Murali Buddha……. ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .. ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు… గుర్తుకొస్తున్నాయి… జర్నలిస్ట్ జ్ఞాపకాలు
ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత హిమాయత్ నగర్ లోని ఓ బిల్డింగ్ లో కొంతకాలం పార్టీని నడిపించారు . భవనం చిన్నది , తక్కువ గదులు , వచ్చి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువ . ఆ బిల్డింగ్ లోనే అందరూ ఉపయోగించే కామన్ టాయిలెట్ లోకి వెళ్ళాను . ఓ మూలకు చూస్తే మనసు చివుక్కుమంది .
చదువుకునే రోజుల నుంచి నచ్చిన సినిమానే తప్ప ప్రత్యేకంగా నచ్చిన నటుడు అంటూ లేరు . మార్నింగ్ షో పాత సినిమాలు తక్కువ ధర టికెట్ తో సినిమా హాలులో ప్రదర్శించేవారు . దాదాపు పాత సినిమా అలా చూసిందే . కత్తి చేతబట్టి యస్ వి ఆర్ , రాజనాల , సత్యనారాయణ వంటి విలన్ల ను చిత్తు చేసిన అందాల హీరోగానే ఎన్టీఆర్ రూపం మెదడులో ముద్రించి ఉంటుంది . అలాంటి ఎన్టీఆర్ ను ఎంత అవమానకరంగా దించేశారు అనే బాధ ఓవైపు .. దించేసి కొద్ది రోజులకే ఎన్టీఆర్ ప్రచార ఫోటోలు టాయిలెట్ లో ఓ మూలకు వరుసగా పేర్చి ఉండడంతో చివుక్కుమనిపించి , మౌనంగా వెళ్ళిపోయాను . మనసులో ఏమున్నా రిపోర్టర్ గా నా పని నేను చేయాలి .
Ads
*****
ఫోటో గ్రాఫర్ బాలాజీ అని ఉండేవారు . అక్కడ మూలకు ఫోటోలు ఉంటాయి . ఫోటో తీయి, ఎవరికీ చెప్పకు అని కోరాను . మనం ఫోటోలు తీసుకున్నట్టు పార్టీ వాళ్లకు , మిగతా ఫొటోగ్రాఫర్లకు తెలియొద్దు అని వార్నింగ్ . మరో రెండు మూడు రోజులు అయితే ఎన్టీఆర్ జయంతి ఆ రోజు వస్తే బాగుంటుంది అని … ఆంధ్రభూమి మొదటి పేజీలో టాయిలెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలతో వార్త సంచలనం . అప్పటికి ఎన్టీఆర్ వర్గంలో మిగిలి ఉన్న కొద్ది మంది లక్ష్మీ పార్వతి , ఇంద్రారెడ్డి లాంటి వాళ్లు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి ఈ వార్తను ప్రత్యేకంగా ప్రస్తావించారు . ఎన్టీఆర్ పై బాబు వర్గానికి ఉన్న గౌరవం దీనితో తెలుస్తుంది అని విమర్శించారు .
ఎన్టీఆర్ ఫోటోలు తీసుకువెళ్లి, అక్కడ పెట్టండి అని బాబు చెప్పాడు అని నేను అనుకోవడం లేదు . కానీ దైవంగా అప్పటివరకు పూజలు అందుకున్న నాయకుడిని ఒక్క సారి దించేసి కిందపడేసిన తరువాత అక్కడ పనిచేసే అటెండర్ కూడా అలానే చూస్తాడు . ఆ ఫోటోలు అక్కడ పెట్టడంలో అతనికి తప్పేమీ అనిపించదు. రాజకీయంగా ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ ఉపయోగించుకునే రోజులు వస్తాయని అక్కడి అటెండర్ లాంటి సామాన్యుడికి ఆలోచన ఎందుకు వస్తుంది . పత్రికలో వార్త రాగానే తీసేశారు .
