Bharadwaja Rangavajhala……… మనసైన చెలీ పిలుపూ … జయసింహలో టీవీరాజుగారు చేసిన అద్భుత ట్యూన్లలో ఒకటి. బాలసరస్వతిగారి గాత్రంతో పాటు ఎపి కోమలగారి కంఠమూ వినిపిస్తుందా పాటలో.
తెర మీద వహీదా రెహ్మాన్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతకు మించి అందంగా వినిపిస్తుందీ పాట. రాజుగారి స్వరాల్లో కాస్త హిందూస్తానీ వాసనలు ప్రధానంగా మరాఠీ నాటకాల పట్టు విడుపులూ కనిపిస్తాయి. అందుకే ఆయన చేసిన పాటలు కాస్త ప్రత్యేకంగా వినిపిస్తాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే .. ఎపి కోమల పూర్తి పేరు ఆర్కాటు పార్ధసారధి కోమల. మేఘసందేశం సినిమాలో సుశీల గారు పాడిన దేవులపల్లి వారి ఆకులో ఆకునై యాభయ్యిల్లోనే రేడియోలో పాడారు కోమల. రజని ట్యూన్ కట్టారు… అయితే రమేష్ నాయుడు చేసిందే బావుంది అని సాక్షాత్తు రజనీ గారే అనడం విశేషం.
Ads
త్యాగయ్యలో మధురానగరిలో పాడేప్పటికి తనకు గట్టిగా పదకొండేళ్లుంటాయేమో … జమునారాణితో కలసి నాగయ్యగారి సంగీత దర్శకత్వంలో భలే పాడారు. ఆ పాటన్నా … అందులో నృత్యమన్నా నాగయ్యగారికి చాలా ఇష్టం …
కోమల ఆషామాషీగా సినిమాల్లోకి రాలేదు. తన తల్లిదండ్రులిద్దరూ సంగీతజ్ఞానం ఉన్నోళ్లే. అయినప్పటికీ కూతురుకు ఏడో ఏటే రాజమండ్రిలో ఓ గురువును ఏర్పాటు చేశారు. ఆయన పేరు జి.పైడిస్వామి. ఎస్.జానకి గారు అక్కడ కోమలకు ఓ సంవత్సరం జూనియర్ అన్నమాట … అలా కోమల గారు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకునే సినిమాల్లోకి ప్రవేశించారు.
తెలుగు సినిమా వాళ్లు చేసిన క్షమించలేని నేరం ఏమిటంటే … కోమల గారు అద్భుతంగా పాడగలిగిన రోజుల్లో ఆవిడకు తగిన అవకాశాలు ఇవ్వలేదు. తనకేమో … వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ అవకాశాల కోసం తిరిగే అలవాటు లేదు. బంగారు పంజరంలోని పదములె చాలు రామా పాట చాలదా కోమలగారు ఎలా పాడతారో చెప్పడానికి….
కోమల కుటుంబం రాజమండ్రి నుంచీ మద్రాసుకు మారినప్పుడు ఆకాశవాణిలో సంగీత శిక్షణ కార్యక్రమంలో శిష్యురాలిగా వినిపించడానికి ఎంపికయ్యారు. ఆ కార్యక్రమంలో గురువుగా సంధ్యావందనం శ్రీనివాసరావు గారు వినిపించేవారు. ఇలా ఆకాశవాణిలో మొదలైన ప్రయాణం నాగయ్యగారి త్యాగయ్యతో సినిమాల వైపు టర్న్ తీసుకుంది.
కోమలను నాగయ్య గారికి పరిచయం చేసింది రేడియోకే చెందిన ప్రయాగ నరసింహశాస్త్రి. ఆ తర్వాత చాలా మంది సంగీత దర్శకుల దగ్గర అవకాశాలు వచ్చాయి చక్కగానే పాడింది. అందరూ మెచ్చుకున్నారు. అయినా ఉన్నట్టుండి అవకాశాలు తగ్గిపోసాగాయి.
క్రైస్తవ భక్తి గీతాలు కూడా పాడేవారు. వాటిలో కాస్త ప్రత్యేకమైనది … సంతోషించుడీ … ఓ వింతయగు కీర్తనను పాడాలనుందీ … పాట. కోమలతో కలసి కె.వి.మహదేవన్ ఆ పాట పాడడం విశేషం. మామ విడిగా సినిమాల్లో ఎప్పుడూ ఎవరికీ ప్లేబ్యాక్ పాడాలనుకోలేదు.
పెళ్లి చేసి చూడులో బ్రహ్మయ్యో పాట కోమల గారు పాడిన పద్దతి చాలా బావుంటుంది. అయినా అవకాశాలు రాకపోవడానికి ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోవడమే అని బాధపడేవారు కోమల. తెలుగు తమిళ సింహళ ఇలా వివిధ భాషల్లో కూడా పాడారు కోమల. ఊర్కెనే పాడడం కాదు … ఆ భాషల మీద సాధికారత సంపాదించుకుని పాడడం తన ప్రత్యేకత.
దాదాపు 550 పాటల వరకు ఆవిడ పాడి ఉంటారు. కోమల అనగానే గుర్తొచ్చే పాటల్లో పిచ్చిపుల్లయ్యలో పాట తదితరాలు ఉదహరిస్తారు గానీ …
పదములు చాలూ రామాని మించిన పాటేదీ లేదని నా నమ్మకం. యశోదా కృష్ణలో సుశీలతో కలసి పాడిన పెళ్లి పాటే ఆవిడ పాడిన చివరి పాటేమో … సినిమాల్లో పాటలు పాడించుకోకపోతే పోయారు గానీ … రేడియోలో గ్రేడ్ ఒన్ ఆర్టిస్టుగా 1995లో రిటైర్ అయ్యారు…
Share this Article