Murali Buddha……….. స్టార్ రైటర్స్ ను సృష్టించిన మెగా ఎడిటర్ సికరాజు… వార పత్రికకు అభిమాన సంఘాలు …. చనిపోతే సింగిల్ కాలం వార్తా వద్దన్న శాస్త్రి … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -..
_________…. ____________________
ఈ తరం వాళ్ళు నమ్మక పోవచ్చు కానీ ఒక కాలంలో ఆంధ్రభూమి రచయితలు అంటే సినిమా తారలను మించిన క్రేజీ ఉండేది . రచయితలు జిల్లాల్లో పర్యటిస్తే సినిమా వాళ్ళను చూసినట్టు గుంపులుగా జనం ఎగబడేవారు . పత్రికకు అభిమాన సంఘాలు ఉండేవి , పత్రిక మార్కెట్ లోకి రావడానికి ఆలస్యం అయితే ఆఫీస్ ముందు ధర్నాలు జరిగేవి . రచయితలకు సినిమా నటుల్లా క్రేజీ తీసుకువచ్చింది ఎడిటర్ సి .కనకాంబరరాజు . డక్కన్ క్రానికల్ ఏజెన్సీ తీసుకుంటేనే ఆంధ్రభూమి వారపత్రిక ఏజెన్సీ ఇస్తాం అని షరతులు పెట్టేవారు . వారపత్రికకు అంత మోజు ఉండేది .
Ads
*********
ఆంధ్రభూమి ఆఫీస్ లో ఎడిటర్ ఛాంబర్ లోకి సబ్ ఎడిటర్ వెళ్లి , ముఖం అదోలా పెట్టుకొని వచ్చాడు. ఏమైంది అని అడిగితే , ఆంధ్రభూమి వారపత్రిక ఎడిటర్ కనకాంబరరాజు మరణించారు, ఎడిటర్ శాస్త్రికి చెప్పి ఆ వార్త వేద్దాం అంటే అవసరం లేదు అని చిరాగ్గా చెప్పి పంపించాడు అని సమాధానం . ఆంధ్రభూమిలో 1987 లో జొన్నలగడ్డ రాధాకృష్ణ నన్ను రిపోర్టర్ గా నియమించారు . కనకాంబరరాజుతో అనుబంధం లేదు , వ్యతిరేకత లేదు . కానీ వార్తాపత్రికను ఊహించని స్థాయికి తీసుకువెళ్లాడు అనే గౌరవం ఉండేది . సింగిల్ కాలం వార్త కూడా వేయాల్సిన అవసరం లేదు అని శాస్త్రి అలా పంపడంలో ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు .తనను తానూ తప్ప ఇతరులను అసలు మనుషులుగానే గుర్తించని అతను ఇక మనుషుల్లోని గొప్పతనాన్ని గుర్తిస్తాడు అనుకుంటే అత్యాశ అవుతుంది .
కనకాంబరరాజు మరణించాడు అని తెలియడం , సింగిల్ కాలం వార్త కూడా వేయాల్సిన అవసరం లేదని అన్నట్టు విన్నాక, ఆఫీస్ లో ఉండలేక సన్నిహితంగా ఉండే ముగ్గురు మిత్రులం బయటకు వెళ్లి మాట్లాడుకున్నాం . నేనూ , శైలేంద్ర , వెల్జాల చంద్రశేఖర్ అని గుర్తు . మనిషి అనే వాడు ఎప్పుడో ఒకప్పుడు పోతాడు , పోవలసిందే . ఎడిటర్ శాస్త్రి పోతే , అప్పుడు మనం భూమిలోనే ఉంటే భూమిలో మాత్రం వార్త రాకుండా చూసుకోవాలి అని మాట్లాడుకుని శాంతించి లోపలి వెళ్లి పోయాం . అప్పుడు మేం అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు . ఇలా మాట్లాడుకున్నాం అని తెలిసినా , మా ఉద్యోగాలు వదిలి మా అంతట మేం బయటకు వెళ్లి పోయేంతగా ఎడిటర్ మానసికంగా పెట్టే హింస గురించి తెలుసు . నెల నెల వచ్చే ఆ మంచి జీతాన్ని వదులుకుంటే బతికే పరిస్థితి కాదు .
