Murali Buddha……… ఎడిటర్ మరణిస్తే …. విధ్వంసకునికి నివాళా ? అని జర్నలిస్ట్ లు బుక్ వేశారు .. మన ఎడిటర్ దేవుడు అని తప్పించుకున్నా … జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
—————————————–
రాజకీయ నాయకుడు , సంపన్నుడు , పారిశ్రామిక వేత్త , రచయితలు మరణిస్తే పెద్ద ఎత్తున నివాళి , అవకాశం ఉన్న వాళ్ళు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాసాలు రాస్తూ ప్రచురించడం కామన్ . ఇలాంటి స్మృతి సాహిత్యం బోలెడు ఉంది మనకు . కానీ ఒక పత్రిక ఎడిటర్ మరణిస్తే అతను పెట్టిన బాధల వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయ్యాయో , ఎంత మంది జీవితాలు రోడ్డున పడ్డాయో వ్యాసాలు రాసి , పుస్తకం ప్రచురించడం గురించి విన్నారా ?
Ads
ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభలో సర్వాధికారాలు చెలాయించిన సుందరం దయనీయమైన స్థితిలో మరణించిన తరువాత నలుగురు పాత్రికేయులు సుందరం , దీక్షితులు జర్నలిస్ట్ ల జీవితాలతో ఎలా ఆడుకున్నారో వ్యాసాలు రాసి పాత్రికేయ విలువల విధ్వంసకులకు నివాళులా ? అని పుస్తకం ప్రచురించారు . నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి మరణించాక అతని అకృత్యాల గురించి రాసి పుస్తకంగా ప్రచురించడం అదే మొదటి సారి. ఇప్పటివరకు అదే చివరి సారి . సుందరంతో పాటు దీక్షితులు గురించి రాశారు . ఒక వ్యక్తి మరణిస్తే అతను ఎలాంటి వాడైనా ఇంద్రుడు చంద్రుడు , శిబి చక్రవర్తి , దానకర్ణుడు అని రాయాల్సిందేనా ? అదే మన సంస్కృతా ? నిజం చెప్పడం పాపమా ? నిజం ఎక్కడో ఒక చోట రికార్డ్ కావాలి .
2010 ఓ రోజు ఉదయమే జనాంతికం వ్యాసం రాయడానికి ఆంధ్రభూమి కార్యాలయానికి ఉదయమే వెళ్ళాను . వ్యాసం పూర్తి చేసి రిపోర్టర్ గా రొటీన్ డ్యూటీకి వెళ్ళాలి . సాధారణంగా ఆ టైంలో ఆఫీస్ లో ఎవరూ ఉండరు . లోపలి వెళ్ళగానే మూర్తి అని సండే ఇంచార్జ్ పిలిచి సుందరం మీద జర్నలిస్ట్ నామాల విశ్వేశ్వరరావు వేసిన బుక్ చూపించి , ఈ బుక్ లో ఉన్న సుందరం పేరు తీసేసి మన ఎడిటర్ శాస్త్రి పేరు పెడితే జర్నలిస్ట్ లను వేధించే విషయం సేమ్ కదండీ అన్నారు .
కాదండి, మన ఎడిటర్ దేవుడు అని బదులిచ్చాను . మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు ( ఆఫీస్ లో సిసి కెమెరాలు ఉంటాయి ) బయట మాట్లాడుదాం అని బయటకు దారి తీస్తుంటే .. నేను బయట కూడా మీతో ఇలానే మాట్లాడతాను . మన ఎడిటర్ దేవుడు .. మరో మాటే లేదు అన్నాను . ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ఇంకొకరిని ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తారు . అంటే అందరూ నన్ను ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తారు . అందరినీ నేను ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తాను . నిజానికి ఇది ఈనాడు సంప్రదాయం అని ఈ మధ్యనే చదివాను .
