Murali Buddha……… మీరు అమరావతికి వెళ్ళండి పిల్లలతో, మేం హైదరాబాద్ లోనే :: ఐఏఎస్ ల భార్యలు….. వంద కోట్లు ఇచ్చి బాబే తెరాస పెట్టించాడు : సీనియర్ అధికారులంతా అమరావతికే … ఆ రోజుల్లో చిత్రమైన ప్రచారం……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు………
—————-
‘‘మీకేంటీ, రెడీమేడ్ రాజధాని హైదరాబాద్ ఉంది . కష్టాలు అన్నీ మాకే . చివరకు ఐఏఎస్ ల భార్యలు కూడా హైదరాబాద్ వదిలి మేం అమరావతికి రాం .. పిల్లలతో ఇక్కడే ఉంటాం . మీరు వెళ్ళండి అంటున్నారు’’ అని చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చీఫ్ సెక్రెటరీని మించి అధికారం చెలాయించిన బాబు ఓయస్‌డి లక్ష్మీ నారాయణ చెప్పిన మాటలు ఇవి …
Ads
2014లో తెలంగాణ ఏర్పడి , ఓటుకు నోటు కేసు తరువాత చంద్రబాబు హఠాత్తుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రకు తరలి వెళ్లారు . అప్పుడు రాజ్యసభ ఎన్నికలు. అసెంబ్లీలో హడావుడిగా ఉంది . అధికారిక పనిమీద వచ్చిన లక్ష్మీనారాయణ ( ఐఏఎస్ ) అక్కడ తనకు పాత పరిచయం ఉన్న నన్ను చూడగానే దగ్గరకు వచ్చి పలకరించారు… ఒకప్పుడు లక్ష్మీనారాయణ నడిచి వస్తున్నాడు అంటే రాష్ట్రంలోని అధికారం అంతా నడిచి వస్తుంది అన్నట్టు ఉండేది . బాబుకు లక్ష్మీనారాయణ చదువుకునే రోజుల్లోనే స్నేహితుడు . 78లో బాబు శాసనసభకు ఎన్నిక అయినప్పుడు బాబు , లక్ష్మీనారాయణ హైదరాబాద్ లోని ఎంఎల్ఏ క్వార్టర్ లో ఒకే క్వార్టర్ లో ఉండేవారు . వారిది అంత గాఢమైన స్నేహం కావడంతో సీఎం పేషీలో లక్ష్మీనారాయణ అధికారం వెలిగిపోయేది . తనది కానీ వేరే లోకంలోకి వచ్చాము అన్నట్టు కనిపించిన అతన్ని గతంలో ఎప్పుడూ అలా బేలగా చూడలేదు .
పాత పరిచయం ఉన్న వ్యక్తిని దగ్గరలో నేనొక్కడినే కనిపించడంతో దగ్గరకు వచ్చి మాట్లాడారు . ఎలా ఉంది కొత్త కాపురం అంటే , ఉద్యోగులు హైదరాబాద్ నుంచే వస్తామనడం మాత్రమే కాదు , చివరకు ఐఏఎస్ లు సైతం ఇష్టపడడం లేదు . వాళ్ళ భార్యలు మీరు వెళితే వెళ్ళండి మేం హైదరాబాద్ లోనే ఉంటాం అంటున్నారు అంటూ కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు … కొత్త కాపురంలో ఇబ్బందులు ఉంటాయని తెలుసు , కానీ ఎలా ఉంది అని అడగడానికి కారణం ఉంది .
