ఎందుకో గానీ ఇలాంటి వార్తలు నార్తరన్ ఇండియాలోనే ఎక్కువ కనిపిస్తుంటయ్… దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో స్త్రీ పట్ల వివక్ష, అణిచివేత అధికం అంటుంటారు… కానీ నార్తరన్ ఇండియాలోనే అవసరమైతే ఆడది అపరకాళిక అయిపోతుంది… అన్యాయం చేయాలనుకునే వాడి ముక్కుపట్టుకుని లాక్కొచ్చి, మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తుంది… ఇదీ అలాంటి కథే…
ఉత్తరప్రదేశ్, బారబాంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బరదారి ఏరియా..,. బదవా జిల్లాకు చెందిన ఒకతనితో ఒకామె రెండున్నర సంవత్సరాలుగా కలిసి ఉంటోంది… అదేనండీ, సహజీవనం చేస్తోంది… కొన్ని ఏరియాల్లో, కొన్ని వర్గాల్లో సహజీవనం ఆమోదనీయమే… అందులో పెద్ద విశేషం ఏమీ లేదు…
సరే, రెండు కుటుంబాల నడుమ సంప్రదింపులు జరిగాయి… స్థానికంగా ఓ గుళ్లో ఇద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయం జరిగింది… ముహూర్తం రోజు సమీపించింది… తాళి కట్టే ముహూర్తం ముంచుకొస్తోంది… ఏడీ..? అసలు కథానాయకుడు ఏడి..? లేడు… కనిపించడం లేదు… ఎటు పోయాడు..? అరెరె, వెతకండి, వెతకండి…
Ads
ఆమెకు డౌటొచ్చింది… కొన్నాళ్లుగా కలిసి జీవిస్తోంది కదా, వాడి ఆంతరంగం ఏమిటో సందేహపడింది… జంప్ అని అనుమానించింది… ఫోన్ చేసింది… ఆమె కొంచెం లక్కీ… ఫోన్ స్విచాఫ్ చేసి, చెక్కేయలేదు… ఫోన్ ఆన్‌లో ఉంది… కాల్ చేసిన వధువు, ఏమిటీ సంగతి అనడిగేసింది నేరుగా… కన్నీళ్లు, సినిమాటిక్… కాదు, కాదు, టీవీ సీరియళ్ల బాపతు బతిమిలాటలు ఏమీ లేవు…
బ్బెబ్బె అంటూనే వరుడు ‘తన తల్లిని తీసుకురావడం కోసం బదువా వెళ్తున్నట్టు ఏదో బొంకాడు… బొంకు ఆమెకు అర్థమైంది… తియ్యండిరా బండ్లు అనరిచింది… ఒక్క క్షణం కూడా ఆలస్యం లేదు… బరేలీకి 20 కిలోమీటర్ల దూరం వేగంగా వెళ్లింది… దొరికాడు… ఖిమోరా పోలీస్ స్టేషన్ దగ్గర ఓ బస్సు ఎక్కుతూ దొరికాడు… ఆమె అతన్ని పట్టేసుకుంది…
అంత సాఫీగా ఎందుకు జరుగుతుంది..? రోడ్డు మీద రచ్చ, పంచాయితీ… వాడి మెడపట్టుకుని వెహికల్‌లో పడేసింది… కథ ఆమె ఊరికి వచ్చిపడింది… కాస్త కులం మర్యాద చూపించారు… ఏడుస్తూనో తుడుచుకుంటూనో ఆమె మెళ్లో తాళి కట్టాడు… ఆమె అప్పుడు నవ్వింది… బాగుంది కదా కథ… అసలు టీవీ సీరియళ్ల కథలు ఇలా ఎందుకు ఉండకూడదు… ఎన్ని సీరియళ్లు చూసినా హీరోయిన్‌ను చంపడానికి, కడుపు నాశనం చేయడానికి, మాట పడిపోవడానికి నానా విషాలు, రసాయనాలు, కుట్రలు, వేషాలు చూపిస్తుంటారు… అక్కడికి తేరగా మార్కెట్‌లో విషాలు, పక్షవాత కారిణులు, హంతక మెటీరియల్ దొరుకుతున్నట్టు… పోలీసులు ఏదో చూసీచూడనట్టు నటిస్తున్నట్టు…
ఇలాంటి సంఘటనలకు మీడియా కూడా ఎందుకు ప్రయారిటీ ఇవ్వదో అర్థం కాదు… ఇలాంటివి ఆడపిల్లలకు మానసికంగా ఎంత భరోసానిస్తాయో మాటల్లో చెప్పగలమా అసలు..? వేల పెళ్లిళ్ల నడుమ ఒకటోరెండో ఇలాంటివి ఉంటాయి ఉదాహరణలు… అయితేనేం… వాటికే కదా ప్రయారిటీ, పత్రికల్లో స్పేస్ బాగా దక్కాల్సింది..? టీవీలను వదిలేయండి… అవి ఎందుకూ పనికిరాని బొమ్మల డబ్బాలు… అవునూ, ఇంత జరిగితే వాడు సాఫీగా సంసారం చేస్తాడా అనేదేనా మీ ప్రశ్న… ఎందుకు చేయడు..? కాకపోతే ఆమె చేతులకు అప్పుడప్పుడూ కాస్త పని తగుల్తుంది…!!
Share this Article