*****
బాబు చేతికి పగ్గాలు వచ్చిన తరువాత మొదట్లోనే ఒకదాని తరువాత ఒకటి ఎన్టీఆర్ గుర్తులు చెరిపేయాలి అని ప్రయత్నించారు . ఎన్టీఆర్ బతికి ఉండగానే బాబు సీఎంగా గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది , ప్రజలు పనితీరు చూసి ఆదరిస్తారు అన్నారు. పార్టీ సభ్యత్వ రుసుం రసీదుపై ఎన్టీఆర్ ఫోటో ఉండేది . బాబు పార్టీ అధ్యక్షుడు అయిన మొదట్లోనే ఎన్టీఆర్ ఫోటో తొలగించి చంద్రబాబు తన ఫోటో ముద్రించారు . హరికృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు . ఇప్పటికీ బాబు ఫోటోనే ఉంది…
సూర్యుడు పుట్టినప్పటి నుంచి మే నెలలో ఎండలు ఉంటాయి . నిజానికి మేలో ఎండలు కాదు . ఎండలు ఉండే కాలానికే మనం మే అని పేరు పెట్టుకున్నాం . మే 27, 28 ,29 న మహానాడు జరుగుతుంది . తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి , అంటే ఎన్టీఆర్ హయం నుంచి కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజున మహానాడు జరుగుతుంది .
ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున జరిగే మహానాడు తేదీలు మార్చాలి అని ప్రయత్నించారు . ఒక సంవత్సరం మహానాడు మేలో నిర్వహించలేదు . దానికి ఈనాడులో పెద్ద వార్త రాయించారు . మేలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేలో మహానాడు నిర్వహించవద్దు అని నిర్ణయం అని వార్త . ఆ తరువాత మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఎన్టీఆర్ ను ముందుకు తీసుకువచ్చి ఏకంగా దేవుడిని చేశారు .
*****
బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారు , హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు , సత్య నాదెళ్లను చదివించారు అని గట్టిగా నమ్మే టీడీపీ ఐటీ తరం కుర్రాళ్ళు కొందరికి ఈ విషయాలు ఏమీ తెలియవు . బాబుతో ఏదో గట్టు పంచాయతి ఉండి రాస్తున్నాను అనుకోని కామెంట్స్ పెడితే ఒక్క క్షణం ఇలా అనిపిస్తుంది . రాయడం అవసరమా ? అని అలా అనుకున్న సమయంలోనే ఉదయం మాడభూషి శ్రీధర్ ఫోన్ చేసి ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు చాలా సంతోషం కలిగించాయి .
వారు కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ , న్యాయ నిపుణులు , విద్యార్థులకు న్యాయ పాఠాలు బోధించే ప్రొఫెసర్ . ఆనాటి జ్ఞాపకాలు బాగా రాస్తున్నారు . రాయండి, నేను అప్పుడు లా పాఠాలు బోధించే లెక్చరర్ గా ఉంటూ కూడా వైస్రాయ్ హోటల్ వద్దకు రోజూ వచ్చేవాడిని . మీరు రాసినవి నేను కళ్ళతో చూశాను . ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం చూసి చాలా బాధ వేసింది .
కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో అప్పుడు నేను చూసినవి రాశాను . మీ రాతలు అవన్నీ గుర్తు చేస్తున్నాయి అన్నారు . ఆరోగ్య సమస్య వల్ల కొన్ని రోజుల నుంచి ఎక్కువగా మాట్లాడలేక పోతున్నారు . ఐనా దాదాపు పదిహేను నిమిషాలు కష్టపడి మాట్లాడారు . పూర్తిగా కోలుకొని మాట్లాడేందుకు, రాసేందుకు నాకు ఇంకా రెండేళ్లు పట్టవచ్చు అప్పుడు న్యాయ కోణంలో రాస్తాను అని . ఎన్టీఆర్ కు ఎవరెవరు ఏ విధంగా అన్యాయం చేశారో మాట్లాడసాగారు . అప్పుడు అనిపించింది వెన్నుపోటులో భాగస్వాములుగా ఉండి ఆర్థికంగా ఎంతో బాగుపడిన వారే నీతులు చెబుతూ రాస్తుంటే మౌనంగా ఉండడం , రాయక పోవడం అన్యాయం అనిపించింది .
***
ఎంత కాలం ? …… ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారే ఎన్నికల కోసం ఆయనకు దేవుడి రూపం కల్పించి, ఓట్లు అడగడం ఉన్నంతవరకు వెన్నుపోటు గురించి రాస్తూనే ఉంటారు … ( వేటపాలెం గ్రంథాలయం అందుబాటులో ఉన్న వారు 1996 మేలో ఆ ఫోటోలు వచ్చిన ఆంధ్రభూమి ఫోటో సంపాదిస్తే కృతజ్ఞతలు… )
Share this Article