Siva Racharla…………. సిద్దరామయ్యే సీఎం, సీఎం ఎంపికతో కర్ణాటక రాజకీయం ముగిసిందని మీడియా సగం శుభం కార్డు వేసింది. మిగిలిన సగం శుభం కార్డు డీకే శివ కుమార్ తిరుగుబాటు చేయకపోతాడా? అన్న ఆశతో కొందరు, అనుమానంతో మరికొందరు అలా ఉంచేశారు.
కాంగ్రెస్ గెలిస్తే సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని నేను RTV వారి ఇంటర్యూలో చెప్పాను. నిజమైన డబల్ ఇంజిన్ సిద్దు-శివ . సిద్దరామయ్యది ప్రజా బలం . సిద్దరామయ్య లేకుంటే బీజేపీ ఎన్నికల ప్రణాళికలు ఒక మేర సఫలం అయ్యుండేవే. గెలుపు కాకున్నా మళ్ళీ హాంగ్ కు అవకాశం ఉండేది.
మరి డీకే శివకుమార్? కాంగ్రెస్కు ఓటు వేయాలన్న ఆలోచన ఉన్నవారిని సమీకరించి ఓటు వేయించిన సత్తా డీకే ది . కాంగ్రెస్ మీదనో సిద్దరామయ్య మీదనో అభిమానం ఉంటే సరిపోదు దాన్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించిన శక్తి డీకే.
Ads
అందుకే సిద్దరామయ్య- డీకే శివకుమార్ నిజమైన డబల్ ఇంజిన్.. Mutually Complemented.
సైద్ధాంతిక విజయం – అహింద (AHINDA)
చాలా విశ్లేషణలు కర్ణాటకలో కాంగ్రెసుది సైద్ధాంతిక విజయంగా పేర్కొన్నాయి కానీ ఆ సిద్ధాంతం ఏమిటి అన్నదాని మీద మంచి విశ్లేషణ కనిపించలేదు.
90వ దశాబ్దంలో జనతాదళ్ విచ్చిన్నం, చిక్ మంగుళూరులో బాబా బుడాన్ గిరి మీద ఉమా భారతి వివాదం, లింగాయత్ నేతగా యడ్యూరప్ప ఎదగటం, దేవ గౌడ ప్రధాని కావటం.. 2004 కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం.. జేడీఎస్ తరుపున ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్యను సీఎం పదవికి అడ్డుపడతాడని సస్పెండ్ చేయటం , బీజేపీ సహాయంతో కుమారస్వామిని సీఎం చేయటం, అక్కడ నుంచి మొదలవుతుంది మనం చూస్తున్న కర్ణాటక రాజకీయం
AIHINDA
సిద్దరామయ్య జేడీఎస్ నుంచి బయటకొచ్చిన తరువాత కొద్ది కాలం All India Progressive Janata Dal పార్టీని పునః ప్రారంభించి AIHINDA సదస్సుల పేరుతో రాష్ట్రం మొత్తం విస్తృతంగా తిరిగారు. AIHINDA అంటే words Alpasankhyataru (Minorities), Hindulidavaru (Backward Classes) and Dalitaru (Dalits).
ఒక వైపు బీజేపీ ఆధ్వర్యంలో పెరుగుతున్న మత ప్రభావం మరో వైపు లింగాయత్ ,వక్కలిగ లాంటి కులాలకు ప్రాతినిధ్యం వహించే బలమైన మఠాల ప్రభావం వీటిని దాటుకొని AIHINDA పేరుతో సిద్దరామయ్య రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. అనేక కులాలు ఈ బ్యానర్ కింద ఏకం కావటం వలన దీనికి కుల ముద్ర పడలేదు. సిద్దరామయ్య కులం కురుబ అయినా AIHINDA లో కురబేతర నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.
2008 ఎన్నికల నాటికి సిద్దరామయ్య కాంగ్రెస్లో చేరటం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80, బీజేపీ 110, జేడీఎస్ 28 సీట్లు సాధించి బీజేపీ నేత యడ్యూరప్ప సీఎం కావటం జరిగింది. బళ్లారిలో గాలి సోదరుల వైభవం ఆకాశాన్ని అంటింది.
నీళ్లలో ఉంటేనే మొసలి బలం
నీళ్లలో ఉంటేనే మొసలి బలం, అధికారంలో ఉంటేనే కాంగ్రెస్ లో నాయకులు కనపడేది. 2008 ఓటమి తరువాత యస్ ఎం కృష్ణ, ధరమ్ సింగ్ లాంటి నేతలు క్రియాశీలకంగా లేకపోవటం నేటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , నాటి పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వంటి దళిత నాయకులకు పూర్తి స్థాయిలో పట్టు దక్కకపోవడం .. సిద్దరామయ్య తిరుగులేని నాయకుడయ్యాడు .
