అప్పట్లో ఓ ఫేమస్ పాట… జ్యోతిలక్ష్మి చీరకట్టింది, పాపం… అని ఏదో దాసరి సినిమాలో వినిపించి ఓ ఊపు ఊపింది… నిజానికి ఓ ఇంట్రస్టింగు పాయింటే… ఎప్పుడూ పొట్టి దుస్తులు ధరించి, వయ్యారాలు ఒలకబోస్తూ, డాన్సులు అనబడే గెంతులు వేసి అలరించే ఓ ఐటం నర్తకి అకస్మాత్తుగా సంప్రదాయబద్ధంగా చీరకట్టి కనిపిస్తే ఆశ్చర్యమే కదా… అసలు జ్యోతిలక్ష్మి చీరకట్టడం ఏమిటి అనే ప్రేక్షకుడి ఫీల్ ఆ పాటను అలా పాపులర్ చేసింది… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? చీర సంప్రదాయం… ఇండియాలోనే కాదు, దక్షిణాసియాలోనే ఓ ట్రెడిషనల్ వేర్… ఇప్పుడంటే చీరెలకు గిరాకీ తగ్గింది… బీరువాల్లోని పట్టుచీరెల్నే రీడిజైన్ చేయించి, మోడర్న్ వేర్ చేసేస్తున్నారు… పిల్లలున్న తల్లులు కూడా జీన్స్, షర్ట్స్ వేసేస్తుంటే, ఫాఫం చీరె చిన్నబోతోంది… సరే, కాలంతోపాటు వస్త్రధారణలు మారతాయి, అది వేరే సంగతి… ప్రస్తుత చర్చ ఏమిటంటే..? అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ చీరె కడుతుందా..? అమ్మ ఇచ్చిన ముత్యాల పేరు వేసుకుంటుందా..? ఇదీ…
ఇది ఆంధ్రప్రభలో వచ్చిన ఫస్ట్ పేజీ వార్త… వాళ్ల తప్పేమీ లేదులే… చాలా ఇంగ్లిషు పత్రికల్లో, అంతర్జాతీయ పత్రికల్లో సాగుతున్న చర్చే ఇది… కాకపోతే రాసిన శైలి, రిపిటీషన్స్, ప్రజెంటేషన్‌లో తప్పులున్నయ్, వాటి ప్రస్తావన ఇప్పుడు, ఇక్కడ అక్కర్లేదు… ఆమె చీరె కడుతుందా అనేది ఇండియా మీడియాలో చర్చ… చీరె అంటేనే ఒద్దిక, సంప్రదాయం, పెద్దరికం, హుందాతనం… అందుకని ప్రమాణ స్వీకారం వేళ చీరె కడితే ఆమె తన ఇండియన్ మూలాల్ని గౌరవిస్తున్నట్టు ఉంటుందని కొందరి వాదన… నవ్వొచ్చే వాదన కదా…
Ads
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె చీరె కట్టుకుని దక్షిణాసియా రూట్స్ ఉన్నవాళ్ల అభిమానం పొందిందనే సమాచారం బహుశా తప్పు కావచ్చు… ఆమె చీరె కట్టుకున్న ఫోటో ఒక్కటి కూడా నెట్లో గానీ, క్యాంపెయిన్ సందర్భంగా గానీ కనిపించలేదు… పైన చూపిన ఒక్క పాత ఫోటో మాత్రం కనిపిస్తుంది… ఐనా చీరె కట్టుకుంటేనే ఇండియన్స్ రూట్స్‌ను గౌరవించడం అనే మాటే అబ్సర్డ్… ఆమె అమెరికన్… ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా ఓ అమెరికన్ జాతీయురాలిగానే కనిపించడానికి ప్రయత్నిస్తుంది… అంతే… ఆమెకు ఇండియన్ రూట్స్ మాత్రమే కాదు, జమైకన్ రూట్స్ కూడా ఉన్నయ్… ఇంకా నయం, జమైకా వస్త్రధారణలో కనిపిస్తేనే, ఆమె తన తండ్రి వైపు రూట్స్‌ను గౌరవించినట్టు అనే వాదన వినరావడం లేదు…
అమెరికా వంటి అనేక జాతుల ప్రజలు నివసించే ఓ అగ్ర దేశానికి ఆమె ఉపాధ్యక్షురాలు… కురచ బట్టలు గాకుండా, ధరించే డ్రెస్ డిగ్నిఫైడ్‌గా ఉంటే చాలు, అమెరికా కీలక పదవుల్లోని వ్యక్తుల బాడీ లాంగ్వేజీ, డ్రెస్, మాటలు అన్నీ ఆ దేశ విదేశాంగశాఖ నిర్దేశిస్తూ ఉంటుంది… సో, ఇండియన్ మీడియా అడుగుతుంది కదాని చీరెను కట్టనివ్వదు ఆమె చుట్టూ ఉండే అధికార యంత్రాంగం… అఫ్ కోర్స్, ముత్యాల పేరు ఎట్సెట్రా పెద్ద ఇష్యూ కాదు… ఐనా, ఆమె ఏం చెప్పులు తొడుగుతుంది, చెవులకు కమ్మలు పెట్టుకుంటుందా..? సరదాగా ముక్కుకు ముక్కెర ధరిస్తుందా..? కాళ్లకు పట్టీలు వేసుకుంటుందా..? వేళ్లకు మెట్టెలు ఉంటాయా..? నొసటన స్టిక్కర్ బొట్టు అతికించుకుంటుందా..? చీరెకు ఎక్కడ వర్క్ చేయిస్తుంది..? జాకెట్ ఎక్కడ కుట్టిస్తుంది..? అవునూ, గాజులు వేసుకునే చాన్స్ ఉందా..? కంచి పట్టు చీర..? బెనారస్ చీర..? ఎహె, ఏమిటీ చర్చ…? అరె, ఆమె అమెరికన్… అమెరికా మహిళలాగే ఉంటుంది… అంతే..!
Share this Article