Gottimukkala Kamalakar………………. కారణం తెలియదు. ఒంటరిగా కాశీవిశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలనిపించింది. మా ఊరు నెల్లపల్లి మల్లయ్య దేవుడే చెప్పాడో..? వైరాగ్యమే వచ్చిందో..? “సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహిరక్షతి..” అని భయమే వేసిందో..? హైదరాబాదు నడిమి తరగతి నడిమి వయసు భవసాగరాలే భయపెట్టాయో..? రెండు వారాల ముందు టిక్కెట్టు బుక్ చేసుకుని, రెండు గంటలు ఎయిర్ పోర్ట్ లో నిరీక్షించి, మరో రెండు గంటల్లో “వారాణసీ పురంపతిం భజ విశ్వనాథం..!” అనుకుంటూ హోటల్లోకి వచ్చేసా..! నిక్కరూ, టీ షర్టూ విసిరికొట్టి ఓ షవరుడు గంగతో శరీరస్నానం చేసి ధోవతీ కట్టేసి బయట పడ్డా..!
నాకేం తోచలేదు. కాళ్లు నెప్పులు మొదలయ్యాయి. కానీ జీవన్ చెప్పిన మాటలు ఎందుకో ఆ వాతావరణంలో సూటిగా మనసులోకి వెళ్లాయి. గుడివైపు వెళ్లాను..! గుడిముందు బిచ్చగాళ్లు “నీవు నేర్పినవిద్యయే నీలకంఠా..!” అన్నట్టు తిరిపెమెత్తుకుంటున్నారు. ఆ టెంపుల్ రన్ ఆడిన బిచ్చగాడు “నువ్వు లోపల; నేను బైటా అడుక్కుంటాం. మన మధ్య తేడా లేదు..!” అన్నట్టు నావైపు చూసి నవ్వాడు. నేనూ నవ్వాను. ఎవరో షహనాయీ వాయించలేని, బనారసీ చీర నేయలేని ఓ బిస్మిల్లా ఖాన్ పానిపూరీలు అమ్ముతున్నాడు. మిఠాయీ దుకాణాలూ, మన్నూమశానాలూ అడ్డురాబోయినా పట్టించుకోకుండా గుడి దగ్గరికి వెళ్లాను. జనం అలాగే ఉన్నారు. గర్భగుడి ద్వారం తెరిచిఉంది. అక్కడ నిలుచున్న ఉత్తరక్షణం నా అవతారాన్ని చూసి, “ఆయియే..!” అంటూ ప్రధాన పూజారి లోపలికి పిలిచారు. కలయా, శైవమాయయా..? అనుకుంటూ లోపలికెళ్లాను. నాకో చెంబుడు నీళ్లూ, గుప్పెడు పత్రీ ఇచ్చి విశ్వనాధుడిని ఓ నిమిషం పాటు వప్పజెప్పేసాడు.
నా జీవితంలో పుట్టిబుద్ధెరిగాక అంత దుఃఖం ఎప్పుడూ అనుభవించలేదు. శివుడక్కడ మాత్రమే లేడన్న నా విచక్షణ గంగలో ఎక్కడో కొట్టుకుపోయింది. నా కన్నీళ్ళా..? ఆ చెంబులో నీళ్లా..? తెలియదు. భోరున ఏడుస్తూ నమశ్శంభవేచ మయోభవేచ అనుకుంటూ ఆ నిటలాక్షుడి నెత్తిన నీళ్లు పోసి, గట్టిగా కౌగిలించుకుని ఉండిపోయాను. తర్వాత ఒకరు నన్ను అక్కడ్నుంచి లేపి పక్కనే కూర్చోబెట్టారు. ఎంతసేపు ఏడ్చానో, ఏమయ్యానో గుర్తు లేదు..! బైట సత్యనారాయణ స్వామి మందిరం దగ్గర బ్రాహ్మడికి పాదనమస్కారం చేసి బయటకొచ్చాను. బతుకంటేనే ఒకపరి ధవళమేఘాలు; ఇంకొకపరి కరిమబ్బులు…! ఆటగదరా శివా…! #కాశీలో_ఓరోజు…
Ads
Share this Article