బ్లెండర్స్ ప్రైడ్! బ్లండర్స్ హైడ్!!
———————-
వాణిజ్య ప్రకటనల్లో కొన్ని ప్రమాణాలు పాటించడానికి, ఆ ప్రమాణాలు లేకపోతే ప్రకటనలను ఆపడానికి- భారత ప్రకటనల ప్రమాణాల మండలి- ASCI అని ఒక సంస్థ ఉంది. ఇలాంటిదొకటి ఉందని ప్రకటనల రంగంలో ఉన్నవారిలోనే చాలామందికి తెలియదు. వాణిజ్య ప్రకటనల్లో కనీసం కొన్ని విషయాల్లో అయినా హద్దులు దాటకుండా ASCI నియంత్రిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వర్ణ వివక్ష, లింగ వివక్ష, జంతు హింస, దేశ గౌరవం, మతాచారాల విషయాల్లో ASCI సీరియస్ గా ఉంటుంది. చాలా ప్రకటనలు తీసేవారికి అర్థం కాక అలా తీస్తారో? మనకు అర్థం కాకూడదని అలా తీస్తారో? అర్థమైతే ఆ ప్రాడక్టు మనం కొనబోమన్న భయంతో అర్థం కాకుండా చెబుతారో? మనకు అర్థం కాదు. గోరుచుట్టుపై రోకటిపోటులా అసలు ప్రకటనకు అనువాద హింస మనకు అదనపు శిరోభారం.
Ads
వాణిజ్య ప్రకటనల ఉద్దేశమే జనాన్ని తమవైపు తిప్పుకోవడం. టెంప్ట్ చేయడం. నమ్మించడం. కొనిపించడం. ప్రకటనల నిండా సాధారణంగా అతిశయోక్తులే ఉంటాయి. ఎంత సృజనాత్మకంగా అతిశయోక్తులు చెప్తే అంత గొప్పగా యాడ్ తయారుచేసినట్లు ఆ రంగంలో వారు అనుకుంటుంటారు. “We too make steel “ లాంటి టాటా ఉక్కు ప్రకటనలు ఎప్పుడో తప్ప- రోజూ వచ్చే ప్రకటనలు చాలావరకు మనసుకు హత్తుకోవు.
కొన్ని వాణిజ్య ప్రకటనలు లిఖిత ప్రమాణాలను ఎలా ఉల్లంఘిస్తున్నాయో ఈమధ్య ASCI పసిగట్టింది. మద్యం తయారుచేసే కంపెనీలు మద్యం ప్రకటనల కొనసాగింపుగా తాము తయారుచేసే ఇతర ఉత్పత్తులకు అదే లోగో, అదే పేరు, అదే మ్యూజిక్ వాడుతున్నారు. ఇంగ్లీషులో ఈ ప్రక్రియను “Surrogate Advertising” అంటున్నారు. బహుశా తెలుగులో ఈమాటకు సరయిన పారిభాషిక పద సృష్టి జరిగినట్లు లేదు. అసలు ప్రకటనకు తోక ప్రకటన అనుకోవచ్చు.
ఉదాహరణకు- కింగ్ ఫిషర్ కంపెనీ మద్యం ప్రమోషన్ కోసం ఒక వాణిజ్య ప్రకటన తయారు చేసింది అనుకుందాం. అదే కంపెనీ మంచి నీళ్ల బాటిల్ కూడా తయారు చేయడం మొదలు పెట్టింది అనుకుందాం. ఒక ఆధ్యాత్మిక ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారం మధ్యలో కింగ్ ఫిషర్ నీళ్ల బాటిల్ ప్రకటన వస్తుంది. అదే పేరు. అదే లోగో. అదే మ్యూజిక్. చివర అశ్వథామ హతః కుంజరః అన్నట్లు వినీ వినపడకుండా, కనీ కనిపించకుండా “నీళ్లు” అన్నమాట ఉంటుంది. దీనితో ఎక్కడయినా అసలు మద్యం బ్రాండ్ ఏరులై ప్రవహిస్తూ ఉంటుంది.
ఇలా సరొగేట్ యాడ్స్ చేసిన 14 మద్యం కంపెనీలను ASCI రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నోటీసులిచ్చింది. రెండు కంపెనీలు మాత్రం తప్పును ఒప్పుకుని, ఆ ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకున్నాయి. మిగతా 12 కంపెనీలకు ASCI పెనాల్టీలు వేయబోతోంది. అయినా ఆపకపోతే మరింత కఠిన చర్యల గురించి ఆలోచిస్తోంది. బ్లెండర్స్ ప్రైడ్ వాడు మ్యూజిక్ సీడీ లు అమ్ముతున్నాడట. ఆ సిడీల సరొగేట్ ప్రకటన ఎలా ఉంటుందంటే-
బ్లెండర్స్ ప్రైడ్ మద్యమాతి రాగం!
బ్లెండర్స్ సంగీతం సిడి ల గానామృతం!
బ్లెండర్స్ సరిగమల ఉయ్యాలలు!
బ్లెండర్స్ సురజతులు!
బ్లెండర్స్ స్వర సుధారస ఛీర్స్!
బ్లెండర్స్ ప్రైడ్-
బ్లండర్స్ హైడ్!
హై క్వాలిటీ సీడి సంగీత ద్రవం!
ద్రవం ఘనీభవించిన బ్లెండర్స్ సీడి! ఇంతకంటే లోతుగా 12 కంపెనీల అతితెలివి గురించి రాస్తే మద్యమే మతి తప్పి తూలిపడిపోతుంది!…………. By….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article