వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, జగన్ చెల్లెలు, వైఎస్ పాలనకు వారసురాలు, క్రిస్టియన్ మతబోధకుడు అనిల్ సతీమణి వైఎస్ షర్మిలకు సంబంధించి పత్రికల్లో, టీవీల్లో బోలెడు తాజా ఊహాగానాలు… ఆమె రీసెంటుగా రెండుసార్లు కర్నాటక కాంగ్రెస్ విజయసాధకుడు డీకే శివకుమార్‌ను కలిసింది… ఏవో మంతనాలు జరిగాయి… వినవచ్చే లీకుల ప్రకారం… ఆమె వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంది…
అయితే తన కార్యక్షేత్రాన్ని ఏపీకి మళ్లిస్తుంది… ఇటు తెలంగాణలో కేసీయార్, అటు ఏపీలో జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తుంది… ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేస్తారు… కొన ఊపిరితో ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఆమె జీవగంజి పోసి, బతికిస్తుంది… ఇవండీ ఆమె గురించిన తాజా వార్తల సారాంశం… ఇదే నిజమనుకుందాం కాసేపు…
జగన్‌తో పడటం లేదు, అందుకే పార్టీ పెట్టింది అనే వాదనను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టే నమ్ముదాం కాసేపు… జగన్ మీద కోపముంటే తెలంగాణలో పార్టీ పెట్టడం ఏమిటి, ఏపీలోనే తేల్చుకోవాలిగా అనే తలతిక్క బేసిక్ ప్రశ్నలను మనం వేయకూడదు… వాటికి రాధాకృష్ణ కూడా సమాధానాలు ఇవ్వడు… సరే, ఆ ప్రశ్నలను మనలోనే అణిచేసుకుని, ఆమె ఏపీ కాంగ్రెస్ ఉద్దారక పాత్రలోకి వెళ్తుందనే నమ్ముదాం… నిజంగా అంత సీనుందా..? అసలు రియాలిటీ ఉందా..?
Ads
తన కొత్త రాజకీయ కార్యక్షేత్రానికి సరిపడా ఇప్పుడు తన సిద్ధాంతాల్ని కొత్తగా రాసుకోవాలా..? తెలంగాణ జనమే నమ్మలేదు, తెలివైన ఏపీ ప్రజలు నమ్ముతారా..? లేక మహారాష్ట్రలో కేసీయార్ నడిపించే గెస్ట్ రాజకీయాన్నే షర్మిల కూడా ఏపీలో నమ్ముకోవాలా..? ఏపీలో పాలిటిక్స్ చేసేంత డబ్బుందా..? ప్రయోజనం లేని ప్రయాసకు డీకే శివకుమార్ డబ్బులిస్తాడా..?
తెలంగాణను విభజించిన కర్మకు ఏపీ కాంగ్రెస్ మూల్యం చెల్లిస్తోంది… రాజకీయ తెలివిడి ప్రదర్శించక, విద్వేషాన్ని నింపుతూ విభజన ప్రక్రియ చేయడం ఏపీలో దెబ్బ తీయగా… కేసీయార్ దెబ్బకు తెలంగాణలోనూ దారుణంగా నష్టపోయింది… సరే, కేసీయార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోలేకపోవడమే కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద వైఫల్యం… సరే, ప్రస్తుతానికి వస్తే…
