కొన్ని నమ్మలేం… సినిమాలు, నవలలు, ఇతర కల్పనాత్మక కథలను మించి జీవితం మెలోడ్రామాను, ఎమోషన్స్‌ను చూపిస్తుంది… ఈ విశిష్ట కథనంలోకి వెళ్దాం… (చాలామంది ఈ న్యూస్ స్టోరీని ఆల్‌రెడీ చదివేసి ఉండవచ్చు… ఐనాసరే, ఇది ముచ్చటలో రికార్డ్ చేయాలని ఉంది… అందుకే ఈ పోస్ట్…)
బాలాసోర్ రైలు ప్రమాదం… వందల మంది మరణం… వేయి మంది దాకా క్షతగాత్రులు… మరణించింది ఎవరో తేల్చిచెప్పలేని దురవస్థ… అన్నీ మాంసం ముద్దలు… తెగిపడిన అవయవాలు ఏవి ఎవరివో… రిజర్వేషన్ బోగీల్లో మృతుల వివరాలు తెలుస్తున్నాయి కాస్త… కానీ మిగతా బోగీల్లోని వాళ్లు..? డీఎన్ఏ టెస్టులు అంటోంది ప్రభుత్వం… కుట్రా, ప్రమాదమా తేల్చడానికి సీబీఐ దర్యాప్తు అంటోంది ప్రభుత్వం… ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన కొడుకు కోసం ప్రయాసపడిన తీరే ఈ కథనం…
శుక్రవారం షాలిమార్ స్టేషన్‌లో కొడుకు విశ్వజిత్‌ను (24) దింపివచ్చాడు హౌరాలోని చిన్న దుకాణదారుడు హేలారామ్… రైలు ప్రమాదం గురించి విన్నవెంటనే ఆందోళనతో కాళ్లూచేతులు ఆడలేదు… కొడుకు ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు… సన్నగా వినీవినిపించని మూలుగు… కట్టయిపోయింది… ఎన్నిసార్లు చేసినా మళ్లీ నో రెస్పాన్స్… అంతా బాగున్నట్టయితే కొడుకు తనకు కాల్ చేసి చెప్పేవాడు కదా… హేలారామ్ మాలిక మనసు ఏదో విషాదాన్ని శంకించింది… ఎవరికి ఫోన్ చేసి ఏమడగాలో అర్థం కావడం లేదు…
Ads
స్థానిక అంబులెన్స్ డ్రైవర్ పలాష్ పండిట్‌ను పిలిచాడు… బావ దీపక్‌దాస్‌ను తనతో రావాల్సిందిగా అభ్యర్థించాడు… అదే రాత్రి బాలాసోర్ బయల్దేరారు… అదే రాత్రి 230 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించారు… పలు హాస్పిటళ్లలో కొడుకు ఆచూకీ కోసం అన్వేషణ… ఒడిశా ప్రభుత్వ బృందాలు సహాయక చర్యల్లో బాగానే కష్టపడుతున్నాయి… అంబులెన్సులు, రక్తదానం కోసం వచ్చిన వందలాది మంది గ్రామస్థులు, ప్రమాదస్థలి నుంచి ఎయిర్ లిఫ్ట్ కోసం హెలికాప్టర్లు కూడా వాడారు… వీలైనంతమంది వైద్యసిబ్బందిని హుటాహుటిన బాలాసోర్ తరలించారు…
ఒకసారి ఫోన్‌లో మాట్లాడాక, మళ్లీ ఏమైంది..? ఫోన్ చార్జింగ్ అయిపోయిందా..? హాస్పిటల్‌కు తరలిస్తుంటే పోయిందా..? కొంపదీసి సకాలంలో వైద్యం అందక మరణించి ఉంటాడా..? గుండె దిటవు చేసుకుని మార్చురీలు తిరిగాడు తండ్రి… ఆచూకీ లేదు… ఎవరో చెప్పారు… మార్చురీలు నిండిపోయి తాత్కాలికంగా శవాల్ని బహనాగా హైస్కూల్‌లో పెట్టారని… అక్కడికి పరుగు… మరణించాడని అంగీకరించడానికి మనసొప్పడం లేదు… ఎక్కడో ఏ మూలో కొడుకు మీద ప్రేమ ఆశని బతికిస్తోంది…
ఆ తాత్కాలిక శవాగారంలో అన్ని శవాల నడుమ… అప్పటిదాకా విశ్వజిత్ పరిస్థితి భయానకం… దెబ్బల బాధ, తీసుకొచ్చి శవాల నడుమ పడేశారు… నోటి వెంట మాటరావడం లేదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఓ డాక్టర్ చెప్పినట్టు…. విశ్వజిత్ బతుకు సస్పెండెడ్ యానిమేషన్… అంటే జీవం మాత్రమే ఉంది… ఎక్కడో మిణుకుమిణుకుమంటూ…! అందుకే తను మరణించినట్టుగా భ్రమించి, టెంపరరీ మార్చురీకి తీసుకొచ్చి దేహాన్ని అక్కడ పెట్టేశారు…
ఇక్కడ వైద్య సిబ్బందిది నిర్లక్ష్యమని నిందించలేం… తనున్న స్థితిలో ఎవరైనా, ఏ హాస్పిటలైనా అలాగే ఉంటుంది పరిస్థితి… అన్ని వందల మంది క్షతగాత్రుల్ని అటెండవుతూ, నిర్విరామంగా కష్టపడుతున్నవేళ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి… పైగా సహాయకచర్యల్లో వైద్యేతర సిబ్బంది కూడా శ్రమిస్తుంటారు… వాళ్లు ఒక దేహంలో ప్రాణం ఉందా లేదా కీన్‌గా చూడలేకపోవచ్చు, వాళ్లకు అంత వైద్యపరిజ్ఞానం ఉండకపోవచ్చు… ఉన్నాసరే, కొన్నిసార్లు అది పనిచేయకపోవచ్చు…
బాండ్ రాసిచ్చి, విశ్వజిత్‌ను డిశ్చార్జి చేయించుకుని, కోల్‌కత్తాకు తీసుకుపోయారు… శస్త్రచికిత్సలు కొన్ని జరిగాయి… కోల్‌కత్తాకు తీసుకుపోతున్నప్పుడు కూడా విశ్వజిత్ అపస్మారకమే… అనేక గాయాలతో ఉన్న తను ఎన్నాళ్లకు పూర్తిగా కోలుకుంటాడో తెలియదు… కానీ యమధర్మరాజు యమపాశం నుంచి తప్పించుకున్నట్టే…
ఆ తండ్రి ఆ రాత్రే బయల్దేరి, వెంట అంబులెన్స్‌ను కూడా తీసుకొచ్చి, హాస్పిటళ్లలో వెతుకుతూ, మార్చురీల్లో వెతుకుతూ… చివరకు టెంపరరీ మార్చురీలోనూ వెతుకుతూ… అనుకోకుండా కొడుకు ఆచూకీ దొరికితే… కాపాడుకోవడానికి మళ్లీ డాక్టర్లు… చివరకు కోల్‌కత్తాకు తీసుకుపోయి, మరింత మెడికల్ కేర్ కోసం తిప్పలు పడుతూ…. మనసుల్ని కదిలించే తండ్రి తపన… చదివే వాళ్ల మనస్సులు కనెక్టయ్యేలా… ఆ సానుభూతి విశ్వజిత్‌ను వేగంగా మళ్లీ మామూలు మనిషిని చేస్తుందనే సత్సంకల్పతో… జీతేరహో విశ్వజిత్…
Share this Article