కర్నాటక వోటర్లు కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలను నమ్మి, వాటి మీద ఆశతో వోట్లేశారా..? లేక బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, నాయకత్వ లోపాలతో విసిగిపోయి కాంగ్రెస్ వైపు మళ్లారా..? చిన్న తేడా ఉంటుంది… బీజేపీని ఓడించారా..? కాంగ్రెస్‌ను గెలిపించారా…? ఈ ప్రశ్నలకు జవాబులు కష్టం… ఉదాహరణకు… ఏపీ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల్లో రైతుల రుణమాఫీ వంటి చంద్రబాబు హామీలు ఏపీ రైతుల మీద ప్రభావం చూపించాయి, గెలిచాడు… 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ వంటి ఎన్ని తాయిలాలు సమర్పించుకున్నా సరే ప్రజలు లొంగలేదు… చాలుపో అన్నారు…
ఇప్పుడు జగన్ కూడా అలవిమాలిన ‘పంచుడు పథకాలు’ అమలు చేస్తున్నాడు… ఈసారి ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలిక… కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది 200 యూనిట్ల ఫ్రీపవర్… ఇప్పటికే ఇలాంటి రాష్ట్రాల్లో డిస్కమ్స్ విపరీతమైన రెవిన్యూ లోటుతో, జమకాని ప్రభుత్వ సబ్సిడీలతో సతమతం అవుతున్నయ్… ఇక 200 యూనిట్ల ఫ్రీ పవర్ అంటే పరిస్థితి..?
నిజానికి ఏ పార్టీ ఏ హామీలిచ్చినా సరే… వాటి అమలుకు సవాలక్ష కొర్రీలు పెడుతుంటారు అధికారగణం… ట్రూ స్పిరిట్‌తో అమలు చేయాలనే అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా సిన్సియర్‌గా ప్రయత్నించదు… ఫ్రీపవర్ అనే అంశంలో వైఎస్ చిత్తశుద్ధిని మెచ్చుకోవాలి… వ్యవసాయానికి ఫ్రీపవర్‌ను ఎలాంటి కోతలు, కత్తిరింపులు లేకుండా అమలు చేశాడు… రైతులపై పెట్టిన కేసులు, గత బకాయిల రద్దు కూడా మనస్పూర్తిగానే అమలు చేశాడు… కానీ ఇప్పుడు కర్నాటకలో ఫ్రీపవర్ అమలుకు అప్పుడే కిరికిరి స్టార్టయింది… ఏపీలో చంద్రబాబు రైతురుణమాఫీ విషయంలో ఎన్ని కోతలు పెట్టాడో గుర్తుందిగా… అలాగన్నమాట…
Ads
కర్నాటక ప్రకటించిన గృహజ్యోతి (ఫ్రీ పవర్) స్కీమ్ అమలుకు మార్గదర్శకాలు వెలువడ్డాయి… సేవ సింధు పోర్టల్‌లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు… అయితే కిరికిరి అంతా అమలు మార్గదర్శకాల్లో ఉంది… ఈ స్కీమ్ కేవలం గృహవినియోగానికి మాత్రమే పరిమితం… హామీ ఇచ్చింది కూడా డొమెస్టికే కాబట్టి తప్పుపట్టడానికి ఏమీలేదు అందులో…
అబ్బే, ఇందులో సంక్లిష్టత ఏమీ లేదు, 200 యూనిట్ల వాళ్లందరికీ జీరో బిల్లు వస్తుంది… 200 యూనిట్లు దాటితే ఆమేరకు డబ్బు కట్టాలి, సింపుల్ అనుకుంటున్నారా..? కాదు… తిరకాసులున్నయ్… ముందుగా కస్టమర్లు తమ కరెంటు కనెక్షన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి… ఈనెలాఖరుకు ఉన్న మొత్తం బకాయిలను తీర్చేయాల్సి ఉంటుంది… రూపాయి బిల్లు బాకీ ఉన్నా ఈ పథకం వర్తించదు… బకాయిలు అలాగే ఉంటే 3 నెలల్లో కనెక్షనే కట్ చేస్తారు…
- ఓ ప్రధానమైన తిరకాసు చెప్పుకుందాం… సపోజ్ మీరు 100 యూనిట్ల మేరకు సగటున వాడుకుంటున్నారని అనుకుందాం… ఈ సగటు కరెంటు వాడకం ఎంతో గత ఏడాది బిల్లుల ఆధారంగా (అంటే 12 నెలల సగటు) ముందుగానే లెక్కేస్తారు… దానికి ఎప్పుడూ కాస్త అటూఇటూ తేడా ఉంటుంది కాబట్టి పది శాతం లివరేజ్… అంటే 110 యూనిట్ల వరకూ మీకు ఫ్రీ వాడకానికి అనుమతి… అంతే… దాన్ని మించి ఒక్క యూనిట్ అదనంగా కాల్చుకున్నా సరే, దానికి బిల్లు వస్తుంది…
- ఎలాగూ ఫ్రీ కరెంటు కదాని ఇన్నాళ్లూ ఆచితూచి ఖర్చుపెట్టుకున్నవాళ్లు కూడా ఉదారంగా కాల్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నిబంధన పెట్టారు అనుకుందాం… అలాగని ఒక ప్రాంగణంలో మూడు నాలుగు మీటర్లు ఉంటే, అన్నింటికీ ఈ 200 ఫ్రీ యూనిట్ల పథకం వర్తించదు… ఏదో ఒక మీటర్ బిల్లులకే వర్తిస్తుంది… ఒకటికి మించి ఎన్ని మీటర్లున్నా సరే, వాటికి ఈ గృహలక్ష్మి వర్తించదు,.. అలాగే 200 యూనిట్లు దాటితే, దాటిన యూనిట్లకే బిల్లు వస్తుందని అనుకోవద్దు… మొత్తం బిల్లు కట్టాల్సిందే…
ఇప్పటికే పేద వినియోగదారుల కోసం రాష్ట్రంలో కుటీరజ్యోతి, భాగ్యజ్యోతి స్కీములున్నయ్… వాటిని కూడా ఈ కొత్త గృహజ్యోతి స్కీమ్‌లో కలిపేస్తారు… ఈ నెల 11 నుంచి ‘శక్తి’ అనే స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు… ఈ పథకం కింద బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు… దీనికోసం శక్తి స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు… అయితే ఈ స్కీమ్ రాజహంస, నాన్-ఏసీ స్లీపర్లు, అంబారీ, ఐరావత్ వంటి లగ్జరీ బస్సులకు వర్తించదు… కేవలం సిటీ బస్సులు, పల్లె బస్సులకు మాత్రమే అన్నమాట…
కర్నాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్ కార్పొరేషన్, కల్యాణ కార్పొరేషన్ బస్సుల్లో 50 శాతం సీట్లను మగవాళ్లకు రిజర్వ్ చేస్తారు… ఈ శక్తి స్కీమ్‌కూ ఈ మగ రిజర్వేషన్లకూ లింక్ దేనికో, ప్రభుత్వం ఏం ఆశిస్తుందో పూర్తిగా వివరాలు తెలియవు ఇంకా…
Share this Article