*****
నిద్ర పోతున్న జర్నలిజాన్ని తట్టి లేపింది . పరుగులెత్తించింది ఉదయం అని చాలా మంది చెబుతారు . ముసలితనంతో అడుగులు వేయలేక మెల్లగా నడుస్తున్న వారపత్రికలకు కనకాంబరరాజు పరుగులు నేర్పించారు . 1976 లో ఆంధ్రభూమి వారపత్రిక మొదలైంది . మొదటి సంచిక నుంచి నాకు అనుబంధం ఉంది. సికిందరాబాద్ బుర్గుశెట్టి బజార్ లో మా అన్నకు బట్టల షాప్ ఉండేది . అప్పటి వరకు ఆంధ్రప్రభ వారపత్రిక వచ్చేది . ప్రభ మానేసి ఆంధ్రభూమి మొదటి సంచిక నుంచి తెప్పించడం వల్ల మొదటి నుంచి అనుబంధం .తరువాత 87లో భూమి దినపత్రికలో చేరాక వారపత్రిక హడావుడి , కనకాంబరరాజుకు ఉండే ఫాలోయింగ్ , అయన వచ్చేటప్పుడు , వెళ్లేటప్పుడు కనిపించే హడావుడి చూసేవాడిని .
మంచి కళాకారుడు అని ప్రచారం ఉండేది . ఎదుటి వారిని కళాకారుడు అని చెప్పడం ద్వారా నేను పవిత్రుడిని అని చెప్పుకోవడం మన హిపోక్రసి . కొందరి కళలు బయటపడి కళాకారుడు అనే ముద్ర పడుతుంది . కొందరివి గుప్త దానాల్లా గుప్త కళలు . అస్సలు బయటపడవు . స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లా కనిపిస్తారు కానీ నిజానికి మన్మథ లీలలో కమల్ హాసన్ లు .నిలువెత్తు సంప్రదాయం నడిచివస్తున్నట్టు , దండం పెట్టాలి అనిపించే మహా అవధాని మాడుగుల నాగఫణి శర్మ మంచి కళాకారుడు అని అమెరికాలో కేసు పెట్టేంత వరకు బయటపడలేదు .
అవకాశం ఉంటే ప్రతివాడు కళాకారుడే .. భయం , అవకాశం లేకపోతే తప్ప … కనకాంబరరాజులోని కళాకారుడు గురించే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు . అందులో నిజం ఉందో లేదో తెలియక పోయినా …కానీ కనకాంబర రాజు స్టార్ రైటర్స్ ను తయారు చేసిన మెగా ఎడిటర్ అనే మాట మాత్రం నిజం . అంతకు ముందు ఆంధ్రపత్రిక , ఆంధ్రజ్యోతి , ఆంధ్రప్రభ వారపత్రికలు ఉన్నా , వీటికి భిన్నంగా ఆంధ్రభూమి ఉండేది .
తొలుత కనకాంబరరాజు ఆంధ్రపత్రికలో పని చేసేవారు . 76లో తొలి ఎడిటర్ కందనాతి చెన్నారెడ్డి , అప్పుడు కనకాంబరరాజు డిప్యూటీ ఎడిటర్ . 1980 లో కందనాతి వెళ్ళిపోయాక కనకాంబరరాజు ఎడిటర్ . దాదాపు 1990 వరకు స్వర్ణయుగాన్ని చూపించారు .యండమూరి వీరేంద్రనాథ్ , మల్లాది వెంకట కృష్ణమూర్తి , కొమ్మనాపల్లి గణపతి రావు , చందు సోంబాబు , కార్టూనిస్ట్ మల్లిక్ ఇంకా చాలా మంది సినిమా స్టార్స్ గా వెలిగిపోయారు .
