నిజంగానే మంచి ఆలోచన… ఓ బలమైన ప్రతిపక్షం అవతరిస్తే తప్ప అధికారపక్షం నేల మీదకు దిగిరాదు… 450 సీట్లలో బీజేపీకి పోటీగా ఎవరో ఒకరే బీజేపీయేతర అభ్యర్థి ఉండాలి, మిగతా ప్రతిపక్షాలన్నీ ఈ సూత్రానికి మద్దతునిచ్చి, మరో అభ్యర్థిని పోటీగా పెట్టకూడదు… స్థూలంగా చూస్తే సూపర్ ప్లాన్ ఇది… కానీ..?
అప్పట్లో ఇందిరాగాంధీని నేలమీదకు దించిన జనతా ప్రయోగం గుర్తొచ్చింది… ఆ వెంటనే అది చీలికలు పేలికలుగా చినిగిపోయిన తీరూ గుర్తొచ్చింది… పగలబడి నవ్విన ఇందిర నవ్వు ఇప్పటికీ తెరలుతెరలుగా వినిపిస్తూనే ఉంది… పైగా అప్పట్లో ఒకే పార్టీగా ఏకమై కొట్లాడాయి ప్రతిపక్షాలు… కానీ ఇప్పుడేమో ఎవరికివారే పోటీ చేయాలట, మిగతావాళ్లు పోటీలో ఉండరట… గుడ్… కానీ ఏ సీటులో ఎవరికి బలముంది..? ఎవరు పోటీచేయాలి..? అనేది నిర్ధారించాల్సింది ఎవరు..?
సపోజ్ ఎక్స్ అనే సీటు ఉందనుకుందాం… ఆ సీటులో ఎవరికి వారే తమకే ఎక్కువ బలముంది అనుకుంటాయి, చెబుతాయి… ఎవరు పోటీచేయాలో ఎలా తేల్చేది..? పాత ఎన్నికల్లో వచ్చిన వోట్లా ప్రామాణికం..? నిజంగా ఆ వోట్ల ఆధారంగా 450 సీట్లలో ఎవరు ఎక్కడ పోటీచేయాలో నిర్ణయించడం సాధ్యమేనా..?
Ads
ఏపీకి వస్తే… ఇక్కడ వోట్లను బట్టి అసలు ఇక కాంగ్రెస్ పోటీచేయనే కూడదా..? సపోజ్, బీజేపీ-తెలుగుదేశం-జనసేన కలిసి వైసీపీకి పోటీగా నిలబెడతాయి అభ్యర్థులను అనుకుందాం… మరి కాంగ్రెస్ ఏం చేయాలి..? తను బీజేపీ కూటమికి, వైసీపీకి పోటీ అభ్యర్థుల్ని నిలబెడుతుందేమో… మరప్పుడు ముఖాముఖి పోటీ అనేది ఎలా సాధ్యం..?
తెలంగాణ వేరు… కాంగ్రెస్, అనుకూల కూటమిలోని పార్టీలు ఏవీ కేసీయార్‌ను నమ్మవు… దగ్గరకు రానివ్వవు… ఈ 450 పోటాపోటీ సీట్ల చర్చలు జరిగే పాట్నా మీటింగుకు కూడా కేసీయార్‌ను రానివ్వరు… ఇక్కడ బీజేపీ బరిలో ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ కూడా ఉంటుంది… సో, ముఖాముఖి పోటీ… నాన్-మోడీ ఉమ్మడి అభ్యర్థి అనేది సాధ్యం కాదు… కేరళ తీసుకుందాం… ఈ 450 సీట్ల వ్యూహం ఈ రాష్ట్రంలో అసలే సాధ్యం కాదు… అక్కడ పోటీపడేవే లెఫ్ట్- కాంగ్రెస్…
సేమ్, బెంగాల్… బీజేపీకి ప్రతిగా టీఎంసీ బరిలో ఉంటుంది… అసలు కాంగ్రెస్, లెఫ్ట్ లేనేలేవుపో అంటుంది… అప్పుడేం చేయాలి..? మమత ఒక్క సీటును కూడా సీపీఎంకు, కాంగ్రెస్‌కు ఇవ్వదు… అవి కాస్తయినా బలపడటం మమతకు ఇష్టం ఉండదు… మహారాష్ట్రకు వస్తే… ఇప్పుడు కాంగ్రెస్, ఠాక్రే గ్రూపు, శరద్ పవార్ కూటమిగా పోటీచేస్తాయి అనుకుందాం… సీట్ల సర్దుబాటు కూడా పెద్ద కష్టమేమీ కాదు… బీజేపీ, షిండే గ్రూపు కలిసి పోటీచేస్తాయి… ఈ 450 సీట్ల వ్యూహం ఇక్కడ అమలు చేయొచ్చు… కానీ…
కర్నాటకలో పలుచోట్ల బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా జేడీఎస్ ఉంది… బీజేపీపై ముఖాముఖి పోటీకి వీలుగా కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థులు సాధ్యం కాదు… కారణాలు అనేకం… ఒడిశా తీసుకుంటే… బీజేడీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు… కాంగ్రెస్‌ను అసలే గుర్తించదు… మరి బలమైన ప్రతిపక్ష అభ్యర్థి ఎలా సాధ్యం..? బీహార్‌లో నితిశ్ ఎన్నికల సమయానికి ఎవరితో దోస్తీ కటీఫ్ అంటాడో, ఎవరిని అలుముకుంటాడో తెలియదు… ఇక్కడ కాంగ్రెస్ ఏం చేయాలి..? ఆర్జేడీ, నితిశ్ పార్టీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థులు సాధ్యమయ్యేలా లేదు…
రాజస్థాన్‌లో ఆల్‌రెడీ ముదిరిపోయింది… సచిన్ పైలట్ పార్టీ ఎవరితో జతకూడాలి…? కాంగ్రెస్‌తో కలిసి పోటీ అనే సయోధ్య సాధ్యమేనా..? ఉత్తరప్రదేశ్‌లో యుద్ధరంగాన్ని కాంగ్రెస్ పూర్తిగా సమాజ్‌వాదీ పార్టీకి అప్పగించగలదా..? పంజాబ్‌లో ఇతర పక్షాలకు ఆప్ సీట్లు వదిలేస్తుందా..? లేదు…! అకాలీదళ్, కాంగ్రెస్, ఆప్ వాళ్లలో వాళ్లు తన్నుకోవడానికే సరిపోతుంది… ఇక ఉమ్మడి పోటీ ఎక్కడిది..? ఇలా దాదాపు ప్రతిరాష్ట్రంలోనూ ఇలాంటి సమీకరణాలే అడ్డుపడతాయి… ప్రతిచోటా కాంగ్రెస్ రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా, ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తాయి… దీనికి మమత, నితిశ్ తదితరులు అంగీకరిస్తారా..? సో, 450 స్థానాల్లో బీజేపీ మీద ఉమ్మడి అభ్యర్థులు అనేది మాటల వరకూ బాగుంటుంది… పైగా ఒక్క మోడీని ఓడించడానికి ఇంత మంది మందగా మీద పడుతున్నారనే ప్రచారం ఓమేరకు మోడీకే ఉపయోగకరం…!!
Share this Article