–9వ తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయన్న భయంతో శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్‌లో ఓ విద్యార్ధిని నాగావళి నదిలో దూకి ఆత్మహత్య..(2023 ఫిబ్రవరి)
–పదో తరగతి ఫలితాలు వచ్చిన 24 గంటల్లో ప్రాణాలు తీసుకున్న పది మంది పిల్లలు.. కన్నవారికి కడుపుకోత (2023 మే 6)
–అంకుల్.. మీరు జర్నలిస్టు కదా.. ఈ స్కూలు వాళ్లకి చెప్పి ఓ సీటిప్పించండంకుల్.. జనవరి రాకుండానే సీట్లయిపోయాయంటున్నారు.. (నా కూతురి ఫ్రెండ్ అభ్యర్ధన 2023 జనవరి 5)
–ఇద్దరు పిల్లల్ని బాచుపల్లిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్పించా. ఒకటో తరగతి, రెండో తరగతిలో చేర్చినందుకు ఏడాదికి కట్టే ఫీజు 3.65 లక్షలు. వచ్చే ఏడాదన్నా మార్చాలండీ.. (ఓ మిత్రుడి అల్లుడి ఆవేదన)
.. హక్కుగా దక్కాల్సిన చిన్ననాటి చదువుల చెదకు రుజువులు. అంగడి చదువులకు ఉదాహరణలు. చట్టాలున్నాయి, సర్కారీ బడులున్నాయి. నిర్బంధ విద్యా విధానం ఉంది. అయినా.. ఏమిటీ వైపరీత్యం. ఎందుకీ మానసిక క్షోభ. పరీక్షల ఫలితాలొచ్చిన ప్రతిసారీ మన చదువులపై ఎడతెగని ముచ్చటుంటుంది. వైఫల్యాల ఏకరవు సరేసరి. తీరాచూస్తే జరిగేదేమీ ఉండవు. మళ్లీ పాతబడే, పాత చదువే. నిద్రపోయేవాళ్లని లేపొచ్చుగాని నటించే వాళ్లని ఏమి చేస్తాం..
లోపమెక్కడుందో విధాన నిర్ణేతలకూ తెలుసు. కొండొకచో కన్నవాళ్లకూ తెలుసూ. అయినా రేసూ తప్పడం లేదు. కడుపుకోతకూ అంతం లేదు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అభివృద్ధి చెందిన అగ్రదేశాలతో ప్రత్యేకించి అమెరికాతో పోలిక తెస్తుంటారు కాని అక్కడి మేలైన విధానాలను ఇక్కడ అమలు చేయడానికి మాత్రం ఇష్టపడరు.
Ads
ఈమధ్య ఓ మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి అనుకుంటా.. అమెరికా ప్రాథమిక విద్యావిధానాన్ని మన దేశంలోనూ అమలు చేస్తే బాగుంటుందన్నారు. అధికారులందరూ వాళ్ల పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకే పంపాలన్నారు. మంచి సూచనే. అమలు చేసేవాళ్లే లేరు. ఈనేపథ్యంలో అమెరికాకి మనకీ ఏమాత్రం పొంతన లేకున్నా నాకు తెలిసిన నాలుగు ముక్కలు రాయాలనిపించింది. అక్కడ ప్రాథమిక విద్య ఎలా ఉందో రేఖామాత్రంగా వివరించే ప్రయత్నమే తప్ప ఇదే సమగ్రం, సంపూర్ణం కాదు. (నేను జర్నలిస్టునే గాని విద్యావేత్తను కాను..)
ఐక్యరాజ్య సమితీ నిర్వచనమేమిటంటే…
ఐక్య రాజ్యసమితీ విద్యావిభాగం చెప్పిందాన్ని బట్టి ప్రాథమిక విద్యంటే 5-8ఏళ్ల మధ్య పిల్లలకు చదవడం, రాయడం, అంకెలు, సంకెలంటే ఏమిటో చెప్పడం, చుట్టుపక్కలుండే సంగతులపై తెలివిడి ఉండేలా చేయడం. ఇది 1997నాటి పరిస్థితి. 2011 నాటికి ఈ తీరు మారింది. చిన్నప్పుడే చదువుకు గట్టి పునాది వేయడంతో పాటు ఇతర విషయాలపై కనీస అవగాహనకు తోడ్పడేలా ప్రాథమిక విద్య ఉండాలని ఐక్యరాజ్యసమితీ చెప్పింది. ఇలా చేస్తే పిల్లల మనుగడ బాగుంటుందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) కూడా చెబుతోంది.
