తనకు కేన్సర్ అనీ, చికిత్స ద్వారా నయం చేయించుకున్నానని చిరంజీవి చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాసిపారేశాయి… టీవీలు కూడా కవర్ చేశాయి… నిజంగా చిరంజీవి అలాగే చెప్పి ఉన్నట్టయితే, ఈ కంటెంట్ రైటర్లు, ట్యూబర్లతోసహా అందరికీ అది పెద్ద వార్తే… దాంతో అందరూ రాసిపారేశారు… వాళ్లను తప్పుపట్టే పనిలేదు… కేన్సర్ అనే పదం చిరంజీవి నోటి వెంట వినగానే… ఆ పదం మీద, చిరంజీవి ఏం చెప్పాడనే విషయంపైన కొంత వర్క్ జరగాలి నిజానికి… అది మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో గతంలో జరిగేది…
ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులతో సహా ఎవరికీ ఆ వాల్యూ యాడిషన్ మీద గానీ, వార్త నిర్ధారణ ప్రయాస గానీ లేకుండా పోయింది… అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లలో కూడా చిరంజీవికి కేన్సర్, తనే చెప్పాడు, చికిత్స ద్వారా నయం చేయించుకున్నాడు అని రాసిపారేశారు అందరూ… ఇక్కడ చిరంజీవి వైపు నుంచి చిన్న తప్పు దొర్లింది… తను చెప్పాలనుకున్నది సరిగ్గా కన్వే చేయలేకపోయాడు… మీడియా తన ప్రసంగం వింటూ ఉందనీ, ప్రస్తుత మీడియా వార్తలు రాసే తీరు ఎలా ఉందనేది మరిచిపోయాడు… మూల్యం చెల్లించాడు…
నో, నో, చిరంజీవి చెప్పిందే మేం రాశాం, చిరంజీవి వంటి సెలబ్రిటీకి కేన్సర్ వచ్చిందనీ, దానికి చికిత్స చేయించుకున్ని, ఎప్పటిలాగే ఆరోగ్యవంతుడు కావడంకన్నా పెద్ద వార్త ఏముంటుంది..? అనేది గనుక ఈ కంటెంట్ రైటర్లు, యూట్యూబర్ల వాదన అయ్యేపక్షంలో…. చిరంజీవి ఫోన్‌కు తన క్షేమాన్ని ఆరా తీస్తూ భారీ ఎత్తున ఆరాలు, పరామర్శలు వచ్చి ఉంటాయి బహుశా… ఇక చిరంజీవికి క్లారిటీ ఇవ్వకతప్పలేదు… ఆ వివరణకూ తోకలు ఈకలు తగిలించి ఇంకా ఏదేదో రాయలేదు ఇప్పుడు… అక్కడికి చిరంజీవి లక్కీ… అవునూ, ఇంతకీ చిరంజీవి ఇచ్చిన వివరణ ఏమిటీ అంటే..? ఇదుగో…
Ads
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు.
-Chiranjeevi
ఈ ప్రకటనలో అవాకులు, చవాకులు అనే పదం వాడటం హార్ష్‌గా ఉంది… అనేకమందిని భయభ్రాంతుల్ని చేసి, బాధపెట్టడం కూడా ఈ వార్తల్లో ఏమీలేదు… ఓ పెద్ద మనిషికి ఏదైనా వ్యాధి వస్తే, చికిత్స ద్వారా నయమైతే… అదే రాస్తే, అందులో భయభ్రాంతుల్ని చేయడం, బాధపెట్టడం ఏముంది..? అవాకులు చవాకులు ఏమున్నాయి..? సాధారణంగా ఆచితూచి మాట్లాడే అలవాటున్న ‘ఆగ్రహ చిరంజీవి’ ఈ ప్రకటనలో కొంత సంయమనం, బ్యాలెన్స్ కోల్పోయినట్టున్నాడు… తను చెప్పిందే నిజమైతే… తనకు అసలు కేన్సర్ అనేది రాలేదు, దానికి చికిత్స కూడా జరగలేదు… సరే, ఇంతకీ చిరంజీవికి వచ్చిన వ్యాధి లేదా ఆరోగ్య సమస్య ఏమిటి..? అసలు ఏమిటీ పాలిప్స్..?
కొలొరెక్టల్ పాలిప్ అనేది పెద్దప్రేగు లేదా పురీషనాళం యొక్క లైనింగ్ నుండి, అంటే గోడల బయటకు వచ్చే కణజాల పెరుగుదల… ఈ పాలిప్స్ నిరపాయమైనవి, అంటే అవి క్యాన్సర్ కాదు, అవి వ్యాపించవు కూడా.., కానీ కాలక్రమేణా కొన్ని రకాలు క్యాన్సర్‌గా అభివృద్ధి చెందుతాయి… ఈ రకాల్లో ఒకదాన్ని అడెనోమాటస్ పాలిప్స్ అంటారు… వీటిని ప్రీ-క్యాన్సర్ పాలిప్స్ అంటారు…
కొలన్ స్కోప్ చేయించుకున్నాడు కాబట్టి ఆ పాలిప్స్ బయటపడ్డాయి… అవి ఎప్పుడైనా కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే అవి తీసేయించుకున్నాడు… సో, ప్రస్తుతానికి తనలో ఆ అనారోగ్య సమస్య లేనట్టే… తొలగిపోయినట్టే… భవిష్యత్తులో అవి ఇబ్బందిగా మారకుండా జాగ్రత్తపడ్డాడు… సో, ఇలాగే అందరూ ముందుజాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అనేది చిరంజీవి చేసిన ప్రసంగసారం… అక్కడివరకూ చిరంజీవి వైపు నుంచి బెటర్ సజెషన్… అయితే ఇవి అంత త్వరగా ఓ సగటు యూట్యూబర్‌కో, సైట్ కంటెంట్ రైటర్‌కో అలాగే అర్థమవుతాయని ఆశించలేం… ‘‘కేన్సర్ రాకుండా పాలిప్స్ తీసేయించుకున్నాను’’ అని చెప్పి ఉంటే బాగుండేదేమో… అదండీ సంగతి…
Share this Article