ఎవరో ఏదో సర్వే చేస్తారు… గుడ్డిగా మీడియా వాళ్లు రాసేస్తారు… కనీసం ఏజెన్సీ కాపీల్లో (న్యూస్ ఏజెన్సీలు అందరికీ పంపే కంటెంట్) ఏముందో, నిజానిజాలు ఏమిటో, తప్పులు ఏమిటో, మనవాళ్లకు ఏది అవసరమో కూడా ఆలోచించకుండా తెలుగు మీడియా గుడ్డిగా జనంలోకి తీసుకెళ్తుంది… దీనికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ ఈరోజు పత్రికల్లో సుగర్ వ్యాధితీవ్రత మీద కథనం…
నిజం… దేశంలో సుగర్, బీపీ, ఒబెసిటీ, హైకొలెస్ట్రాల్ వంటి వ్యాధుల తీవ్రత బాగా పెరుగుతోంది… ఎయిమ్స్, ఐసీఎంఆర్, మద్రాస్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ సంస్థలు ఓ సర్వే నిర్వహించాయి… గుడ్, మంచిదే… కానీ ఇది 12 ఏళ్లుగా సాగుతున్న సర్వే… ఏటేటా లెక్కలు వేగంగా మారిపోతున్న స్థితిలో ఈ పన్నెండేళ్ల సుదీర్ఘ సర్వే శాస్త్రీయత ఎంత అనేదే పెద్ద సందేహం… పోనీ, ఈ పన్నెండేళ్లలో మారిన స్థితి లెక్కతీశారా అంటే అదీ కాదు… సో, ఆ పుష్కరకాలం సర్వే ఆధారంగా ఈ వ్యాధిగ్రస్తుల లెక్క తీయడం కరెక్టు కాదు…
పోనీ, వ్యాధుల తీవ్రతను చెప్పడానికి అవలంబించిన సమీకరణాలు కూడా కరెక్టు కాదు… వాళ్లు సర్వే ప్రారంభించినప్పుడు ఇండియా జనాభా 125 కోట్లు… కానీ ఇప్పుడు 143 కోట్లు… ఇందులో 18 ఏళ్లలోపు జనాభా 48 శాతం, పాతికేళ్లలోపు వాళ్లు 56 శాతం… పాతికేళ్లలోపు బీపీలు, సుగర్ బాగానే కనిపిస్తున్నా సరే, ఆ వయస్సులో హైబీపీలు, సుగర్ల శాతం చాలా తక్కువ… అందుకని వీళ్లను, అంటే 80 కోట్ల మందిని తీసేసి మిగతా 63 కోట్ల మందికి సర్వే ఫలితాల్ని వర్తింపజేస్తే… ఈ వ్యాధుల తీవ్రత ఎంతో సరిగ్గా బోధపడేది…
Ads
10 కోట్ల మందికి సుగర్ అని తేల్చాయి ఈ మూడు వైద్యసంబంధ సంస్థలు… అంటే 63 కోట్లలో 10 కోట్ల మందికి సుగర్ ఉందన్నమాట… అంటే దాదాపు 16 శాతం… ఇదీ మధుమేహం తీవ్రత… అంటే ఆరేడుగురిలో ఒకరికి సుగర్… ఇంకా సుగర్ వచ్చే అవకాశాలున్న ప్రిడయాబెటిక్స్ శాతం 15.3 శాతమట… 63 కోట్ల మందికి వర్తింపజేస్తే 9.6 కోట్ల మంది సుగర్ వాకిట్లో నిలబడి ఉన్నారు… అంటే మొత్తం డయాబెటిక్స్, ప్రిడయాబెటిక్స్ కలిపితే 20 కోట్ల మంది… అంటే మూడింట ఒకరు సుగర్ ప్రమాదంలో ఆల్‌రెడీ ఉన్నారు… ఇదీ అసలైన సుగర్ లెక్క…
కానీ న్యూస్ ఏజెన్సీలు ఏం రాశాయి..? జనాభాలో 11.4 శాతం మందికి సుగర్ అనీ 15.3 శాతం మందికి ప్రిడయాబెటిక్ అని తేల్చారు… మన మీడియా కూడా అదే ఎత్తిరాసింది… కొంచెం వర్క్ చేస్తే బాగుండేది… మన మీడియా డెస్కుల్లో జస్ట్, అలా తెలుగులోకి అనువదించేస్తున్నారు తప్ప ఏజెన్సీ కాపీల్లోని అసంబద్ధతను పట్టించుకోవడం లేదు…
31 కోట్ల మందికి హైబీపీ అని రాసుకొచ్చారు… అంటే పాతికేళ్లు పైబడిన వారు 63 కోట్ల మందికి ఈ శాతాన్ని వర్తింపజేస్తే… ప్రతి ఇద్దరిలో ఒకరికి హైబీపీ ఉందని లెక్క… (పిల్లల్లో కూడా సుగర్ టైప్-1 ఉంటుంది, దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోరు)… మరో సీరియస్ అంశాన్ని కూడా ఈ సర్వే తేల్చింది… 81 శాతం మందిలో ఎల్డీఎల్, హెచ్డీఎల్ ట్రైగ్లిజరైడ్ల శాతాలు సరైన విధంగా లేవట… ఇదీ పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆరోగ్యాంశమే…
మన ఆహార, జీవన శైలిలో మార్పులే ఈ వ్యాధుల తీవ్రతకు కారణం… మొత్తం జనాభాలో జనరల్ ఒబెసిటీ 28.6 శాతమట… అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని ఉన్నవారి సంఖ్య 39.5 శాతం… అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారట… హైబీపీ, సుగర్ ఇలా పెరిగిపోవడానికి ఇదీ ఓ కారణమే కదా…
ఇదే సర్వే తేల్చిన మరో నిఖార్సయిన ఉదాహరణ ఏమిటంటే… గోవాలో 26.4 శాతం మందికి సుగర్ ఉంది… ఫారిన్ ఫుడ్ కల్చర్, ఇతరత్రా జీవన విధానాలే దీనికి కారణం… ప్చ్, సరైన ప్రాతిపదికలతో గనుక ఇలాంటి సర్వే జరిగి ఉంటే ఎంత బాగుండేది… 12 ఏళ్ల సర్వే ఫలితాలను అడ్డదిడ్డంగా, అశాస్త్రీయంగా క్రోడీకరించారు… ఏటేటా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసర్వే చేయిస్తుంది.., నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే…. అది కదా అసలు మనం పరిగణనలోకి తీసుకోవల్సింది… 1.1 లక్షల మందితో నిర్వహించిన ఈ 12 ఏళ్ల సర్వే కొత్తగా తేల్చింది ఏముంది..? ఎందుకీ సర్వే…!!
ష్… ఈ సర్వే వివరాలను ఆ మూడు సంస్థలు ఏమీ బయటపెట్టలేదు… బ్రిటన్‌కు చెందిన ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు… దాన్ని బట్టి మన న్యూస్ ఏజెన్సీలు ఏదో రాసేశాయి… మన మీడియా సంస్థలు కళ్లుమూసుకుని పబ్లిష్ చేసేశాయి…!!
Share this Article