నగరి ఎమ్మెల్యే రోజా భోరుమని ఏడ్చింది… అధికారులెవరూ నన్ను పట్టించుకోవడం లేదు… చివరకు కలెక్టర్ కూడా అంతే… ప్రొటోకాల్ లేదు, మర్యాద లేదు, ప్రాధాన్యత లేదు… చివరకు టీటీడీ కూడా అంతే అంటూ రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట విలపించింది అని ఒక వార్త కనిపించింది… తనకు ఓ ఎమ్మెల్యేగా దక్కాల్సిన గౌరవమర్యాదలు దక్కడం లేదు అనేది ఆమె బాధ… ఆమె ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిందనీ, కమిటీ ఎదుట ఏడ్చేసిందనీ ఆ వార్త సారాంశం… విస్మయపరిచింది వార్త… ఎందుకంటే రోజా మర్యాద కోసం ఏడవడం అని కాదు… ఆ పరిస్థితి ఎందుకొచ్చిందీ అని..! అసలు ఎక్కడా ఏ ఎమ్మెల్యేకు రాని సమస్య రోజాకే ఎందుకొస్తున్నది..? అదీ ఇంట్రస్టింగు ప్రశ్న…
నిజానికి బయట ఆమెకు ఉన్న ఇమేజీ ప్రకారం… ఆమె డాషింగ్, డేరింగ్, డైనమిక్… తనకు దక్కాల్సిన గౌరవ మర్యాదల్లో ఏం తేడా వచ్చినా సరే, సంబంధిత అధికారి కాలర్ పట్టుకుని నిలదీసే తత్వం… అదేదో రచ్చబండ అనే టీవీషోలో ఆమె కోపమొచ్చి పంచాయితీకి వచ్చిన వాళ్లను ఈడ్చి కొడుతుందట కదా… జబర్దస్త్ షోలో కమెడియన్లందరూ, నిర్మాత మల్లెమాల సహా గడగడా వణికిపోతూ, తను చెప్పినట్టుగా వింటారని కదా బయట టాక్… మరి ఈ కన్నీళ్లేమిటి..? పైగా ఏ ఎమ్మెల్యేకూ రాని సమస్య ఈమెకే ఎందుకొస్తోంది..? అంటే… సమస్య ఈమె వైపే ఉందా..? ఇలాంటి సమస్య ఎదురైతే నేరుగా జగన్‌ను కలిసి చెబితే తను ఒకే నిమిషంలో సెటిల్ చేస్తాడు కదా… సొంత పార్టీ అధికారంలో ఉంది, ఇలాంటి కన్నీటి ఎపిసోడ్లు జగన్‌కే కదా తలవంపులు… మరి ఆమె తన శోకాలతో జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..? తన పట్ల చంద్రబాబు ఏ ధోరణి ప్రదర్శించాడో, జగన్ కూడా అంతే అని చెప్పదలుచుకుందా..? వైసీపీ పట్ల, జగన్ పట్ల అపనమ్మకం అనే సంకేతాలను ఇవ్వదలుచుకుందా..?
Ads
జగన్ ఆమెను మంత్రిని చేస్తారని మొదట్లో అందరూ అనుకున్నారు… కానీ జగన్ లెక్కలు వేరే ఉంటయ్… ఆ లెక్కల్లో ఆమె ఫిట్ కావడం లేదు… అదే నియోజకవర్గంలో ఆమెకు సమాంతర నేతలు తయారవుతున్నారు సొంత పార్టీలోనే… ఒకామెకు జగన్ ఏదో కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చాడు… జిల్లా మంత్రులు, ముఖ్య నేతలు సైతం రోజాను కాదని, ఆమె వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణ ఎవరో కాదు, ఆమే చేస్తోంది… దీనికి పరిష్కారం సింపుల్… ప్రివిలేజ్ కమిటీల ఎదుట ఏడ్చి, నాకు మర్యాద కావాలి దేవుడోయ్ అని దేబిరించడం కాదు… ఈ దిక్కుమాలిన జబర్దస్త్ షోలు, వాటిల్లో పిచ్చి డాన్స్ గెంతులు గట్రా విడిచిపెట్టి… వీలైనన్ని రోజులు జనంలో ఉండటం, తనకు అప్పగించిన కార్పొరేషన్ విధులు చూసుకోవడం, జనంలో పట్టు పెంచుకోవడం, అప్పుడిక ఏ వ్యతిరేక వర్గమూ ఏమీ చేయలేదు… ఏదో బోర్ బావి స్టార్ట్ చేసి, బాటలో పూలు చల్లించుకునే రాచరికం టైపు పోకడ కాదు… కాస్త ప్రజల పట్ల హంబుల్‌నెస్ ప్రదర్శించాలి… అప్పుడు ఈ సోకాల్డ్ అధికారులు ఆమె ఎదుట నిలబడి సెల్యూట్ కొట్టకపోతే చూడండి..!!
Share this Article