కేసీయార్‌తో దోస్తీ కోసం, జగన్ ఆయనతో ఘర్షణ పడదలుచుకోలేదు… అలాగని తన పార్టీని పూర్తిగా చంపుకోలేదు… వైఎస్ఆర్టీపీ పేరిట షర్మిలను బాణంగా వదిలాడు… వైఎస్ పాలన పునరుద్ధరణ పేరుతో, ఆయన లెగసీని, అభిమానుల్ని ఇలా కాపాడుకుంటున్నాడు… అంతకుమించి వైఎస్ఆర్టీపీ స్థాపన వెనుక మర్మమేమీ లేదు… తెలంగాణ పాట పాడకపోతే తెలంగాణజనం సహించరు కదా… అందుకని తన పాత సమైక్య పంథాను వదిలేసి, తెలంగాణ బిడ్డ అవతారమెత్తింది షర్మిలమ్మ,,,
పాదయాత్రలు చేస్తుంది… దీక్షలు చేస్తుంది… పోలీసులను కొడుతుంది… మంత్రులను తిడుతుంది… బీఆర్ఎస్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది… ఇవన్నీ తెలుసు కాబట్టే కేసీయార్ పెద్దగా ఆమె జోలికి పోడు… బీఆర్ఎస్ ఆమె పార్టీని పట్టించుకోదు… ఇప్పుడు లెక్కలు ఎక్కడ తిరగబడ్డాయో గానీ… లేదా కొత్త ఎత్తుగడలు ఏమిటో అంతుపట్టవు గానీ… ఆమె ఏపీసీసీని ఉద్దరించే పాత్రలోకి వెళ్తుందట… కేన్సర్ రోగిలా చిక్కి శల్యమైన ఏపీ కాంగ్రెస్‌ను ఇప్పట్లో ఎవరూ ఉద్దరించగలిగేది ఏమీ లేదు… షర్మిలతో ప్రాణప్రతిష్ట జరిగేదీ లేదు…
తెలంగాణ జనం ఆమె మాటల్ని నమ్మలేదు, పట్టించుకోలేదు… ఎంత తిరిగినా… పాదాల మీద నడిచే యాత్రలు చేసినా సరే జనం అయ్యో అనలేదు, అక్కున చేర్చుకోలేదు… ఇక ఇప్పుడు ఏపీకి వెళ్తే… మరి తెలంగాణ బిడ్డ మళ్లీ యూటర్న్ తీసుకుని తెలంగాణ విభజనను వ్యతిరేకించాలా..? ఆంధ్రాగానం అందుకోవాలా..? అయ్యో, ఎంత కష్టమొచ్చె అక్కా నీకు..? ఆల్ రెడీ వైఎస్ పాలనకు వారసుడే పాలిస్తున్నాడు కదా, బొచ్చెడు పథకాలకు వైఎస్ పేరు పెట్టి మరీ ‘‘మస్తు పెద్ద పేరు’’ తీసుకొస్తున్నాడు కదా డాడీకి…? మరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకుని, ఏక వ్యక్తి సైన్యంలా ఆమె జగన్ పాలనను ఏకిపారేస్తుందా..? జనం నమ్ముతారా..?
అంత పవన్ కల్యాణుడే ప్రత్యామ్నాయం అనే ఖాళీలోకి దూరలేకపోతున్నాడు… బీజేపీ కూడా కాంగ్రెస్ దురవస్థలాగే బాధపడుతోంది… ఉన్నంతలో జనానికి మళ్లీ చంద్రబాబే కనిపిస్తున్నాడు… అయితే తను ఆశించేలా తిరిగి ప్రజలు అధికారం అప్పగించే సీన్ ఉందా లేదానేది కాలం చెప్పాలి… తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఓ పరోక్ష, మార్మిక ఉద్దేశాలున్నయ్… ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి, అన్న పైనే తిరుగుబాటు నటించడానికి ప్రజలు నమ్మేలా ఏమని చెప్పాలి..? ఏమని చెబుతుంది..? డీకే శివకుమార్ కర్తవ్యబోధ చేసి మరీ పంపిస్తున్నాడా..? డీకే శివకుమార్ అంటే… మరీ ఆంధ్రజ్యోతి ఆర్కే అనుకున్నారా..? అంత వీజీగా షర్మిల చెప్పినవన్నీ నమ్మేసి, అచ్చేయడానికి..!! డీకే కాంగ్రెస్‌లో నయా అహ్మద్ పటేల్…!!
Share this Article