రానా… కాస్త డిఫరెంట్ మెంటాలిటీ… తన పాత్రల ఎంపిక గట్రా తనను ఇండస్ట్రీలో ఓ భిన్నమైన మనిషిగా పట్టిస్తాయి… తను ఓ చిన్న చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడూ అంటే, తన టేస్ట్ ప్రకారం కాస్త బెటర్ ఎంపికే అయి ఉంటుంది అనుకుంటాం… పరేషాన్ అనే మూవీ మీద అందుకే కాస్త ఇంట్రస్ట్ జనరేటైంది… తీరా సినిమా చూశాక రానా చాయిస్ మీద, తన టేస్ట్ మీద జాలేస్తుంది… రానా నాయుడు పాత్రతో ఒకటీరెండు మెట్లు దిగజారగా, పరేషన్ సమర్పకుడిగా మరో రెండు రెట్లు జారిపోయాడు…
అదేదో సినిమా ప్రమోషన్‌లో… బహిరంగ వేదిక మీద, ఫుల్లు వర్షం పడుతుంటే… ఓ హీరోయిన్‌కు ఛత్రి పట్టిన ఫోటో ఒకటి బాగా గుర్తుంది… ఆ సినిమా ప్రమోషన్లలో హీరోగా తనను ప్రొజెక్ట్ చేసుకోవడంకన్నా సాయిపల్లవిని ప్రమోట్ చేయడం, మెచ్చుకోవడం కూడా గుర్తుంది… ఇండస్ట్రీలో అస్సలు కనిపించని సంస్కారమేదో ఇతనిలో కనిపిస్తున్నదని అనిపించింది… తీరా పరేషాన్ సినిమా చూస్తుంటే మాత్రం రానా ఆలోచనల తీరు మీద సానుభూతి కలుగుతుంది…
అసలు ఏముంది ఈ సినిమాలో… పూర్ నిర్మాణ విలువలు… వీక్ స్టోరీ లైన్… తేలిపోయిన కామెడీ… మసూద, టక్ జగదీష్‌లో కనిపించిన తిరువీర్ హీరో ఇందులో… అబ్బే, ఓటీటీలో కూడా చూడటం అనవసరం అనే ఫీలింగ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రానాకు అంత బాగా ఎలా నచ్చిందో తెలియదు… దర్శకత్వ విలువలు పెద్ద మైనస్ ఈ సినిమాకు… హీరోయిన్‌కు కడుపొచ్చిందో లేదో తెలియాలంటే ఇంత హైరానా అవసరమా..? ఏ మెడికల్ షాపుకు వెళ్లినా నిర్ధారణ కిట్ ఇస్తారు… ఆమాత్రం తెలివిలేనోడు ఇందులో హీరో…
Ads
హీరోయిన్ పావని కరణం ఎలా చేసింది..? హీరో తిరువీర్ ఎలా చేశాడు..? వంటి ప్రశ్నల జోలికి పోవడమే వేస్ట్… ఎక్కడా దర్శకత్వపు ఛమక్కులు లేవు… బోర్… అసలు ఇదంతా కాదు, చెప్పుకోవాల్సిన మరో ప్రధానాంశం… తాగుడు… తెలంగాణ అంటేనే తాగుబోతులు అన్నట్టుగా సాగిన చిత్రీకరణ… ఈమధ్య తెలంగాణ ట్రెండ్ పేరిట వస్తున్న ప్రతి సినిమాలోనూ తాగుడును అతిగా ఎక్స్‌పోజ్ చేస్తూ, తెలంగాణవాళ్లకు అన్నం, చాయ్‌లాగే మటన్, తాగుడు నిత్యావసరాలు అన్నట్టుగా… తెల్లారిలేస్తే తాగడం తప్ప మరో పనిలేనట్టుగా, అదే సంస్కృతిగా ఫోకస్ చేయడం ఓ పెద్ద దరిద్రం…
ఈ సినిమాలోనూ అంతే… డబ్బుల్లేవనే బాధతో కూడా సిటింగ్ వేసి, జోరుగా పెగ్గింగ్ చేస్తుంటారు… బోలెడు తాగుడు సీన్లు ఉన్నయ్ సినిమాలో… ఇదే కాదు, ఆమధ్య వచ్చిన దసరా అనే సినిమాలోనూ అంతే… అంతకుముందు జాతిరత్నాలు సినిమాలో, తెలంగాణజనం తెగ కీర్తించిన బలగం సినిమాలో కూడా అంతే…
దసరా సినిమాలో మరీ ఘోరంగా… భాష విషయంలోనూ అంతే… తెలంగాణ వాళ్లు నోరువిప్పితే బూతులే అన్నట్టుగా… చివరకు బలగం సినిమాలో పిట్టముట్టుడు కూడా మందు సీసా చుట్టూ తిరుగుతుంది… కాకపోతే సంభాషణల విషయంలో బలగం సినిమాలో మాండలికం కాస్త ప్యూరిటీతో ఉంది… దసరాలో హీరో భాష కృతకం… హీరోయిన్ కీర్తిసురేష్ మాత్రం బాగా నటించింది… ఆమె డిక్షన్, ఆమె సాధన కూడా బాగున్నయ్… ఇప్పుడు చెప్పండి మిస్టర్ రానా… ఈ సినిమాలో ఏం నచ్చింది..? డొల్ల కథ, శుష్క కథనం, కృతకంగా ఓ ప్రాంత కల్చర్… ఓ పాటలా..? ఓ బీజీఎమ్మా..? ఓ డైరెక్షనా..? ఏముంది ఇందులో…!! సినిమా వ్యాపారంలోకి దిగాలనుకుంటే దిగు… కానీ నువ్వు ప్రజెంట్ చేయాల్సింది ఇలాంటి ఫేక్ తెలంగాణ ప్రజెంటేషన్లను కాదు…!! నవ్వీ నవ్వీ దవడలు నొప్పి పుట్టాయని ఎక్కడో అన్నావు కదా… నీ దవడలు కూల… అంతఘనం ఏముందిర భయ్…
Share this Article