వాస్తును తెలుగు వారికి అంటించడంలో సికరాజుది కీలక పాత్ర . దంతూరి పండరినాథ్ సీరియల్స్ రాసేవారు … ఆయనకు వార పత్రికలో వాస్తు సమాధానాలు రాసే బాధ్యత అప్పగించారు . వార పత్రిక ద్వారా వాస్తు జనం బుర్రలోకి బాగా ఎక్కింది .ప్రజల వాస్తు ఎలా ఉన్నా దంతూరి వాస్తు మాత్రం దశ తిరిగింది . సీరియల్స్ రాయడం మానేయడమే కాదు , రాశారు అనే ఆనవాళ్లు ఉండడం కూడా ఇప్పుడు ఇష్టపడరు . రాజధానిలో ఖరీదైన వాస్తు కన్సల్టెంట్ లో వారు ఒకరు . కొమ్మనాపల్లి సినిమాల వైపు వెళ్లగా , యండమూరి ఒక్కరే ఇంకా పాపులర్ రచయితగా రాస్తూనే ఉన్నారు .
ఇంగ్లీషులో వచ్చిన బూతు జోకులతో కల్నల్ ఏకలింగం నవల రాసిన మల్లాది ఇప్పుడు భక్తిలో మునిగిపోయారు . మిగిలిన వారి సంగతి తెలియదు . వీరందరినీ వెలుగులోకి తీసుకువచ్చి స్టార్ రైటర్ గా మార్చింది కనకాంబరరాజు .1993 లో నేను నల్లగొండ జిల్లాలో రిపోర్టర్ గా ఉండగా , మిగిలిన జిల్లాల నుంచి రిపోర్టర్లు ఫోన్ చేశారు . వార పత్రిక ఎడిటర్ కనకాంబరరాజును ఆంధ్రభూమి దినపత్రికకు కూడా ఎడిటర్ ను చేస్తున్నారు , తిరుగుబాటు వస్తుంది , అయన ఎడిటర్ గా ఉంటే పవిత్రులం మనం పని చేయడం ఏమిటీ అనేది ఆ ఫోన్ లోని ఆందోళన సారాంశం .
జీతం ఇచ్చేది యాజమాన్యం , వాళ్ళ పత్రిక వాళ్ళిష్టం . నువ్వు రిపోర్టర్ గా , పలానా వ్యక్తి ఎడిటర్ గా ఉండాలి అని పెట్టుబడి పెట్టిన వ్యక్తి నిర్ణయించాడు . వ్యతిరేకించడానికి నువ్వెవరు , నచ్చక పోతే వెళ్ళిపో ….అని నా అభిప్రాయం చెప్పాను . మన ఆఫీస్ లో పని చేసే అటెండర్ నాగేశ్వర్ రావును ఎడిటర్ గా పెట్టినా నాకు అభ్యంతరం లేదు . ఎందుకంటే అటెండర్ లలో అతనొక్కడే సౌమ్యంగా మాట్లాడతాడు ,మనం అంటే గౌరవం , మంచినీళ్లు తెమ్మన్నా తెచ్చి ఇస్తాడు అని జోకేశాను . తిరుగుబాటు లేదు గాడిద గుడ్డు లేదు అంతా ఎవరి పనుల్లో వారున్నారు .
