ఎవరి పని వాళ్లు చేయాలి… ఈ మాటను సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఇష్టపడరు… అవసరమైతే అన్ని పనులూ తామే చేపడతారు… ఇది బహుముఖ ప్రజ్ఞ అని మనం చప్పట్లు కొట్టాలో, వేర్వేరు శాఖల నిపుణులతో సరైన ఔట్ పుట్ తీసుకోలేని వైఫల్యం అనుకోవాలో తెలియదు… విజయ్ ఆంటోనీ తాజా సినిమా బిచ్చగాడు-2 చూస్తుంటే ఇదే స్ఫురిస్తూ ఉంటుంది…
నిజానికి ఈ బిచ్చగాడు… నాటి సూపర్ హిట్ బిచ్చగాడికి సీక్వెల్ ఏమీ కాదు… జస్ట్, నాటి బ్రాండ్ ఇమేజీని సొమ్ము చేసుకోవడానికి బిచ్చగాడు 2 అని పేరు పెట్టారు అంతే… నాటి బిచ్చగాడిలో మదర్ సెంటిమెంట్… నేటి బిచ్చగాడిలో కాస్త సిస్టర్ సెంటిమెంట్… ఇది యాక్షన్, క్రైమ్, ఫాంటసీ ఎట్సెట్రా కలిపి వండబడిన ఓ కిచిడీ కథ…
విజయ్ ఆంటోనీ విషయానికి వస్తే… ఎవరో దర్శకత్వం వహించాల్సిన ఈ సొంత సినిమాకు తనే మెగాఫోన్ చేతపట్టాడు… నిజం చెప్పాలంటే ఆంటోనీ హీరో పాత్రతోపాటు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నాడు… సీనియారిటీ ఉన్న దర్శకుడిగా అలవోకగా చేస్తూ పోయాడు… ఈ సినిమా కోసం తను ఎంతటి బహుముఖ ప్రతిభను, పాత్రల్ని చూపించాడో దిగువన ఓ లుక్కేసుకొండి…
Ads
కథలోకొస్తే… విజయ్ గురుమూర్తి బాగా రిచ్చెస్ట్… తనను చంపేసి, ఇంకెవరిదో బ్రెయిన్‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేసేసి, ఆ ఆస్తి మొత్తం కాజేయాలని విలన్ కుట్ర… కానీ కథ అడ్డం తిరుగుతుంది… ఈ క్రమంలో అనూహ్య సంఘటనలే కథ… ఇందులో సెంటిమెంట్‌కన్నా ఓ క్రైం స్టోరీయే ప్రధానంగా కనిపిస్తుంది… నిజానికి బ్రెయిన్ ఛేంజ్ అనేది చాలా సీరియస్, డెప్త్ సబ్జెక్టు… జస్ట్, కథ కోసం దీన్ని వాడుకున్నారు, అంతే… ఇదేదో మెదడు మార్పిడి మీద తీయబడిన కొత్తకథా చిత్రం అనుకునేరు సుమా…
విజయ్ గురుమూర్తి ఆస్తిప్రతిష్టలు చూస్తుంటే… అనుకోకుండా మన ఆలోచనలు అంబానీ మీదకో, ఆదానీ మీదకో వెళ్లి, ఇంకేవో ఊహాత్మక కథల్ని అప్పటికప్పుడు అల్లుకుంటే అది ఈ కథకుడి తప్పేమీ కాదు… సినిమాలో ఫస్టాఫ్ కాస్త వెరయిటీగా, కొత్తకొత్తగా అనిపించినా, సెకండాఫ్ నుంచి కథ అనేక కప్పగెంతులు వేస్తూ, క్లైమాక్స్ మెరుపులతో చివరకు కథ కంచికెళ్తుంది… పెద్దగా కనెక్టింగ్ కథ కాదు, టేకింగ్ కాదు, విభ్రమ కలిగించే ట్రీట్‌మెంటూ కాదు…
కాకపోతే ప్రిజుడీస్ భావనలతో గాకుండా జీరో మైండెడ్‌గా వెళ్తే… సినిమా బోర్ ఉండదు… కాకపోతే తెలుగులోకి డబ్బయ్యే అన్ని తమిళ సినిమాల్లాగే వేధించే కొన్ని అంశాలు భరించాల్సి ఉంటుంది… అందులో తప్పనిసరిగా భరించాల్సిన ఓ అంశం యోగిబాబు… తనను ఈ డబ్ సినిమాల్లో చూస్తుంటే చిరాకేస్తోంది… ఇక ఎప్పటిలాగే తెలుగులో పాటల గురించి ఎవరికీ పట్టదు… ఏవో కొన్ని రణగొణ ధ్వనులు…
డైలాగ్స్ మీద కూడా పెద్ద ఎఫర్ట్ జరిగినట్టు కనిపించదు… అన్నీ తమిళ మొహాలే… ఇంతకీ సినిమా చూడొచ్చా అంటే వెంటనే జవాబు కష్టం… కాకపోతే ఏదో ఒకటి, టైంపాస్ పల్లీ బఠానీ సినిమా, టైమ్ పాస్ కోసం అనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా వెళ్లొచ్చు… నో నష్టం…!! అన్నట్టు… మరోసారి ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తే చాలు కదా, మళ్లీ ఈ కొత్త తలనొప్పి ఎందుకు అంటారా..? మీ ఇష్టం…!! సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాటల్లో చెప్పాలంటే… మొదటి బిచ్చగాడు ఆర్గానిక్, ఈ బిచ్చగాడు హైబ్రీడ్…
Share this Article