2001లో తెరాస ఆవిర్భవించిన కొత్తలో టీడీపీ శిబిరం నుంచి చిత్రమైన ప్రచారాలు జరిగేవి . జ్యోతిలో ఇరిగేషన్ వార్తలు రాసే రిపోర్టర్ , చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే కాంట్రాక్టర్ ఒకరు ఓ రోజు అసెంబ్లీ లో TDLP కార్యాలయం వద్ద ఉంటే ‘‘మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి , బాబే వందకోట్లు ఇచ్చి తెరాసను పెట్టించారు’’ అంటూ కథ చెప్పుకొచ్చారు . అతనో మేస్త్రీ లాంటోడు, అసెంబ్లీలో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు , కాంట్రాక్టర్ ను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు అని అతని గురించి … హిమాయత్ నగర్ టీడీపీ కార్యాలయం కార్యదర్శిగా పని చేసిన మూర్తి అని మిత్రుడు చెప్పేవాడు .
ఇక వంద కోట్ల కథ చెప్పిన అతను జ్యోతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో కుంభకోణాలు అని తెగ రాసేవారు . ఓసారి మంత్రిగా ఉన్న యస్వి సుబ్బారెడ్డి మీడియాతో వంద కోట్ల ప్రాజెక్ట్ లో వంద కోట్ల కుంభకోణం అని రాయండి , కానీ వంద కోట్ల ప్రాజెక్ట్ కు రెండు వందల కోట్లు స్వాహా చేశామని రాయడం ఏమిటండి అని విస్తుపోయారు . నాయనా పులి వచ్చే కథలా .. ఇలాంటి కథల వల్ల వార్తల విలువ తగ్గిపోయింది . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు . రాయలసీమ వారు . వందకోట్లు ఇచ్చి తెలంగాణ కోసం పార్టీ ఎందుకు పెట్టిస్తారు , దాని వల్ల ఆయనకేం లాభం లాజిక్ ఉండాలి కదా ? అంటే అదంతే చాలా విషయాలు ఉంటాయి అంటూ చెప్పుకు పోయారు . నీ పేరు మురళి తెలుసా ? అని ఎవరైనా చెప్పినా ఆసక్తిగా వినడం నాకు అలవాటు. అతను ఎక్కడి వరకు చెబుతాడో చూద్దాం అన్నట్టు వింటాను . ఇలాంటి చిత్రవిచిత్రమైన ప్రచారాలు ఆ పార్టీ శిబిరం నుంచి వినిపించేవి .
పదమూడేళ్ల ఉద్యమం తరువాత తెలంగాణ సాకారం అయింది . ఓ రోజు సచివాలయంలో అందరు రిపోర్టర్లు గుమికూడే సచివాలయం ప్రెస్ రూమ్ ఎదురుగా ఉన్న చెట్టు వద్ద వంద కోట్ల కథ చెప్పిన జర్నలిస్ట్ కనిపించారు . అప్పుడు అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తున్న సమయం . అధికారులంతా ఆంధ్రానే సెలక్ట్ చేసుకుంటున్నారు , త్వరగా ప్రమోషన్ వస్తుంది అని . ఇరిగేషన్ లో నైతే తెలంగాణ కు మరీ ఇబ్బందే . సీనియర్లు అంతా ఆంధ్రాకే వెళుతున్నారు . రేపు రేపు ఇబ్బందులు తప్పవు అంటూ సానుభూతి చూపారు . పత్రికలో రాసే వార్తల్లోనే కాదు చివరకు తోటి వారితో మాట్లాడడం కూడా తాము ఏం జరగాలని కోరుకుంటారు , అది జరుగుతున్నట్టు కథలు చెబుతారు అనిపించింది . 2014 నుంచి తొమ్మిదేళ్లు గడిచాక ఇంజనీర్లు ఉండరు, ఇబ్బంది అన్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి ఎండాకాలంలోను తెలంగాణ పల్లెల్లో జల కళ ఉట్టి పడుతోంది . జాతీయ ప్రాజెక్ట్ అయినా పోలవరం పూర్తి కాలేదు . ఇలాంటి కథలు వినే .. అసలేంటో నిర్ధారించుకుందాం అని లక్ష్మీ నారాయణతో కొత్త కాపురం ఎలా ఉంది అని మాట్లాడాను …
Share this Article