పెద్ద ఆశ్చర్యమేమీ లేదు ఇందులో… తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగో తరగతులు చదివే పోరగాళ్లకు సైతం తెలుసు… సాక్షి జగన్ సొంత పత్రిక… వైసీపీ డప్పు… ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు, బ్యానర్ స్టోరీలు… అన్నీ చంద్రబాబు మీద ద్వేషం, జగన్ కీర్తన… ఆ గీతలు దాటితేనే తనను మాలిన ధర్మం అవుతుంది… అది ఎప్పుడూ ఓ పత్రికలా ఉండలేదు… నమస్తే తెలంగాణ బీఆర్ఎస్‌కు ఎలా కరపత్రికో వైసీపీకి సాక్షి అలా…
సో, జగన్ నాలుగేళ్ల బంగారు పాలనను బ్యానర్ స్టోరీలోకి లాక్కొచ్చి, మరిపెంగా, సంబరంగా నాలుగు వసంతాల నవచరిత అని ముద్రించుకుంది… సంక్షేమాభివృద్ధిలో రాష్ట్రం పరుగులు అని రాసుకుంది… కోట్లకుకోట్లు జనానికి పంచిపెట్టడమే జగన్ భాషలో సంక్షేమం కాబట్టి వోకే అనుకుందాం… వాలంటీర్లకు పత్రికలు కొనేందుకు డబ్బులిచ్చి, సాక్షి కాపీలు కొనుగోలు చేయించి, నిర్బంధ పాఠక పథకం అని ఒకటి ప్రయత్నించారు కదా… ఐనా ఎవడూ చదవని దురవస్థ…
అమరావతి, పొలవరం వంటివి రాష్ట్ర అభివృద్ధిని వెక్కిరిస్తుంటే… ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టూ రాష్ట్రానికి రాక… ఉన్నవి మూటాముల్లే సర్దుకుంటూ… నిజమే… ఏపీలో ఓ నవచరిత… దాన్నలా వదిలేస్తే… ఎడాపెడా జాకెట్ యాడ్స్ ఇచ్చి, పంచిపెట్టుడు ముహూర్తాలు, ఇతర కార్యక్రమాలకు డప్పు కొట్టించుకునే జగన్ సారుకు ఈ నాలుగేళ్ల కాలంపై కూడా యాడ్స్ ఇచ్చుకోవాలని తోచలేదు… బహుశా అవినాష్ రెడ్డి కేసు డిస్టర్బ్ చేస్తున్నట్టుంది బాగా… ఎలాగైతేనేం, అప్పుల ఖజానాకు నాలుగు డబ్బులు మిగిలాయి…
Ads
ఇక పచ్చ వేషం కట్టిన పోతరాజు ఆంధ్రజ్యోతి… నన్ను గుర్తించండి, వైసీపీకి సాక్షి ఎలాగో టీడీపీకి నేను అలాగా… అని డీజేలో ప్రకటిస్తున్నట్టుగా ఉంటున్నయ్ రోజూ పనిగట్టుకుని రాస్తున్న స్టోరీలు… అరె, ఇంత పంచ్ వార్తలు రాయని ఈనాడు (మార్గదర్శి చిట్స్) మీదనేమో సీఐడీ దాడులు, కేసులు, ఏడెనిమిది వందల కోట్ల అటాచ్‌మెంట్స్, రామోజీ విచారణ గట్రా… మరి మేం చంద్రబాబు మైకుకు మించి ఘోషపెడుతున్నా సరే, మమ్మల్నేమీ అనడేం జగన్…
అసలు మమ్మల్ని కూడా టీవీ5, ఈనాడులాగా ఓ ప్రత్యర్థిగా గుర్తించడం లేదా..? ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానెల్… నాకేం తక్కువ..? జగన్‌ను నేనే కదా బాగా తిడుతున్నదీ, ఐనా నన్ను ఎవరూ పట్టించుకోరేం..? ఇదుగో… ఫస్ట్ పేజీలో వేసిన ‘నరకంలో నాలుగేళ్లు’ అనే స్టోరీ ఈ ధోరణితో పబ్లిష్ చేయబడిందే… అసలు చంద్రబాబు స్వయంగా రాసినా ఈ స్టోరీని ఇంత కసికసిగా రాయలేడేమో…
ఈ రెండూ సరే, పార్టీల రంగులు పూసుకుని, పోతరాజుల్లా కొరడాలతో కొట్టుకుంటూ వీరంగం వేస్తుంటాయి, కానీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు గురైన ఈనాడు ఫస్ట్ పేజీలో ఈ నాలుగేళ్ల పదవీకాలం పూర్తిని ఎలా ‘సెలబ్రేట్’ చేసింది..? ఏమీలేదు, అన్నీ మూసుకుని ఐపీఎల్ వార్త, అమూల్‌ను వద్దంటున్న తమిళనాడు వంటి స్టోరీలు వేసుకుంది… ఇదేకాదు, మొత్తం పేజీల్లో ఒక్కటంటే ఒక్క చదవబుల్ వార్త లేదు… పత్రికలు చూస్తే ఇలా… ఇక టీవీలు పార్టీలకు డీజేలే… ఈటీవీ, సాక్షి, ఏబీఎన్, టీవీ5 ఎట్సెట్రా అన్నీ పార్టీల మైకులే… అందుకే జనం వాటి జోలికి వెళ్లడం మానేసి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు… సరే, సోషల్ మీడియా క్రెడిబులిటీ అనేది ఓ బ్రహ్మపదార్థం… దాని గురించి చెప్పుకుంటే అదో ఏడుపు… ఇదీ తెలుగు వార్తల వర్తమాన దురవస్థ…
Share this Article