షర్మిల కాంగ్రెస్ లో చేరాలి అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు … ఆంధ్రకు వెళ్లి రాజకీయం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సుచించారు … షర్మిల కాంగ్రెస్ లో చేరుతారు అని కొన్ని పత్రికల్లో , ఆంధ్రా కాంగ్రెస్ లో అని మరికొన్ని పత్రికల్లో వార్తలు . ఆమెనేమో నేను సీఎంను అవుతున్నాను అని Abn ఛానల్ ఇంటర్వ్యూలో చెబుతుంటే … ఆమెకో పార్టీ ఉందని , దానికో పేరు ఉందని మరిచిపోతున్నారు . వాట్స్ఆప్ లో మాత్రమే కనిపించే వాట్స్ఆప్ పత్రికల సర్వేల్లో ఆమెకు ఉదారంగా 74 సీట్లు ఇస్తుంటే ఇవేవీ గుర్తించకుండా కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో చేరిపొమ్మంటున్నారు .
ఆంధ్రలో అన్నను తీవ్రంగా వ్యతిరేకించాలి . అవసరం ఐతే రాష్ట్రపతి పాలన పెట్టించాలి . ఇటు తెలంగాణలో అన్న చెల్లిని ఆకాశానికి ఎత్తాలి , తెలంగాణను రక్షించడానికి అవతరించిన దేవత అన్నట్టు చూపించాలి . దీనికోసం ఎంత కష్టపడుతున్నారు . . ఇది మాములు విషయమా ? ఒకే కుటుంబంలో అన్నను రాక్షసుడిగా , చెల్లిని దేవతగా చూపాలి అంటే ఆషామాషీ కాదు, దమ్ముండాలి . తమకా దమ్ముందని పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అండగా నిలిస్తే …. కాంగ్రెస్ లో కలిపేయండి.. ఆంధ్రాలో ఓ టికెట్ ఇస్తాం అనడం ఎంత అమానవీయం …
Ads
విజయశాంతికి ఆంధ్రజ్యోతికి ఎంతో అనుబంధం ఉంది . ఆంధ్రజ్యోతి మొదటి యజమానికి సినిమా వ్యాపారాలు ఉన్నాయి . ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి తొలుత విజయవాడ నుంచే వచ్చేది . సచివాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఓ గది కార్యాలయంగా ఉండేది . ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభం ప్రచారం ఓ సంచలనం. అప్పటి వరకు ఈనాడు , ఉదయం తమ ఎడిషన్లు ప్రారంభించేప్పుడు ఉదృతంగా ప్రచారం చేశాయి . ఉదయం ఐతే ఏకంగా ఉదయం టైటిల్ ఎలా ఉండాలో చెప్పండి అని అనేక డిజైన్లలో అప్పటి అన్ని పత్రికల్లో మొదటి పేజీ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు .
కానీ ఆంధ్రజ్యోతి మాత్రం నభూతో న భవిష్యతి అనే విధంగా విజయశాంతి పోస్టర్లతో ప్రచారం చేశారు . అప్పుడు విజయశాంతి హీరోయిన్ గా సినిమా రంగాన్ని ఏలేస్తున్నారు . దినపత్రికకు హీరోయిన్ పోస్టర్ తో ప్రచారం ఏమిటా ? అని సాంప్రదాయ వాదులు ముక్కున వేలేసుకున్నారు కానీ బాగానే వర్కౌట్ అయింది . విజయశాంతి తెలంగాణ తల్లి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పాత అనుబంధాలతో ఆంధ్రజ్యోతిలో ప్రచారంతో హోరెత్తించారు . బహుశా తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీకి కూడా అంత ప్రచారం లభించి ఉండదేమో . వారం పాటు మొదటి పేజీ సింహ భాగం ఆమె పార్టీకే .కేటాయించారు .
బాధ్యత మొత్తం మీడియాయే భుజానికి ఎత్తుకుంది . అమెనేమో తెలంగాణ సాధిస్తాను అని పార్టీ పెట్టింది . ఆమెకేమో తెలంగాణను వ్యతిరేకించే మీడియా మద్దతు . ఆమెకు వై యస్ ఆర్ ఆత్మగా గుర్తింపు ఉన్న కెవిపి రామచంద్రరావు ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం . తెరాస నుంచి గెలిచి కాంగ్రెస్ కు అనుబంధంగా పని చేస్తున్న శాసనసభ్యులు జగ్గారెడ్డి తరుచుగా తల్లి తెలంగాణ అధ్యక్షురాలు విజయశాంతి ఆఫీస్ లో కనిపించేవారు .