ప్రాథమిక విద్యను తప్పనిసరి చేస్తే పేదరికాన్ని, పిల్లల మరణాల రేటును తగ్గించవచ్చని, ఆడమగ అనే తేడాను తగ్గించవచ్చని, చుట్టుపక్కలుండే పరిసరాలపై మెళకువను పెంచవచ్చనీ అంటోంది. 5, 8 ఏళ్ల మధ్య పిల్లలు తొందరతొందరగా నేర్చుకుంటారు. ఎదుగుదలలో వేగం ఉంటుందని కూడా చెప్పింది. డెవలప్‌మెంటల్ సైకాలజీ విభాగం అధ్యయనంలోనూ ఇదే రుజువైందట. పిల్లలకు ఏమి చెప్పవచ్చో పసిగట్టడానికి ఈ తొలి దశ బడి పనికివస్తుంది.
ఇక అమెరికా విషయానికొస్తే…
అమెరికాలో కిండర్ గార్టెన్ (కేజీ) నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఉచితం. నిర్బంధం. ఎలిమెంటరీ విద్య మూడు స్థాయిల్లో ఉంది. తొలిది ప్రాథమిక పాఠశాల. ఇందులో కిండర్ గార్టెన్ మొదలు రెండో తరగతి వరకు కచ్చితంగా ఉంటుంది. మరికొన్ని స్కూళ్లలో ఆరో తరగతి వరకు ఉంటుంది. 2. ఇంటర్మీడియట్ స్కూలు- ఇందులో మూడు, నాలుగు, ఐదు, ఆరు తరగతుల వరకు ఉంటాయి. (3/4–5/6)
3. మిడిల్ స్కూలు/ జూనియర్ హైస్కూలు- ఇందులో 5 ,6, 7, 8, 9 తరగతులుంటాయి. (5/6/ 7–8/9), ఉన్నత పాఠశాల/ సీనియర్ ఉన్నత పాఠశాలలో (9/10-12 తరగతులుంటాయి. (ఆ తర్వాతి చదువులన్నీ ఖరీదైన వ్యవహారమే). ఐదేళ్లు నిండిన పిల్లలకే స్కూల్లో అడ్మిషన్ ఉంటుంది. అంతకుముందు పంపాలనుకుంటే ప్రీ స్కూల్స్ అని ఉంటాయి.
ప్రీస్కూల్ అంటే ఏమిటీ…
ప్రీ-కిండర్ గార్డెన్ లేదా జూనియర్ కిండర్ గార్డెన్ ను ప్రీస్కూల్ అంటుంటారు. (మన లెక్కలో ప్లే స్కూలు). హెడ్ స్టార్ట్ ప్రోగ్రాం కింద తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే స్కూల్ ఇది. స్కూలంటే బిడియపడే పిల్లల్ని వీటిల్లో చేర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మిగతా పిల్లలతో పాటు పాఠశాలలో మెరుగ్గా రాణించేందుకు సాయపడతాయి. సీట్లు మితంగా ఉంటాయి. అందువల్లనే ఏమో చాలా సేవా సంస్థలు, చర్చీలు కూడా ఈ తరహా స్కూళ్లను నడుపుతుంటాయి. ఈ స్కూళ్లలో చదువుతో పాటు ఆటపాటలు, మోరల్ సైన్స్, యాస, భాష, వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం నేర్పిస్తుంటారు. చాలామందికి ఈ అవసరం ఉండదు కానీ విద్యావేత్తలు ప్రోత్సహిస్తుంటారు. 4 ఏళ్లలోపు అమెరికన్ పిల్లలలో 69% మంది మాత్రమే ప్రీస్కూల్‌లో చేరారు. ప్రీస్కూల్ వయస్సు 3 నుంచి 5 ఏళ్లు.
