నిన్ననే అయిపోయింది కదా ఎన్టీయార్‌ను స్మరించుకోవడం..! ఆయన మరణానికి ఆంధ్రులంతా ఏడ్చారు, ఆయనకు ద్రోహం చేసినవాళ్లు మరింత బాగా ఏడ్చారు… నిన్న కూడా..! అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఆయనకు జరిగిన ద్రోహం, ఆయన చరిత్ర, ఆయన ప్రస్థానం, తోపు, శతఘ్ని, ఆత్మగౌరవం, తెలుగు జెండా ఎట్సెట్రా అంశాల గురించి కాదు… ఈనాడులో నిన్న ఒక నాలుగు కాలాల వార్త కనిపించింది… నిజానికి అది వార్త కాదు… ప్రత్యేక కథనం అంతకన్నా కాదు… ప్రకటన అసలే కాదు… వార్తో, ప్రకటనో ఏదీ చెప్పని దందా బాపతు అడ్వర్టోరియల్ కూడా కాదు… దీనికి అసలు ఈనాడు గానీ, ఇతర పత్రికలు గానీ ఇంకా ఏ పేరూ పెట్టలేదేమో… సార్, రామోజీరావు గారూ… ప్లీజ్, ఈ పాత్రికేయ ప్రక్రియను ఏమని పిలవాలి సారూ… మీ గ్రేట్ ఎడిటోరియల్ టీం చెప్పినా సరే…
ముందే చెప్పుకున్నాం కదా… ఎన్టీయార్ ప్రతి వర్ధంతికీ ఎక్కువ ఏడ్చే కేటగిరీ ఉంటుందని..! అందులో చంద్రబాబు ఉంటాడు, సహజంగానే ఈనాడు ఉంటుంది… ఫాఫం, అప్పటికి తనకు పేపర్ లేదు గానీ, ఆ కేటగిరీ సభ్యుడే రాధాకృష్ణ… ఐనాసరే, తను ప్రతిసారీ ఎవడు ఏడుస్తాడులే అని ఈసారి పెద్దగా ఏడవలేదు… ఎంత బిగ్గరగా ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టేమీ కాదు కదా… కానీ ఈనాడు సంప్రదాయం ప్రకారం బాగానే ఏడ్చింది… సినిమా పేజీల్లోనో, లేక ప్రత్యేక పేజీల్లోనో ఎన్టీయార్ స్మరణకథనాలు వస్తే పాఠకులు పెద్దగా ఆశ్చర్యపోరు… వైవీఎస్ చౌదరి ప్రకటన ఎప్పటిలాగే వచ్చింది… మళ్లీ ఎప్పుడు పుడతావు తాతా అని జూనియర్ అడగలేదు… రామకృష్ణ స్టూడియోస్ ప్రకటన కూడా లేదు… బహుశా వాళ్లు జయంతి రోజు బ్యాచ్ అయి ఉండవచ్చు…
Ads
మళ్లీ ఈనాడులో వచ్చిన ఈ పాత్రికేయ ప్రక్రియ దగ్గరకొస్తే… ‘‘కాషాయం కట్టిన లౌకికవాది’’ అని శీర్షిక పెట్టి, ఈ నాలుగు కాలాల ప్రజెంటేషన్‌తో ప్రత్యేకంగా ఎవరికో ఏదో సందేశం ఇస్తున్నారు… ఇది మెయిన్ ఎడిషన్, రొటీన్ పేజీల్లో వచ్చింది… అదీ విస్మయకరం… ఇది ఈనాడు రాసింది కాదు… ఎవరో ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా రాసి పంపించిన ప్రత్యేక వ్యాసమూ కాదు… ఒకవేళ అలాంటివి పబ్లిష్ చేసినా సరే, ఎడిట్ పేజీల్లో వేసుకుంటారు తప్ప రొటీన్ పేజీల్లో, రొటీన్ వార్తల నడుమ ఒక వార్తగా పబ్లిష్ చేయరు… ప్రముఖ పాత్రికేయుడు కందుల రమేష్ ఆంగ్లంలో రాసిన ఎన్టీరామారావుపై రాసిన ఒక పుస్తకంలోని కొన్ని పేరాలు అట అవి…
ఇప్పటికి పబ్లిష్ కాని, మార్కెట్లోని రాని ఒక బయోపిక్ పుస్తకం నుంచి కొన్ని పేరాలు తీసుకుని, నాలుగు కాలాల విస్తీర్ణంలో… ఒక వార్త అనిపించేలా, వార్తగా కనిపించేలా పరిచేయడం నిజంగా ఒక ఈనాడు సగటు పాఠకుడికి విస్తుపోయే విషయమే… అది ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తదితర పత్రికలు చేస్తాయి… కానీ ఈనాడు ఈ పని చేయడమే వింత… ఆ బుక్కుకు ఈనాడు ఇంత మార్కెటింగ్ చేసి పెట్టాలా..? కనీసం సమీక్షలు కూడా సరిగ్గా రాయని ఈనాడు ఒక బుక్కును ఇంత నెత్తిన మోయాలా..? అంత అద్భుత గ్రంథరాజమా అది..? ఎన్టీయార్ మీద బొచ్చెడు పుస్తకాలొచ్చినయ్… పోనీ, ఎన్టీయార్ మీద అంత ప్రేమ నిజంగానే ఏడిస్తే… ఆయన వర్ధంతి సందర్భంగా ఈనాడే ఎవరితోనైనా ఆర్టికల్ రాయించుకోవచ్చు కదా… (నవ్వొచ్చింది ఏమిటీ అంటే..? ఎన్టీయార్ బొమ్మ సైజుకు ఈక్వల్‌గా ఆ బుక్కు ముఖచిత్రం కూడా పబ్లిష్ చేయడం…) సరే, వాళ్ల పత్రిక, వాళ్లిష్టం అనుకుందాంలే… కానీ ప్రత్యేకంగా ఎన్టీయార్ కాషాయం కట్టినా లౌకికవాదే అని ఎవరికి చెబుతున్నట్టు ఇప్పుడు..? చంద్రబాబుకా..? ఈమధ్య హిందుత్వను మోస్తున్నాడు కదా… గుళ్లపై దాడుల నేపథ్యంలో జగన్‌పై దాడికి, బీజేపీని నిలువరించడానికి తాను హిందూ ఛాంపియన్ అయిపోతున్నాడు కదా… ఈ నేపథ్యంలో… బాబూ, జాగ్రత్త, ఇది ఎన్టీయార్ బాట కాదు అని హెచ్చరిస్తున్నదా ఈనాడు..? లౌకికవాదం వీడకు అని హితబోధ చేస్తున్నదా..? అది చెప్పాలంటే ఇంత విన్యాసం అవసరమా..?! ఐనా చంద్రబాబుకు ప్రత్యేకంగా అనుసరించే బాటలు అంటూ ఉండవు… అవసరాన్ని బట్టి, సందర్బాన్ని బట్టి ఏ బాటలో వెళ్లాలో నిర్ణయించుకుంటాడు… ఈ హితబోధలు తను వినడుగాక వినడు…!!
Share this Article