సరే, బయట ఎలా ఉన్నా లోపల పార్టీ పని చేసేది తెలంగాణ వాళ్లే అయి ఉంటారు అని ఓసారి వెళ్ళాను . ఆ రోజు ఆమె పుట్టిన రోజు అని వెళ్ళాక తెలిసింది . అక్కడున్న బొకే నుంచి ఓ గులాబీ పూవు తీసి ఇచ్చి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పాను . ఎన్నికల ప్రచారం కోసం కొందరు పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు . పలకరిస్తే గుంటూరు నుంచి తెలంగాణ పాటలు పడేందుకు వచ్చిన ఉపాధ్యాయులం రిహార్సల్స్ చేస్తున్నాం అన్నారు . బాగుంది అనుకొని విజయశాంతిని ఏమడిగినా ఆమె పక్కనున్న భర్త శ్రీనివాసరావు సమాధానాలు చెబుతున్నారు . ఆమె నోరుమెదపలేదు .
ఇంత దాకా వచ్చినందుకు ఏదో మాట్లాడించాలి అని ప్రయత్నిస్తే తెలంగాణను విముక్తి చేస్తాను అన్నారు . ఆఫీస్ కు వచ్చి తెలంగాణను తరువాత విముక్తి చేద్దువు కానీ ముందు ఆ శ్రీనివాసరావు నుంచి విముక్తి సాధించండి అని రాశాను . అధ్యక్షురాలిని ఏమడిగినా ఆయనే సమాధానం చెబుతున్నారు అని ….
మరోసారి కలిసినప్పుడు గుర్తు పెట్టుకొని ఏమండీ అలా రాశారు అని అడిగారు . తాట తీస్తాను అని మీరు రోజూ అంటారు కదా ? ఈ మాట తెలంగాణలో ఏ జిల్లాలో అంటారు అని అడిగాను.. అదేంటీ ఆ మాత్రం తెలియదా ? అన్నట్టు చూసి నేను చాలా సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడేప్పుడు అన్నాను అని చెప్పారు . పార్టీ నడపడం ఆంధ్రజ్యోతి మొదటి పేజీ ఆక్రమించినంత ఈజీ కాదు అని గ్రహించి తెరాసలో విలీనం చేశారు . తరువాత కాంగ్రెస్ , బీజేపీ అంటూ అటూ ఇటూ తిరిగి ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు . ఆమె బీజేపీలో ఉన్నారు అని అంత కరెక్ట్ గా చెబితే నాకు గొప్ప జ్ఞాపక శక్తి ఉందని అపోహపడకండి . పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదు అని అధ్యక్షుడిని ఇటీవల ఆమె విమర్శించారు . దాని వల్ల గుర్తుండి పోయింది .
ఇక కోదండరాంను సీఎంగా ప్రాజెక్ట్ చేయడానికి సర్వం సిద్ధం అయిన తరువాత ఇప్పుడే వద్దు ముందు మహాకూటమిని ఫోకస్ చేద్దాం అని… మహాకూటమికి ఓట్లు లెక్కింపు మొదలైన తరువాత కూడా మెజారిటీ సీట్లు ఇచ్చారు . ఐతే ఎలక్షన్ కమిషన్ ఫలితాలు వేరుగా ఉన్నాయి . కోదండరాం సొంత పార్టీ పెట్టినప్పుడు కోదండరాం కూడా ఉహించనంత ప్రచారం కల్పించారు . తెరాస నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా ఆకాశానికెత్తారు .
పత్రికల్లో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు అనే రాస్తారు… వారు పార్టీ పెడుతున్నట్టు చెప్పినా భుజానికెత్తుకున్నారు . ఉద్యమ సమయంలో గద్దర్ పార్టీ , ఇంటి పార్టీ ఇవి గుర్తున్నవి మాత్రమే… ఇంకా ఎన్నో పార్టీలు వాటికీ మంచి ప్రచారం కల్పించారు . అదేం హస్తవాసో అవన్నీ కాలగర్భంలో కలిసి పోయాయి . ఆంధ్రలో, తెలంగాణలో మీడియా అండగా నిలిచిన పార్టీలు కనుమరుగు అవుతుంటే , మీడియా వ్యతిరేకించిన పార్టీలను జనం ఆదరిస్తున్నారు . మీడియా మేనేజ్‌మెంట్లకే నచ్చింది తెలుగు ప్రజలకు నచ్చడం లేదు . ఇదేం శాపమో …
దీవించడం వల్ల మటాష్ అవుతున్నారా ? మటాష్ అయ్యే పార్టీలను దీవిస్తున్నారా ? అని ప్రశ్నిస్తే , ఏమో తెలియదు …
Share this Article