సెప్టెంబర్ నుంచే విద్యాసంవత్సరం మొదలు…
అమెరికన్ విద్యా సంవత్సరం మామూలుగా ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదట్లో మొదలవుతుంది. సెలవులు ఇవ్వడానికి ముందే అంటే మే నెలాఖరు లేదా జూన్ ప్రారంభం నాటికే ఫలితాలు వస్తాయి. ఒక తరగతి నుంచి మరొక తరగతికి చేరుకుంటారు. ఐదేళ్లు నిండిన పిల్లల మానసిక స్థితి, ఎదుగుదల, పుట్టిన నెల, ఇతర పరిస్థితులను బట్టి వారు ప్రీ-కిండర్ గార్టెన్, కిండర్ గార్టెన్ లేదా ఒకటో తరగతిలో చేర్చుకుంటుంటారు. నవంబర్, డిసెంబర్ లో పుట్టే పిల్లలైతే ఆరేళ్లు వచ్చే వరకు ఆగాలి. 12వ తరగతి వరకు నయాపైసా ఫీజు లేకుండా ఉచితంగా చదువుకోవచ్చు.
87 శాతం మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకే….
అమెరికాలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లున్నాయి. ఇళ్ల వద్దే చదువు చెప్పించుకునే రీతీ ఉంది. కానీ బడీడు వచ్చిన పిల్లల్లో 87 శాతం మంది ప్రజాధనంతో (పబ్లిక్ ఫండింగ్) నడిచే ప్రభుత్వ స్కూళ్లకే పోతుంటారు. మిగతావారిలో 10 శాతం మంది ట్యూషన్ ఫీజు, ఫౌండేషన్-నిధులతో కూడిన ప్రైవేట్ స్కూళ్లకు, మిగిలిన 3 శాతం మంది ఇళ్లల్లోనే చదువుకుంటున్నారు. ప్రతి బడికీ పాలక మండలి, తల్లిదండ్రుల కమిటీలుంటాయి. రాష్ట్ర కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వీటిని పర్యవేక్షిస్తాయి. తల్లిదండ్రుల కమిటీలు, స్కూల్ డిస్ట్రిక్ట్స్ పాలకమండళ్ల సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వాల విద్యా ప్రమాణాలుంటాయి. ప్రామాణిక పరీక్షలూ, గ్రేడ్లు ఉంటాయి.
అమెరికాలో ఓ విద్యార్ధిపై ఖర్చు రూ.12లక్షలు…
ప్రభుత్వ స్కూళ్లకు ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల (లోకల్ బాడీస్/కమ్యూనిటీలు) నుంచే వస్తాయి. ఫెడరల్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధుల్ని ఇస్తుంది. ఇతర దేశాల కంటే అమెరికాలో ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చెక్కువని ఆ దేశం చెప్పుకుంటోంది. అమెరికాలో కేజీ నుంచి 12 వ తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్ధానిక సంస్థలు ఏడాదికి 720.9 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నాయి. అంటే ఒక్కో విద్యార్ధిపై ఏడాదికి సగటున 14,840 డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు 12 లక్షల17 వేలు.
మన దేశంలో సగటున ఒక్కో చిన్నారికి కేటాయించిన మొత్తం 8,297 రూపాయలు. రాష్ట్రాలను బట్టి ఈ కేటాయింపుల్లో హెచ్చుతగ్గులున్నాయి. మేఘాలయలో అతితక్కువగా (రూ.3,792) ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా (రూ.34,758) ఉంది. అమెరికా విద్యను ప్రపంచంలో 14వ అత్యుత్తమమైనదిగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ చెబుతోంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఇసీడీ) ప్రకారం ప్రపంచంలో 31వ స్థానంలో ఉంది. జీడీపీలో 6.2 శాతం నిధుల్ని విద్యపై ఖర్చు చేస్తున్నట్టు అంచనా. అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం) 7.7% నిధులు, రాష్ట్ర ప్రభుత్వాలు 46.7%, స్థానిక ప్రభుత్వాలు 45.6% నిధులు సమకూరుస్తాయి.
