ఈ పత్రికలు భాషకు ద్రోహం చేయవచ్చా..?
ఇవీ ప్రశ్నలు… పత్రికలు సమాజానికి చేసే ద్రోహాల కథ అనంతం… ఆ చర్చకు ఇక్కడ వెళ్లడం లేదు… కనీసం తప్పుల్లేని భాషను ఆశించడం తప్పా మనం..? పెద్ద పత్రికలు కాబట్టే ఈ బాధ… ఈ విమర్శ… తమ వ్యవస్థల్లో పాత్రికేయ జ్ఙానం లేనివాళ్లను సైతం డెస్కుల్లో కూర్చోబెట్టి పాత్రికేయాన్ని ఉద్దరిస్తున్నారు, అది వేరే చర్చ… కానీ పాఠకులకు సరైన భాషలో కంటెంట్ అందించడం, అదీ చిన్న పిల్లలకు భాషను నేర్పించాల్సింది పోయి, వాళ్లను ఉద్దేశించిన కంటెంట్ కూడా భీకరంగా ఉండటం క్షమార్హమేనా…?
ఈనాడుదేమో క్షుద్ర అనువాదాల భాషాసేవ..? చిత్రవిచిత్రమైన కాష్మోరా భాషను అది పాఠకుల మెదళ్లకు రుద్దుతుండగా, సాక్షిది మరో దరిద్రం… అది భాషను అసలే పట్టించుకోదు… సాక్షి బాధ్యులు రోజూ తమ పత్రికలను చదువుతున్నారా లేదానే ప్రశ్న అప్పుడప్పుడూ తలెత్తుతుంటుంది… ఫాఫం జగన్ అని జాలేస్తుంటుంది… దానికి ఓ బలమైన ఉదాహరణ ఇదుగో ఈ పిల్లల కథ… ఆదివారం అనుబంధంలో కనిపించింది… ఈ అనుబంధం పేరు ఫన్ డే… నిజంగానే ఇందులో కనిపించిన తప్పులు జాలితో కూడిన ఫన్ క్రియేట్ చేశాయి సుమా…
Ads
పాత్రికేయ మిత్రులే ఈ తప్పుల్ని చూసి నిర్ఘాంతపోయి, ఆగలేక, తప్పుల్ని దిద్దుతూ పోతే… ఇదుగో ఇలా కనిపించింది… ప్రత్యేకించి దీర్ఘాలు మరిచిపోయారు ఈ కథలో… డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు అట, ఆయన రాసిన కథ… ఆయనే రాశాడో, లేక ఆయన పంపిన స్క్రిప్టును సాక్షిలో కంపోజ్ చేశారో తెలియదు గానీ… ఈ తప్పులతో సదరు రచయిత మీద కూడా జాలేస్తోంది…
పేజీల్లో కంటెంట్ పేర్చాక, ప్రింటింగ్‌కు రిలీజ్ చేసేటప్పుడు ఏ పెద్ద తలకాయ ఈ మ్యాగజైన్‌ను సరిగ్గా చూడటం లేదన్నమాట… నిర్లక్ష్యం… ఈ తప్పులతో పెద్ద నష్టం లేకపోవచ్చుగాక… కానీ సాక్షిలో ఉన్న అవ్యవస్థను పట్టిస్తోంది ఇది… జగన్ సార్… ప్రజాధనంతో కాపీలు కొనిపిస్తావు, ప్రజాధనంతో యాడ్స్ ఇస్తుంటావు… కానీ కాసింత… పత్రికలో కాసింత నాణ్యత ఉండాలనే అసలైన పాయింట్ మరిచిపోతే ఎలా సార్..? పైగా ఈనాడుకు పోటీ అంటారు, దీటు అంటారు, కొట్టేస్తాం అంటారు… ఇదేనా..?!
Share this Article