Murali Buddha………. ముఖ్యమంత్రిని ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం
ముఖ్యమంత్రి తన చేతిలో బొకే పట్టుకొని అరగంట పాటు గుమ్మం ముందు నిలబడ్డా తనను లోపలికి రానివ్వలేదు …. ఆగాగు, సినిమా కథ చెబుతున్నావా ?
కాదు, సినిమా వాళ్ళ కథ .. నిజంగా జరిగిన కథ చెబుతున్నాను .
Ads
సినిమా కథ అయినా ? సినిమా వాళ్ళ కథ అయినా కొంత సహజంగా ఉండాలి . మేం మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నామా ? సీఎం అంటే ప్రోటోకాల్ ఉంటుంది . ఏ ఇంటికి ఎప్పుడు వెళ్లాలో ముందుగానే నిర్ణయిస్తారు . సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ముందే చేరి అన్నీ చూసుకుంటారు .
సీఎం వెళ్లడం , అరగంట ఇంటి ముందు నిరీక్షించడం , ఐనా ఇంట్లోకి రానివ్వకపోవడం కాశీ మజిలీ కథలా ఉంది .
నిజమండి బాబూ నమ్మండి . కథ కాదు నేను కళ్ళతో స్వయంగా చూసిన సంఘటన .
జర్నలిస్ట్ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా , ఎన్నో చారిత్రక సంఘటనల ప్రత్యక్షంగా చూసే అదృష్టం లభిస్తుంది . ఏ వందేళ్లకు ఓ సారి జరుగుతాయి అనిపించే చారిత్రక సంఘటనలకు ఆ కాలం జర్నలిస్ట్ లకు ప్రత్యక్షం గా చూసే అవకాశం లభిస్తుంది .
1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్ ను దించేసి నెల రోజుల వైస్రాయ్ ఎపిసోడ్ తరువాత సెప్టెంబర్ 1 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . అనంతరం బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు .****
మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి సలహాతో అర్జునుడు భీష్ముడి వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కి తాతా నువ్వు ఎలా చస్తావో చెప్పి ఆశీర్వదించు అంటాడు . మహాభారతం లో తప్ప ఇలాంటి దృశ్యం ఊహించలేం . నువ్వు ఎలా చస్తావు చెప్పి పుణ్యం కట్టుకో అని ఎవరైనా ఎవరినైనా అడగ గలరా ? కనీసం ఊహించగలమా ?
అర్జునుడు నయం యుద్ధం లోనే అడిగాడు . బాబు మాత్రం ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేసి చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు . తనలో తానే కుమిలి పోతున్న ఎన్టీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఆలోచన అద్భుతం . చేతిలో బొకే పట్టుకొని దాదాపు అరగంట పాటు హాలులోనే ఉన్నారు . ఎన్టీఆర్ ఉన్న గదిలోకి రమ్మని పిలుపు రాలేదు . కొంత సేపు చూసి బాబు వెనక్కి వెళ్లి పోయారు . తన కాళ్లపై పడితేనే తమ జీవితం ధన్యం అయింది అని మురిసిపోయిన శాసన సభ్యులు తనను దించేయడం తో అవమాన భారాన్ని తట్టుకోలేక కుమిలిపోతున్న ఎన్టీఆర్ చంద్రబాబును లోపలి రానివ్వకపోవడం లో పెద్ద విశేషం ఏమీ లేదు . కానీ తానే దించేసి , మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి అనే ఆలోచన రావడం చంద్రబాబులో వందశాతం రాజకీయ నాయకుడు ఉన్నారని రుజువు చేస్తుంది .
95 ఆగస్టు లో అసెంబ్లీ సమావేశం లో అప్పటికి ఎన్టీఆర్ ఇంకా ముఖ్యమంత్రి నేను సభా నాయకుడిని నన్ను ఎందుకు దించేస్తున్నారు , నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎన్టీఆర్ ఎంత వేడుకున్నా అప్పుడు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు . అదే ఎన్టీఆర్ బాబు ముఖాముఖి చూసుకున్న చివరి సందర్భం . ఇంటికి వచ్చినా బాబును లోనికి రానివ్వలేదు . ఆ ఆతరువాత ఎన్టీఆర్ మరణించారు . అధికారం నుంచి దించేశాక ఎన్టీఆర్ మృత దేహం వద్దకే బాబు వెళ్లారు కానీ జీవించి ఉన్నప్పుడు కలవలేదు .
ఎన్టీఆర్ ను దించేసిన తరువాత కూడా వదిలి పెట్టలేదు .చంద్రబాబు బాగా పాలిస్తున్నాడు అని ఎన్టీఆర్ మెచ్చుకుంటున్నారు అని ఎలిమినేటి మాధవ రెడ్డి మీడియాతో చెప్పారు .. బాబు పాలనను సన్నిహితుల వద్ద మెచ్చుకుంటున్న ఎన్టీఆర్ అని వార్తలు కూడా వచ్చాయి … అప్పుడు మీడియా మొత్తం వారిదే….
Share this Article