ప్రైవేటు పాఠశాలలకు నో ఫండింగ్…
ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు. సొంత సిలబస్, సొంత సిబ్బంది ఉంటుంది. ఇండిపెండెంట్ రీజినల్ అక్రిడిటేషన్ అధికారులు గుర్తింపు ఇస్తుంటారు. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించే ఆంక్షలూ కూడా గట్టిగానే ఉన్నాయి.
స్కూల్ డిస్ట్రిక్ట్స్ విధానమే ప్రధానం….
అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ చాలా ముఖ్యమైనవి. అన్నీ ప్రభుత్వ స్కూళ్లే అయినా వసతులు, ప్రాంగణం, బోధనా సిబ్బంది, చదువుతో పాటు క్రీడలు, ఇతర సృజనాత్మకతల్లో రాణింపు, పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని బట్టి స్కూళ్ల రేటింగ్ ఉంటుంది. ఈ స్కూళ్లకున్న పేరునుబట్టే ఆయా ప్రాంతాల్లోని ఇళ్ల రేట్లు, అద్దెలు కూడా ఉంటాయి. ఉదాహరణకు డాలస్- కొపెల్ స్కూలు డిస్ట్రిక్ట్ లో ఇళ్ల రేటు ఓ విధంగా ఉంటే ఫ్రిస్కోలో మరోలా ఉంటుంది. ఫ్రిస్కోలో ఉండే వాళ్లు ఆ ప్రాంతంలోని స్కూళ్లకే పిల్లల్ని పంపాలి. వేరే చోట ఉండి ఆ స్కూలుకి పంపాలంటే కుదరదు.
ఓ కమ్యూనిటీలో ఎన్ని ఇళ్లుంటాయో వాళ్లకు మాత్రమే ఆ స్కూళ్లలో సీటు ఇస్తారు. ఒకవేళ ఆ స్కూల్లో సీట్లు లేకపోతే ఆ స్కూలు కమిటీ సిఫార్సు మేరకు ఆ ప్రాంతంలోనే ఉన్న మరో స్కూల్లో సర్దుబాటు చేస్తారు. సిఫార్సులు, డొనేషన్ల గోల ఉండదు. అటువంటిదేదైనా ఉన్నట్టు రుజువులుంటే ఫిర్యాదు చేయవచ్చు. ఇళ్లు కట్టేటప్పుడే ఎన్ని ఇళ్లు వస్తాయి, ఎంత మంది పిల్లలుండవచ్చు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని స్కూల్ ప్లాన్ చేస్తారు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తారు.
స్కూల్ కి కిలోమీటర్ లోపుండే పిల్లలకు ఆ స్కూలు నడిపే బస్ ఎక్కే ఛాన్స్ ఉండదు. ఐదో తరగతి పూర్తయ్యేలోపు ప్రతి పిల్లాపిల్లాడు తనకు నచ్చిన ఏదో ఒక దాన్లో- అది ఆటైనా, పాటైనా, వాయిద్యమైనా, మరేదైనా కళో, వృత్తి నైపుణ్యమైనా- నేర్చుకునేలా శిక్షణ ఇస్తుంటారు. సృజనాత్మకతకు పెద్దపీట వేస్తుంటారు. బాధ్యతాయుతంగా మెలగడం నేర్పిస్తారు. ఇచ్చిపుచ్చుకోవడాలు వంటబట్టిస్తారు.
ఇండియాలో ఓ యూనివర్శిటీకి వీసీగా పని చేసిన ఓ పెద్దాయన కుమార్తె చెప్పినట్టు.. భట్టీ చదువులుండవు. ఏదో ఒక క్రియేటివిటీ, యాక్టివిటీ ఉంటుంది. విషయంపై స్పష్టత ఎక్కువ. ఆత్మవిశ్వాసాన్నీ, దేన్నైనా ప్రశ్నించే తత్వాన్నీ నేర్పిస్తారని ఆమె చెబుతోంది.