జర్నలిస్ట్ లు అందరు కూడా ఈగోతో కనకాంబరరాజును తక్కువగా అంచనా వేశారుకాని . ఆంధ్రభూమి దినపత్రికకు కూడా అతను కొత్త రూపు తీసుకువచ్చారు . రెండేళ్ల లోపే ఉన్నా బలమైన ముద్ర వేశారు . ఇప్పుడు అన్ని దినపత్రికల ఆదివారం అనుబంధాలు పుస్తక రూపంలో వస్తున్నాయి . అది మొదలు పెట్టింది కనకాంబరరాజు . ఈనాడుతో పాటు అన్ని పత్రికలకు దినపత్రికల సైజులోనే ఆదివారం అనుబంధం పేజీలు ఉండేవి . ఆదివారం అనుబంధం మొదటి సారి రాజు హయాంలోనే టాబ్లాయిడ్ సైజు బుక్ లో తెచ్చారు . తరువాత అన్ని దినపత్రికలు దీనిని అనుసరించాయి .
దిన పత్రికలను మ్యాగజైన్ లా మార్చింది రాజు హయాంలోనే . ఏడు వారాల నగలు అంటూ రోజుకో ప్రత్యేక అనుబంధం మొదలు పెట్టారు . చాలా కాలం తరువాత ఈనాడు అదే విధంగా ఏడు వారాల నగలు అని మొదలు పెట్టారు . ఐతే ఈనాడు ఏది ప్రారంభించినా ఒక పద్దతి ఉంటుంది . అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి . ఒక మార్పు తీసుకురావాలి అంటే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే చేసి , మార్పును కొనసాగించడం ఈనాడు విధానం . ఆంధ్రభూమిలో అవి ఉండవు గుడ్డెద్దు చేలో పడ్డ వ్యవహారంలా ఉంటుంది .
రాజకీయ నాయకుల పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూలు ఇప్పుడు కామన్ దినపత్రికలో… ఎడిట్ పేజీలో అది మొదలు పెట్టింది కనకాంబరరాజు . 89లో ఇండిపెండెంట్ గా గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు వ్యక్తిగత జీవితం గురించి ఈ పేజీలో 93లో రాశాను . ఎన్టీఆర్ ఇప్పటికీ నా రాజకీయ గురువు అని …. టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారు నీ ఇంటర్వ్యూ వల్ల ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . నీ వల్లే టీడీపీలో చేరాను అని మోత్కుపల్లి చాలా సార్లు చెప్పారు .
జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో తన ప్లాట్ లో కనకాంబరరాజు పెద్ద ఇల్లు కట్టుకున్నారు . గృహ ప్రవేశానికి డిసి ఎండిని కూడా పిలిచారు . నేను వెళ్ళలేదు కానీ వెళ్లిన వారు చెప్పిన మాట ఎండి గృహప్రవేశానికి వచ్చి మా ఇల్లు కంటే మీ ఇల్లే పెద్దగా ఉందని అన్నాడట. ఆ తరువాత చెప్పాపెట్టకుండా కనకాంబరరాజును బయటికి పంపించారు .
యాజమాన్యం సంప్రదాయం చిత్రంగా ఉంటుంది . పత్రిక తమది కాదు ఎడిటర్ ది అన్నట్టుగా పూర్తిగా వదిలేస్తారు . అలా దశాబ్దాలు గడిచిపోతాయి . ఒక రోజు హఠాత్తుగా గేటు బయటి నుంచే పంపించేస్తారు . ఎందుకు విపరీతంగా స్వేచ్ఛ ఇస్తారో , ఎందుకు గేటు బయటి నుంచే పంపిస్తారో ఎవరికీ చెప్పారు .ఎబికె ప్రసాద్ ను రెండు సార్లు , కనకాంబరరాజును , శాస్త్రిని ఇలానే బయటి నుంచి బయటే పంపించారు .
