నటి డింపుల్ హయాతిపై పోలీసులు కేసు నమోదు చేశారు… ఎందుకు..? ఓ డీసీపీ కారును తన్నిందట… ఆయన అత్యవసర విధులకు ఆటంకంగా ఆమె తన కారును సదరు సర్కారీ వాహనానికి అడ్డం పెడుతోందట… అందుకని పోలీసులు కేసు పెట్టేసి, నోటీసులు జారీ చేశారుట… తెలంగాణలో ‘హోం’ పరిస్థితిపై నిష్పక్షపాత సమీక్ష, యాక్షన్ ఏ స్థితిలో ఉన్నాయో తెలిసినవాళ్లకు నటిపై కేసు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు… కానీ పోలీస్ పెద్దలు ప్రజల్లో నెలకొన్న కొన్ని సందేహాలకు సమాధానాలు ఇస్తే అది అధికార పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేకూరుస్తుంది…
సహజంగానే పోలీసులు చెప్పిన వెర్షన్‌నే మీడియా పరిగణనలోకి తీసుకున్నట్టుగా ఆ వార్తలు కనిపిస్తున్నాయి… ఆమె కోణంలో పెద్దగా ఆలోచించలేదు తమకు అలవాటైన రీతిలో… టీవీ కవరేజీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పోలీసుల జోలికి, పోలీసులతో పంచాయితీలకు వెళ్లరు… కానీ డింపుల్ హయాతి ఇలా వ్యవహరిస్తున్నదీ, ధైైర్యంగా నిలబడిందీ అంటే ఆమె ఎంతగా వెక్స్ అయిపోయి ఉండాలి..?
Ads
ఆమె కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే తీసుకోలేదు సరికదా 3 గంటలపాటు అక్కడే కూర్చోబెట్టారని ఆమె లాయర్ చెబుతున్నాడు… కానీ సదరు పోలీస్ డ్రైవర్ వెళ్లగానే, ఆమె మీద కంప్లయింట్ నమోదు చేసుకుని, ఆమెకు నోటీసులు పంపించారు… అదేమంటే విచారణలో నిజాలు తేలతాయి అంటున్నారు…
కేసు నమోదులోనే పోలీసులు ఏ సైడ్ తీసుకున్నారో అర్థమవుతోందిగా… పైగా ఆయన పదవిలో ఉన్న వ్యక్తి… అదీ పోలీస్ కొలువు…
ప్రైవేటు అపార్ట్‌మెంటులో ఆమె కారుకు అడ్డంగా ప్రికాస్ట్ డివైడర్లను ఎందుకు పెట్టినట్టు..? ఇది నేరం కాదా..? అసలు అపార్ట్‌మెంట్లలో పోలీస్ డివైడర్లు ఎందుకు..? అదేమంటే, అత్యవసరంగా విధుల్లోకి వెళ్లాలి కాబట్టి అని అంటున్నారు… అందుకని ఇతర కార్లకు డివైడర్ల సంకెళ్లు వేస్తారా..?
విధులకు ఆటంకం అనే ముద్ర వేస్తున్నారు… కానీ ఇది ఇద్దరు వ్యక్తుల నడుమ ఓ ప్రైవేటు పంచాయితీ… దానికి సర్కారు విధులనే పెద్ద పెద్ద పదాలు దేనికి..?
ట్రాఫిక్ పోలీసులు వాడే కోన్స్‌ను అపార్ట్‌మెంట్‌లో ఎందుకు వాడుతున్నట్టు..?
సర్కారు ఉద్యోగి విధులను అడ్డుకోవడం ఏముంది ఇందులో..? నిజానికి ఆమెపై పెట్టిన సెక్షన్లు 341, 279 ఈ కేసులో పోలీసులకు కూడా వర్తిస్తాయి కదా…?
ఆమె కారుపై వరుస చలాన్లు కక్షసాధింపు కాదా..?
పోలీసులు ఆమె ఇంటికి సివిల్ డ్రెస్సులో వెళ్లడం కూడా తప్పేనని ఆమె లాయర్ అంటున్నాడు… ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ నోటీసులు జారీ చేశారట…
అవునూ, ఒక పోలీసు అత్యవసరంగా విధులకు వెళ్లే అవసరముంటే… ఆ పరిసరాల్లో బతికే ప్రజలందరూ ఆ విధుల కోసం త్యాగాలు చేయాల్సి ఉంటుందా..? ఇలాంటి కేసులతో పోలీసుల ప్రతిష్ఠ పెరుగుతుందనీ, ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందనేది పెద్దల భావనా..?!
ఏ బ్యాక్ గ్రౌండూ లేని ఓ సినిమా నటి ఎంత విసిగిపోయి ఉంటే, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులతో ఇలా వ్యవహరిస్తుంది, ఇలా మాట్లాడుతుంది..? ఈ కోణాన్ని అందరూ ఎందుకు విస్మరిస్తున్నట్టు..?! ట్రాఫిక్ అధికారి ప్లేసులో లా అండ్ ఆర్డర్, క్రైమ్ పోలీసు అధికారి ఉండి ఉంటే ఇంకెలా ఉండేదో…!! ఒక పోలీసు ప్రైవేటు తగాదాలో మొత్తం పోలీస్ వ్యవస్థ అండగా నిలవాలా..?
Share this Article