స్కూలు బస్ ఆగితే ఎక్కడివారక్కడే…
ఇక, స్కూలు బస్సు వచ్చి ఆగిందంటే పిల్లలు దిగిపోయేంత వరకు అందరూ ఆగాల్సిందే. ఆ బస్సుకున్న ఎర్రబల్బు వెలుగుతున్నంత సేపూ ఏ కారూ కదలదు. స్కూలు పిల్లలు సైకిళ్లపై పోతున్నా ఆచితూచి కార్లు నడపాలి. యూనిఫారం ఉండదు. తల్లిదండ్రుల కమిటీలకూ ఎన్నికలు జరుగుతాయి. ఈ పాలకవర్గాలకు పలుకుబడి ఎక్కువే. స్కూళ్లలో ఏదైనా పొరపాటు జరిగిందంటే ముందు ఈ కమిటీలు స్పందిస్తాయి. ఫీజుల గొడవ ఉండదు. కమ్యూనిటీల్లోని జనం కట్టే పన్నుల్లో హీనపక్షంలో మూడో వంతు ఈ స్కూళ్ల అభివృద్ధికి ఖర్చు చేస్తారు.
డ్రాపౌట్స్ శాతం ఇలా…
ఇండియాలో ప్రాథమిక స్థాయిలో (1 నుండి 5 తరగతులు) డ్రాపౌట్ రేటు 2020-21లో 0.8 శాతం ఉంటే 2021-22 విద్యా సంవత్సరానికి 1.5 శాతానికి పెరిగింది. అప్పర్ ప్రైమరీ స్థాయిలో (6-8 తరగతులు), డ్రాపౌట్ రేటు 2020-21లో 1.9 శాతమైతే 2021-22లో 3 శాతానికి పెరిగింది. అదే అమెరికాలో ఎలిమెంటరీ స్థాయిలో తక్కువగా, 12వ తరగతి దాటిన తర్వాత ఎక్కువగా అంటే 3శాతానికి పైగా ఉంది. ఈ డ్రాపౌట్ లో ఎక్కువ మంది నల్లజాతీయులు, మెక్సికన్లు ఉన్నారు.
స్కూళ్ల గొప్పలపై యాడ్స్ ఉండవు…
అమెరికాలో స్కూళ్లు, కాలేజీల ప్రమోషన్లకు యాడ్స్ ఇవ్వరు. రిజల్స్ వచ్చినప్పుడు మన టీవీలలో వినబడే 1,1,1,2,5,6,7,8 ల గోల ఉండదు. గ్రేడింగ్ సిస్టమ్ ఉంది. వీటిని అమెరికా విద్యా విభాగం ఇస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు వస్తున్నాయంటే మన తల్లిదండ్రులు గుండెల్ని దిటవు చేసుకోవాల్సిఉంటుంది. ఇవి వచ్చినప్పుడల్లా తెలుగు రాష్ట్రాలలో అనేక విద్యాకుసుమాలు నేలరాలుతుంటాయి.
అమెరికా ఈ పరిస్థితిలో లేకున్నా వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయి. గన్ కల్చర్, వివక్షత, మానసిక కుంగుబాటు వంటి సమస్యలతో వాళ్లు సతమతం అవుతున్నారు. కిండర్ గార్డెన్ నుంచి 12వ తరగతి లోపు చదవులో కొన్నిసార్లు ఫెయిల్ అయినా, మెరుగైన గ్రేడ్‌లు, స్కోర్‌లు సంపాదించాలనుకున్నా ఇంకో ఏడాది పాటు మళ్లీ చదువుకునే వీలుంటుంది. హైస్కూల్ గ్రాడ్యుయేట్లలో ఎవరైనా కొంతకాలం చదువు మానేసి ఉద్యోగం చేసుకోవాలనుకున్నా, ఇంకేదైనా చదవాలనుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకోవాలనుకున్నా నిర్బయంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి చదువుకోవచ్చు.