ఇంతకాలం నన్ను ఆదరించిన తెలుగువారికి ఏదో చేయాలి అని సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాను అని ఎన్టీఆర్ 60 ఏళ్ళ వయసులో డైలాగు చెప్పినట్టు …. సమాజానికి ఏదో చేయాలి అని బయటకు వచ్చాను అని చెప్పుకొనే వాళ్ళు చెప్పుకుంటారు కానీ వాస్తవం మాత్రం అవమానకరంగా బయటకు పంపడం డిసి మేనేజ్ మెంట్ పాలసీ . నాయర్ లేనిదే డిసి లేదు అనుకున్నాం అలాంటి నాయర్ ను సైతం ఇలానే పంపారు …
కనకాంబరరాజు హయాంలో వారపత్రికలో , మాసపత్రికలో నేను ఒక్క అక్షరం కూడా రాయలేదు . ఛాన్స్ ఇవ్వమని నేను అడగలేదు , వారు ఇవ్వలేదు . తరువాత టి వెంకట్రామ్ రెడ్డి సంపాదకుడు అనే పేరుతోనే వార , మాస పత్రిక వచ్చింది కానీ , వస్తుందా అని అడిగేట్టుగా వచ్చింది . 90లలో కనకాంబరరాజు హయాంలోనే వారపత్రిక తన వైభవం కోల్పోయింది . టివిలు ఇంటిని ఆక్రమించడం , వారపత్రికలు స్వాతి ఆక్రమించడంతో ఏదో వస్తుంది అంటే వస్తుంది అన్నట్టు మారింది .
95 లో కనకాంబరరాజు శకం భూమిలో ముగిసింది . ఆ తరువాత ఆయన కనీసం రెండేళ్లు కూడా బతకలేదు . తాను పని చేసే పత్రికనే తన జీవితం అనుకోని బతకడం వల్ల బయటకు పంపితే తట్టుకోలేక పోయారేమో అని నాకు అనిపిస్తుంది . ఉద్యోగం పైన , సంస్థ పైన , వ్యక్తుల పైన అతిగా ప్రేమ , అనుబంధం పెంచుకోవడం ప్రమాదం . రాజు తరువాత వారపత్రికలో , మాసపత్రికలో చాలా ఏళ్ళ పాటు రాజకీయ కాలం రాశాను . పెద్దగా ఆసక్తి ఉండేది కాదు .
ఓ సారి ఆంధ్రభూమి ఆఫీస్ లో భూమి యేవో వార్షికోత్సవాలు అని రచయితలతో సమావేశం . వృద్ధ ఆలోచనలతో సాగిన ఆ సమావేశంలో భూమిని పరిగెత్తించిన కనకాంబరరాజు ప్రస్తావనే లేదు . పవిత్రత సంతరించుకుంది అని ఉపన్యాసం . ఎక్కువ సమయం వినలేక వెళ్ళిపోయాను . జ్ఞాపకాలను మిగిల్చి కరోనా ఆంధ్రభూమిని 2020లో మింగేసింది .
ఫోటో కానీ సమాచారం కానీ దొరుకుతుందేమో అని చూస్తే సరిగా కనిపించని ఒక ఫోటో నెట్లో కనిపించింది . ఎంతో మంది స్టార్ రైటర్స్ ను తయారు చేసిన కనకాంబరరాజు గురించి సమాచారం లేకపోవడం బాధాకరం . ఈ మధ్య ఆంధ్రభూమి గురించి ఎవరో ఒక వీడియో చేశారు . శాస్త్రి గురించి, శాస్త్రి చేత , శాస్త్రి పత్రిక ఆంధ్రభూమి అన్నట్టుగా వీడియో ఉంది .
ఇప్పటికీ ఆంధ్రభూమి దినపత్రిక అంటే గోరాశాస్త్రిని (మరణించారు ) గుర్తు చేస్తారు . పత్రికపై ఇది శాస్తి (బతికున్న శాస్త్రి) ముద్ర అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా తామే రాసుకోవడం ద్వారా చరిత్రలో ఇరికిపోతారు .తెలిసింది రాయాలి . జీవితమంతా భయపడుతూనే బతకాలా ? తెలిసింది రాద్దాం , రాయకపోతే ఇదే చరిత్ర అని చరిత్రను ఇష్టమొచ్చినట్టు రాసుకుంటారు . వాస్తవం చెప్పగల స్థితిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం పాపం …
Share this Article