Unity in Monkeys: మనిషికి- కోతికి మధ్య ఎంత తెంచేసినా తెగని బొడ్డు బంధమేదో ఉంది. డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం కోతి నుండి పుట్టిందే ఈ మానవ రూపం. అందుకే దాశరథి చాలా స్పష్టంగా “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అని ప్రశ్నించారు. నాలుగు కాళ్ళు కాస్త రెండు కాళ్ల ఆస్ట్రలోపితికస్, నియాండర్తల్ లాంటి చింపాంజీ రూపాలేవో వచ్చాయని మానవ శరీర నిర్మాణ శాస్త్రం- ఆంత్రోపాలజీ చెబుతోంది.
ఆదికావ్యం రామాయణంలో అత్యంత పవిత్రమయినది, యుగయుగాలుగా పారాయణ యోగ్యమయినది సుందరకాండ. బాలకాండ, అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, యుద్ధ కాండ, ఉత్తర కాండ అని ఎక్కడ జరిగిందో, ఏమి జరిగిందో అన్నదాన్ని బట్టి కాండలకు స్పష్టంగా పేరు పెట్టిన వాల్మీకి సుదరకాండకు మాత్రం వేరే పేరు పెట్టాడు. నిజానికి వాల్మీకి మిగతా కాండలకు పెట్టిన పేర్లను ప్రమాణంగా తీసుకుంటే సుందరాకాండకు “హనుమ కాండ” అన్న పేరే సరిపోయి ఉండేది. వాల్మీకి మహర్షి. రుషి హృదయాన్ని మనం పట్టుకోవాలి.
“సుందరే సుందరో రామ:సుందరే సుందరీ కథ:సుందరే సుందరీ సీతసుందరే సుందరం వనంసుందరే సుందరం కావ్యంసుందరే సుందరం కపి:సుందరే సుందరం మంత్రంసుందరే కిం న సుందరం?”
అని బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక శ్లోకం. సుందరమైన- రాముడు; కథ; సీత; అడవి; కావ్యం; హనుమ; మంత్రం. సుందరకాండలో సుందరం కానిదేది? అని ఈ శ్లోకం అర్థం. ఇంకా లోతయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే ఆధ్యాత్మిక, యోగ విద్యా రహస్యాల అర్థాలు కూడా ఉన్నాయి కానీ…అవన్నీ ఇక్కడ అనవసరం.
Ads
రాముడికి- ఆంజనేయుడికి మధ్య భీకరమయిన యుద్ధం జరిగినట్లు; రాముడు కోపంతో బాణం వేస్తే…ఆంజనేయుడు లెక్కచేయకుండా రామనామాన్ని జపిస్తుండగా…రామబాణం ఏమీ చేయలేక విరిగిపోయి కింద పడిపోయినట్లు…రామబాణం కంటే రామనామమే గొప్పదని రాముడికే హనుమ పద్యాలతో క్లాస్ తీసుకున్నట్లు…ఎన్నెన్ని నాటకాలు వచ్చాయో? రామాంజనేయ యుద్ధం పేరిట ఎన్నెన్ని సినిమాలు వచ్చాయో? లెక్కే లేదు.
వాల్మీకి కంటికి కనిపించని, వాల్మీకి చెప్పని ఈ రామాంజనేయ యుద్ధం ఎప్పుడు, ఎవరి కలలో భీకరంగా జరిగిందో తెలియదు.
“ఆఫ్టరాల్ కోతి అని నన్ను తక్కువ చేస్తున్నావా స్వామీ!
ఆఫ్టరాల్ మా కోతులే లేకపోతే-
నీ సీత జాడ నీకు తెలిసేదా?
నువ్ సముద్రం దాటగలిగి ఉండేవాడివా?
లక్ష్మణుడు మూర్ఛబోతే సంజీవని వచ్చేదా?
రావణుడి మీద గెలుపు సాధ్యమయ్యేదా?”
అని హనుమ అత్యంత వినయంగా చేతులు జోడించి…రాముడిని నిలదీసినట్లు అంతులేని రాగంతో కొన్ని శతాబ్దాలుగా పద్యం వినపడుతూనే ఉంది. హనుమ కోణంలో చూసినప్పుడు ఇవన్నీ అడగాల్సిన ప్రశ్నలే కదా అని అనిపించేలా కథనాలను వండి వార్చినవారి చమత్కారం, కల్పన కూడా ఒక్కోసారి మెరుపులా తోస్తుంది.
కిష్కింధ ఒక్క త్రేతాయుగానికే పరిమితం కాదు. భూమ్మీద కొండలు ఉన్నంతవరకు, సముద్రం ఉన్నంతవరకు రామాయణం ఉంటుందని వాల్మీకికి బ్రహ్మ అభయమిచ్చాడు. కాబట్టి ఎన్ని యుగాలు దొర్లినా రామాయణమూ ఉంటుంది. కిష్కింధ కూడా ఉంటుంది. కోతులకూ మనసుంటుంది. ఆ మనసు గాయపడితే కన్నీళ్ళుంటాయి. దెబ్బ తగిలితే ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదల ఉంటుంది. ఒక కోతి కోసం మొత్తం కోతులు ఒక్కటై లోకం మీద పడే తెగువ, ఐకమత్యం ఉంటాయి.
“ఇదేమన్నా త్రేతా యుగమా? పద్యాలు పాడుకుని వెళ్లిపోవడానికి?
కలియుగం. కిష్కింధ సినిమా చూపిస్తాం” అని తొడగొట్టి కిచ కిచ సవాలు చేశాయి. తోక ఎత్తి భీషణ ప్రతిజ్ఞ చేశాయి. అద్దాల తలపుల్లో నుండి ఈ భీకర సినిమాను చూస్తున్న మందుల షాపు వారు బీ పి లు పెరిగి చేతికి దొరికిన మందులు వేసుకుంటూ…బిక్కు బిక్కు మని సాయంత్రం దాకా ప్రాణాలు ఉగ్గబట్టుకుని గడిపారు.
చివరికి కోతులే మనసు మార్చుకుని వెళ్లిపోవడంతో…చనిపోయిన కోతి పిల్లకు ఊరవతల శాస్త్రీయంగా అంత్యక్రియలు చేసి… ఆంజనేయస్వామీ! తప్పయింది. క్షమించు. లక్షెట్టిపేటకు నీవే దిక్కు! అని మొక్కుకుని వచ్చారు.
ఏ కోతిలో ఏ పాత పగ ఎప్పుడు ప్రజ్వరిల్లుతుందో? చెప్పగలవారు ఈ ఆధునిక కిష్కింధ కాండలో ఉంటారా?
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article