మాజీ ఈనాడు ఉద్యోగి ఒకరు ఈనాడులో ఇన్ఫార్మర్స్ వ్యవస్థ గురించి రాశారు . టీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు కూడా మేనేజ్మెంట్ కు తెలిసి పోతాయి . తల్లి తన పిల్లలు ఒకరి మీద ఒకరిని నిఘా పెట్టినట్టు ఈనాడులో నిఘా ఉంటుంది అని ఎవరో రాశారు . ఈనాడు నుంచి వచ్చిన శాస్త్రి ఇదే విధానాన్ని ఆంధ్రభూమిలో అమలు చేశారు . ప్రతి ఒక్కరిని ఇన్ఫార్మర్స్ గా మార్చుకున్నారు . సోవియట్ రష్యాలో ప్రతి ఒక్కరిపై ఇంకొకరి నిఘా ఉంటుంది అనుకునే వాళ్ళం . అలా అన్నమాట .
కొత్తలో ఓసారి ఏం జరుగుతుందో చెప్పాలి , నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా ? అన్నారు . ఎవరేం మాట్లాడుకుంటున్నారో నన్ను అడిగినప్పుడు , నేనేం మాట్లాడుతున్నానో ఇతరులను అడుగుతారు కదా ? నాకు ఆ మాత్రం తెలియదా? అని బదులిచ్చాను . బయట టీ తాగేప్పుడు ఏదో జోకులేసుకుంటాం అంతకు మించి ఏం మాట్లాడుతాం . అన్నింటికన్నా నా ఉద్యోగం నాకు ముఖ్యం, ఏమీ మాట్లాడుకోము అని చెప్పాను ..
ఆఫీస్ లో అందరూ ఇన్ఫార్మర్ లే అయినా రోజూ ఎడిటర్ తో మాట్లాడేవారిని ఇంకాస్త ఎక్కువ ఇన్ఫార్మర్స్ గా ఇతరులు చూస్తారు . ఆఫీస్ లోని వారినే కాదు ఇతర పత్రికల వారిని సైతం అలానే చూసే పరిస్థితి. ఓసారి వార్త దినపత్రికలో ఎడిటర్ టంకశాల అశోక్ ను ఏదో రివ్యూ కోసం బుక్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, మీ ఎడిటర్ అమానవీయంగా వ్యవహరిస్తారట కదా ? అని అడిగితే , సిబ్బందితో పని చేయించాలి అంటే ఆ మాత్రం తప్పదు అన్నాను . దేవులపల్లి అమర్ కూడా ఓసారి ఏదో అడిగితే… లేదండి, మా ఎడిటర్ చాలా గొప్పవాడు అన్నాను . అభిప్రాయం కన్నా ఉద్యోగం ముఖ్యం .
భూమిలో అందరూ ఇన్ఫార్మర్లే అయినా మూర్తికి కాస్త ఎక్కువ ఇన్ఫార్మర్ అనే గుర్తింపు . అతను ఏం మాట్లాడినా నేను మన ఎడిటర్ దేవుడండీ అనే మాట నుంచి దిగడం లేదు . హఠాత్తుగా అతనికో అనుమానం వచ్చింది . ఔను, ఈ బుక్ రాసిన అతను ఇంతకు ముందే నా చేతికి ఇచ్చి వెళ్ళాడు . మీరు ఇప్పుడే ఆఫీస్ కు వస్తున్నారు . ఇందులో ఏముందో మీకెలా తెలుసు అని అడిగాడు . దొరికిపోయానా ? అనుకుని తేరుకొని .. ఇప్పుడే ఆఫీస్ కు వస్తుంటే గేటు దగ్గర కలిశాడు అతని వద్ద చూశాను అని తప్పించుకున్నాను . నిజానికి ఆ బుక్ ప్రచురిస్తున్నామని చెబితే వద్దు అని నేనే చాలాసేపు నచ్చజెప్పాను . ఆ బుక్ వేయాల్సిందే అని వారు నిర్ణయించుకోవడానికి కారణం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం .
సుందరం మరణించాక ఆంధ్రజ్యోతిలో జగన్ వ్యాసం రాశారు . అక్షర బద్ధుడు సుందరం అని నివాళి వ్యాసం . ఆ వ్యాసంలో సుందరం గురించి తక్కువగా , జగన్ తన గురించి ఎక్కువగా రాసుకున్నారు అనేది ఓ విమర్శ . ఆంధ్రప్రభలో సుందరం వేధింపుల వల్ల జర్నలిస్టులు మరణించారు , అనారోగ్యం పాలయ్యారు , మాట్లాడితే దేశంలో ఏదో ఒక రాష్ట్రానికి బదిలీ చేసి వేధించేవారు . అలాంటి వ్యక్తి గురించి ప్రభలో ఎవరిని అడిగినా అతని పైరవీలు , వేధింపులు చెబుతారు, మీరు ఇలా రాయడం ఏమిటీ అని కొంతమంది జర్నలిస్ట్ లు , సుందరం బాధితులు ఆంధ్రజ్యోతికి వెళ్లి మేం రాసిన వ్యాసం కూడా వేసుకోవాలి అని ఎడిటర్ శ్రీనివాస్ ను నిలదీశారు .
ఆ నివాళి వ్యాసం రాయడమే ఎక్కువయింది , దానికి మళ్ళీ ఖండన వ్యాసమా ? వేయంపో అని పంపించారు . దాంతో కొంతమంది కలిసి బుక్ వేయాలి అని నిర్ణయించుకున్నారు . నాకు నామాల చెబితే వద్దు అన్నాను . పత్రికల మధ్య , ఎడిటర్స్ మధ్య ఇగోలు ఉంటాయి. పోటీ ఉంటుంది . కానీ మనుషులను వేధించడంలో ఐక్యత ఉంటుంది . బుక్ వేస్తే నీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తారు . ఇబ్బంది అవుతుంది వద్దు అని చాలా సేపు చెప్పాను . ఐనా జర్నలిస్ట్ ఎలా ఉండకూడదంటే ( కెవి కూర్మనాథ్ ) పాత్రికేయ తక్షకులకు సానుభూతా ? (దామోదర్ ప్రసాద్ పతకమూరు ) అక్షర భక్షకుడికి బానిస నివాళి ( నామాల విశ్వేశ్వర రావు ) నామ మాత్రం సుందరం ( నరేష్ నున్నా ) . వ్యాసాలతో బుక్ వచ్చింది …
చిత్రమేమంటే ఈ బుక్ అన్ని పత్రికల కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎడిటర్ పేరు మారిస్తే అన్ని పత్రికల్లో ఇంతే కదా ? ఎవడైతే నేం ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు అని శ్రీ శ్రీ కవిత్వం ప్రతి చోట వినిపించింది . కొన్నిచోట్ల మేనేజ్ మెంట్ , కొన్నిచోట్ల ఎడిటర్ , కొన్నిచోట్ల మేనేజర్ కావచ్చు కానీ అన్నిచోట్లా ఒకటే కథ . చాలామంది బాధితులు నామాలకు ఫోన్ చేసి బుక్ వేసేప్పుడు మాతో మాట్లాడితే మా బాధ రాసే వాళ్ళం , బుక్ ప్రచురణకు మా వాటా డబ్బులు ఇచ్చేవాళ్ళం అని నిష్టురమాడారు …
రిటైర్ అయ్యాక ఏమైనా రాయవచ్చు, అది వేరు . కానీ ఉద్యోగం చేస్తూ ఆ నలుగురు తమ బాధలు రాయడం మాములు విషయం కాదు . ఇంత ఇబ్బంది పడుతూ ఉద్యోగం చేయడం ఎందుకు బయటకు వెళ్ళవచ్చు కదా అనే ప్రశ్న కొందరి నుంచి రావచ్చు . అప్పుడు ఉన్నవే నాలుగు పేపర్లు . ఈనాడు అక్కడే కొత్తవారిని తీసుకోని ట్రైనింగ్ ఇస్తుంది . మిగిలిన మూడింటిలో ప్రభ , భూమిలో మాత్రమే మంచి జీతం . ఒకచోట ఉద్యోగం పోతే మరో చోట ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదు . జర్నలిజంలో చాలా ఏళ్ళు ఉన్న తరువాత అది తప్ప ఇంకో పని రాదు .
లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వెళుతుంటే మూలమలుపులో విశాలమైన ఖాళీ స్థలం కనిపిస్తుంది . వందల కోట్ల రూపాయల విలువైన స్థలం . అది ఆంధ్రప్రభ ఆధీనంలో ఉంది . విన్నంతవరకు ఆ స్థలానికి సంబంధించి సరైన డ్యాకుమెంట్లు లేవు . ఎన్టీఆర్ ను దించేసిన సమయంలో మనం బాబుకు అండగా నిలుద్దాం ల్యాండ్ సమస్య పరిష్కరించుకోవచ్చు అని సుందరం యాజమాన్యాన్ని ఒప్పించారు . సుదీర్ఘ కాలం బాబు సీఎంగా ఉన్నా ఇప్పటికీ ల్యాండ్ సమస్య పరిష్కారం కాలేదు . అలానే పాడుబడినట్టు ఉంది . ల్యాండ్ సమస్య పరిష్కారానికి తరుచుగా యజమాని కుమారుడు ఆఫీస్ కు వచ్చి సుందరం ముందు కూర్చునే వారట … సాధారణంగా యజమాని వద్దకు ఎడిటర్ వెళతారు కానీ పని పెద్దది .. ఆంధ్రప్రభను అక్కడ పనిచేసేవారే చంద్రప్రభ అని ముద్దుగా పిలుచుకునేవారు . ల్యాండ్ సమస్య పేరుతో సుందరం ఆంధ్రప్రభను చంద్రప్రభగా మార్చి తాను ప్రయోజనం పొందారు కానీ యాజమాన్యం పేపర్ అమ్ముకొని … ల్యాండ్ సమస్య పరిష్కారం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది .
మిత్రుడు నామాలకు ఫోన్ చేసి మీరు అప్పుడు పబ్లిష్ చేసిన బుక్ కావాలి .. అప్పుడు వద్దని చెప్పినా బుక్ ఎందుకు వేశారు అని అడిగాను . నాకు ఉద్యోగం అవసరమే కానీ రోడ్డున పడితే సహాయం చేసేందుకు మా అన్నలు ఉన్నారు . వాళ్ళు ఒక్కొక్కరు కోటీశ్వరులు .. మీ పరిస్థితి అంతే, మీకు ఉద్యోగం బతుకుదెరువు. ఒకవేళ ఉద్యోగం పోయినా హైదరాబాద్ లోనే వ్యాపారం చేసే మీ అన్నలు ఆదుకుంటారు . కానీ ఒక రోజు ఆఫీస్ లో ఓ పేద బ్రాహ్మణుడు బాధతో చెప్పిన మాటతో బుక్ వేయాలి అనుకున్నాను అన్నాడు . ఇంట్లో పిల్లకు పాలపొడి తెమ్మన్నారు , డబ్బు లేదు , లీవు అడగలేను , మాట్లాడితే ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తారు . ఇదేం జీవితం అని సుందరం వేధింపులు చెప్పి బాధపడ్డాడు . ఏమైనా జరగనివ్వు, బుక్ వేయాలని అనుకున్నాను, వేశాను అని చెప్పాడు …
చివరి రోజుల్లో సుందరం దయనీయమైన స్థితిలో మరణించారు . ఆరోగ్య సమస్యలు . చేతితో ఆహరం కూడా తినలేని స్థితి . దోశ ముక్క నోట్లో పెట్టుకున్నా గొంతు దాటి పోని స్థితి అని చూసిన వారి మాట . దేవుడు ఉన్నాడా ? కర్మ ఫలం ఈ జీవితంలోనే అనుభవిస్తామా ? ఏమో తెలియదు కానీ . ఉంటే బాగుండు … ఈ జన్మలో చేసిన దాని ఫలితం ఇక్కడే అనుభవిస్తామనే నమ్మకం ఉంటే మనిషి మనిషిలా వ్యవహరిస్తాడు . సాటి మనుషులను మనుషుల్లా చూస్తాడు . ఎడిటర్ కానివ్వండి ఓనర్ కానివ్వండి .
ఇదంతా ఎందుకు చెబుతున్నావు అనడిగితే… ఏమీ లేదు . దేశాన్ని ఉద్ధరిద్దామని జర్నలిజంలోకి రావాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడి పరిస్థితులు ఓసారి తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారని .. ఒకసారి ఊబిలో కూరుకుపోతే బయటపడలేరు . దేశాన్ని మార్చే మాట దేవుడెరుగు, బయట దేవుడిగా పూజలు అందుకునే రాక్షసులను తట్టుకొని బతకడం అంత ఈజీ కాదు …
Share this Article