రజినీకాంత్… సినిమా ప్రపంచంలో పరిచయం ఏమాత్రం అక్కర్లేని పేరు… కోట్ల మంది అభిమానులు… తెర మీద కనిపిస్తే చాలు, కాసుల వర్షం… 73 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరో పాత్రలు వేస్తున్నా సరే, రొటీన్ కమర్షయల్, ఇమేజీ బిల్డప్పుల సినిమాలు తీస్తున్నా సరే జనం చూస్తున్నారు… ప్రజలు చూపే అభిమానంలో వీసమెత్తు తేడా రావడం లేదు… అలాంటి రజినీకాంత్ సినిమా నటుడు కాకమునుపు ఓ బస్ కండక్టర్… బెంగుళూరులో… హీరో కావడానికి నానా కష్టాలూ పడ్డాడు మద్రాసులో… అయితే అప్పుడెలా బతికేవాడు…?
ఏమాత్రం దాపరికం, హిపోక్రసీ లేకుండా షేర్ చేసుకున్నాడు… ఎస్, నిజానికి అవి తన అభిమానులకు, సగటు ప్రజానీకానికి కూడా ఆచరణీయం… రజినీకాంత్ వంటి స్టార్ హీరో చెబితే ఆ మాటలకు ఉండే విలువ అపారం… ఇంతకీ తను ఎలా బతికాడో తన బావమరిది, నటుడు, రైటర్ వైజీ మహేంద్ర ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తనే చెప్పుకొచ్చాడు…
Ads
బాలీవుడ్ షాదీస్ రిపోర్ట్ చేసిన ప్రకారం… ఈ కార్యక్రమంలో రజినీకాంత్ దే ప్రధాన ప్రసంగం… తను మాట్లాడుతూ… ‘‘వైజీ మహేంద్రకు థాంక్స్… ఎన్ని చెప్పినా తక్కువే… నా భార్య లతతో నా పరిచయం మహేంద్ర వల్లే… పెళ్లి కూడా తనవల్లే… తను లేకుండా లతతో నా పెళ్లి లేదు…
నాకు ఇప్పుడు 73 ఏళ్లు… నేను ఈరోజుకూ ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం నా భార్య లత… నేను బస్ కండక్టర్‌గా పనిచేసేటప్పుడు అరాచకంగా బతికేవాడిని… కొందరు రాంగ్ పర్సన్స్‌తో స్నేహం… చెడు అలవాట్లు చాలా ఉండేవి… రోజుకు రెండుసార్లు మటన్ తినేవాడిని… అసలు మటన్ లేకపోతే నా తిండే లేదు…
రోజూ తాగేవాడిని… ఆల్కహాల్ లేకుండా రోజు గడిచేది కాదు… అంతేకాదు, రోజుకు ఎన్ని సిగరెట్లు తగలేసేవాడినో లెక్కే లేదు… వెజిటేరియన్ కూరల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది… అసలు వీటిని జనం ఎందుకు తింటున్నారు అనుకునేవాడిని… అంతగా నాన్ వెజ్‌కు అడిక్షన్ నాది… సినిమాల్లోకి వచ్చాక డబ్బు వచ్చింది… పేరొచ్చింది… ఇంకేముంది..? నా అలవాట్లు మరింత విజృంభించాయి…
డెయిలీ మార్నింగ్ మటన్ పాయ తప్పనిసరి… అప్పం, చికెన్ సరేసరి… నిజానికి సిగరెట్లు, మందు, మటన్ డెడ్లీ కాంబినేషన్… ఈ రెగ్యులర్ వాడకం మనిషిని 60 ఏళ్లలోపే ప్యాకప్ చేస్తుంది… బోలెడు ఉదాహరణలున్నాయి మన చుట్టూ అనేక జీవితాల్లో… అవన్నీ చెప్పుకోవడం ఎందుకులే గానీ లత నన్ను ప్రేమతో మార్చుకుంది… నియమబద్ధ జీవితం వైపు మరల్చింది… సరైన డాక్టర్లు కూడా దొరికారు నాకు…
అవును, చాలామంది హీరోలు తమ మైనస్ పాయింట్లను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు… తమ హీరోయిజానికి, తమ ఇమేజీకి నష్టమని భావిస్తారు… కానీ రజినీకాంత్ బయట ఏ మేకప్పూ లేకుండా, అందవికారంగా కనిపించడానికి కూడా సందేహించడు… తెల్ల జుట్టు, గడ్డం, ముసలి మొహం ప్రజలకు చూపించడానికి ఏమాత్రం సంకోచించడు… అలాగే తన పాత అరాచక ఆహారపు అలవాట్లను వెల్లడించడానికి కూడా వెనుకాడలేదు… గుడ్… గ్రేట్…
Share this Article