ఈ విద్యావిధానాన్నీ మార్చండి… విద్యావేత్తలు
అమెరికన్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంతో గొప్పదని చెబుతున్నా విమర్శలూ లేకపోలేదు. ఇండియాలో ఉన్నది మెఖాలే విద్యావిధానం. ఆనాటి బ్రిటీష్ అవసరాల కోసం ఏర్పాటైంది. అమెరికా విద్యా వ్యవస్థ పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పడిందంటారు. పారిశ్రామిక విప్లవానంతర అవసరాల కోసం ఏర్పడిన అమెరికన్ విద్యా వ్యవస్థ ప్రస్తుత ఆధునిక అవసరాలను తీర్చలేకపోయింది. అందువల్లే దీన్ని మార్చాలని ఇప్పుడు అమెరికన్ విద్యావేత్తలు కోరుతున్నారు. అమెరికన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తున్న 15 అతిపెద్ద వైఫల్యాలను విమర్శకులు ప్రస్తావిస్తుంటుంటారు.
అవి-1. ప్రభుత్వ నిధుల్లో కోత, 2. స్కూళ్లలో కొరవడిన భద్రత, 3. చదువులో టెక్నాలజీతో వచ్చిన ఇబ్బందులు- ఫోన్లు, చాటింగ్, మోసాలు, ప్రతిదానికీ మొబైల్ పై ఆధారపడే తత్వం, 4. చార్టర్ స్కూళ్లు, వోచర్ ప్రోగ్రామ్స్ తో తిప్పలు, 5. ఉమ్మడి సిలబస్ తో ఇబ్బందులు, 6. తరుగుతున్న టీచర్ల వేతనాలు, 7. ఉత్తీర్ణత ప్రమాణీకరణ, 8. స్కూళ్లలో హింస.. వివక్షత, పేదరికం, 9. పబ్లిక్ స్కూళ్లలో పెరుగుతున్న రద్దీ, 10. మానసిక సమస్యలు (ప్రత్యేకించి కళాశాల విద్యార్ధుల్లో), 11. తల్లితండ్రుల నిర్లిప్తత, 12. మూతపడుతున్న స్కూళ్లు, 13. కాలం చెల్లిన బోధనా పద్ధతులు. వీటిని పరిష్కరించే పనిలో ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలు కుస్తీ పడుతున్నాయి.
మాటల్లో కాకుండా చేతల్లో చూపితే మనమూ గ్రేటే..
మన పిల్లలకు ర్యాంకులు వాళ్ల పిల్లలకు నోబెల్స్ వస్తుంటాయని అమెరికాలో స్థిరపడిన బెంగుళూరు వాసి సరదాగా వ్యాఖ్యానించినా నిజం లేకపోలేదు. మనం మార్కులకు, ర్యాంకులకు ఇచ్చిన ప్రాధాన్యత క్రియేటివిటీకి ఇవ్వం. అందువల్లే మన చదువులకు చెదపడితే వాళ్లదేమో అందరికీ నమూనా అయింది. (ఎన్నో లోపాలున్నా) ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలు తమ పిల్లలకు అమెరికన్ విద్యను ఎందుకు అందించాలని కోరుకుంటున్నాయో చెప్పడం సులువే. అమెరికన్ పాఠశాలల ప్రమాణాలు, చదువు చెప్పడంలో సమతుల్యత ఉంటుంది. స్కూళ్లు ముచ్చటగొలుపుతాయి.
ఎలిమెంటరీ స్కూల్లోనే ప్రతి పిల్లాపిల్లాడు ఏదో ఒక ప్రత్యేకతను చాటే ప్రయత్నం ఉంటుంది. క్రియేటివిటీ కోసం తాపత్రయపడతాయి. డబ్బున్నోడికో చదువు లేనోడికో చదువు చెప్పే పరిస్థితి లేదు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు కచ్చితంగా ఉపయోగపడేలా ఆ చదువుంది. మిగతా వ్యవహారాలలో అమెరికా ఎంత రోసిపోయినా ప్రాధమిక విద్యకు మాత్రం పెద్దపీటే వేసింది. ప్రాధమిక విద్యను వ్యాపారం కాకుండా చేసింది. అమెరికా అంతా, ఇంతని చెప్పడం కాకుండా ఉచిత నిర్బంధ విద్యావిధానాన్ని పక్కగా అమలు చేస్తే మనమూ యూఎస్ ను మించిపోవచ్చు. దీనికి కావాల్సింది విధాన నిర్ణేతల చిత్తశుద్ధే.
_ అమరయ్య ఆకుల, 9347921291
Share this Article