సిద్దరామయ్య కాంగ్రెస్లో ఉన్నా AHINDA ను వదలలేదు. ఆ సదస్సులను నిరంతరం కొనసాగించారు.
సిద్దు సీఎం
2013 ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో (122 సీట్లు) గెలిచి సిద్దరామయ్య సీఎం అయ్యారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ప్రచారం చేసిన AHINDA సిద్ధాంతాన్ని విధానాల రూపంలో అమలు పరిచారు.
నిజమైన అవసరాన్ని తీర్చేదే నిజమైన సంక్షేమం. సిద్ధరామయ్య పథకాల్లో ఇప్పటికీ కన్నడ ప్రజలు చెప్పుకునేది “అన్న భాగ్య” స్కీం. గర్భవతులకు ఉచితంగా అన్నం, పాలు మరియు గుడ్లు ఇచ్చేవారు.
బీపీఎల్ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఐదు కేజీల బియ్యం, రెండు కేజీల గోధుమలు ఉచితంగా , ఒక కేజీ కందిపప్పు సగం రేటుకి ఇచ్చేవారు. చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు ఉన్నా కర్ణాటకలో అమలైన తీరు మరియు లబ్ధిదారుల ఎంపిక వలన ఈ పథకం కాంగ్రెస్కు, సిద్ధరామయ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి.
2023 ఎన్నికల నాటికి AHINDA ఒక అంశం మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెసుకు అన్ని వర్గాల నుంచి ముఖ్యంగా లింగాయత్, వక్కలిగల నుంచి కూడా మంచి మద్దతు దక్కింది.
2005 కు ముందు దేవెగౌడ చాలాసార్లు అనేవారు నాకు త్రిమూర్తులు ఉన్నారు, వారు ఉన్నంతకాలం జేడీఎస్ కు తిరుగు లేదు అని.. ఆ త్రిమూర్తులు పిజిఆర్ సింధ్య ,ఎంపీ ప్రకాష్, సిద్ధరామయ్య .. వీరు ముగ్గురు గొప్ప నాయకులే కానీ సిద్దరామయ్య మాత్రమే సీఎం స్థాయికి , రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు.. అది ఆయన సైద్ధాంతిక బలం.
కాంగ్రెస్ గెలిస్తే సిద్ధరామయ్య సీఎం కావటం అనేది ఎన్నికల కన్నా ముందే జరిగిన నిర్ణయం అని నా అభిప్రాయం. దీనికి డీకే కూడా అంగీకరించి ఉంటారు. గత రెండు రోజులు జరిగింది ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉండాలి, మంత్రి వర్గంలో ఎవరు ఉండాలి అన్నదాని మీదనే కావొచ్చు. ఎన్నికలు సమయంలో కాంగ్రెసులో కుమ్ములాటలు చూడని, నేనే సీఎం లాంటి ప్రకటనలు లేని ఎన్నికలు తొలిసారి చూశాము .
దేవరాజ్ అర్స్
ఈ సందర్భంలో AHINDA పితామహుడు దేవరాజ్ అర్స్ గురించి ఒక మాట రాయాలి. నిజలింగప్ప సిండికేట్ గ్రూప్ ఇందిరా కాంగ్రెస్ ను వదిలేలా చేసినప్పుడు ముఖ్యంగా 1972 ఎన్నికల్లో దేవరాజ్ అర్స్ కర్ణాటకలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ ను గెలిపించారు, ఆయన సీఎం అయ్యారు.
దేవరాజ్ అర్స్ క్షత్రియుడైనా రైతుల పక్షం ఆలోచించాడు. కమ్యూనిస్టుల “దున్నేవాడిదే భూమి” నినాదాన్ని అమలు పరిచాడు. వలస కూలీల కోసం షెల్టర్స్ , ప్రతి ఇంటికో బల్బ్ , గ్రామీణ రుణ మాఫీ లాంటి పథకాలతో కర్ణాటక రూపు మార్చాడు.
వీటన్నిటిని మించి కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ,హార్డ్వేర్ ఉద్యోగాలు చేస్తున్న “Electronic City” కి 1976లో పునాది వేసింది దేవరాజ్ అర్స్ .
లింగాయత్ ప్రత్యేక మతం, రిజర్వేషన్ల పెంపు లాంటి అసాధ్యమైన అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా సామాజిక,ఆర్ధిక , పారిశ్రామిక మార్పులు తీసుకు వచ్చే విధానాలతో కాంగ్రెస్ సిద్దరామయ్య ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కాకపొతే మరెప్పుడు అనే ప్రశ్న డీకే శివకుమార్ విషయంలో వర్తించదు. 15 సంవత్సరాల భవిషత్తు డీకే కు ఉన్నది.
Share this Article