Murali Buddha……….. 20 ఏళ్లయినా జాడ లేని బడుగు ‘సీత’… మీడియా రాజకీయాలకు అతి తెలివితో బలి … జర్నలిస్ట్ జ్ఞాపకాలు
————————-
ఒకటి కాదు రెండు కాదు .. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఓ బడుగు‘ సీత ‘ జాడ తెలియడం లేదు . ఎక్కడున్నారో , ఏమయ్యారో ? ఎక్కడ అజ్ఞాత జీవితం గడుపుతున్నారో ? నా జర్నలిస్ట్ జీవితంలో ఇదో ఆసక్తికర సంఘటన కావడంతో గుర్తుకు వచ్చింది . నా జీవితంలోనే కాకుండా ఆంధ్రభూమి సంస్థ లోనూ ఓ ఆసక్తికరమైన అనేక మలుపులు తిరిగిన సినిమా కథలాంటి కథ . బాస్ ల రాజకీయాలకు బలైన ఓ అమాయక , బడుగు సీత ఉదంతమిది
Ads
సంగారెడ్డిలో 87 లో పని చేసేప్పుడు సీతా మాణిక్యం అనే కుర్రాడు పరిచయం. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు . ఆ తరువాత నేను అనేక జిల్లాలు తిరిగి హైదరాబాద్ వచ్చాక వీరి విషయం మరిచిపోయాను . ఓ రోజు సీతా మాణిక్యం ఆంధ్రభూమి ఆఫీస్ కు వచ్చి సినిమా రంగంపై ఓ బుక్ రాసినట్టు చెప్పాడు . అటెండర్ గా పని చేసే తండ్రి రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో సినిమా రంగంపై బుక్ ..
ఆ బుక్ లో ఏముందో ఊహించగలరా ? అప్పడు సినిమా రంగంలో వెలిగిపోతున్న దర్శకేంద్రులు , దర్శక రత్నలు దాసరి నారాయణరావు , రాఘవేంద్రరావు లాంటి ఇంకా చాలా మంది హేమాహేమీలు సినిమాల్లో ఏం తప్పు చేస్తున్నారు , సినిమా ఎలా తీయాలో వారికి సూచనలు చేస్తూ పుస్తకం రాశాడు . కొడుకు సినిమా రంగాన్ని ఏలేస్తాడు అనుకున్నాడో ఏమో కానీ రిటైర్ మెంట్ డబ్బులు ఇస్తే బుక్ వేశారు . అమాయకత్వం అంతటితో ముగియలేదు.
ఆ పుస్తకాన్ని తీసుకోని రాఘవేంద్రరావు , దాసరితో పాటు అప్పటి దర్శకులు అందరినీ కలిసి ఈ బుక్ చదివి సినిమా ఎలా తీయాలో తెలుసుకోండి అన్నట్టు ఇచ్చి వచ్చాడు . ఆ సమయంలో ఆ దర్శకుల ముఖ కవళికలు ఉహించుకోవాల్సిందే … సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీతా మాణిక్యం ఈ పుస్తకం ద్వారా ప్రముఖ దర్శకుల దృష్టిలో పడతాను అనుకున్నాడు . వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తుంటే ఎంతకూ పిలుపు రాలేదు . అటునుంచి నరుక్కు వద్దాం అనుకొని ప్లాన్ మార్చాడు
చాలా మంది సినిమా జర్నలిజం ద్వారా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తారు . చాలా మంది విజయం సాధించారు కూడా . అదే మార్గంలో వెళ్ళాలి అని ఆంధ్రభూమిలో పార్ట టైం విలేకరి ( స్ట్రింగర్ ) గా చేరాడు . మెల్లగా సినిమాపై ఆసక్తి ఉందని ఎడిటర్ కు చెబితే వోకే అని పంపారు .
ఓ రోజు ఏదో రహస్యం అన్నట్టు ఆఫీస్ దగ్గర ఉన్న ఇరానీ హోటల్ కు తీసుకువెళ్లి , రహస్యంగా దాచిన పేపర్లు చేతిలో పెట్టారు . అంతా చదివి నేను ఆశ్చర్యంతో చూస్తాను అనుకున్నాడు . ఆ పేపర్లు చదివి అతని చేతిలో పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు ఎడిటర్ ఇష్టపడరు . మడిచి ఇంట్లో పెట్టుకో అన్నాను . సినిమా జర్నలిస్ట్ లు అందరూ కవర్లు తీసుకోని సినిమా వార్తలు రాస్తారు అనేది ప్రధాన అంశం . పోనీ ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాడా ? అంటే అది కాదు , మీరే డబ్బులు తీసుకుంటారా ? నాలాంటి కొత్త వారికి ఇప్పించరా ? అని అడుగుతున్నట్టుగా ఉంది . నీ బాధ నీకు డబ్బులు ఇవ్వకపోవడం అయితే అదే అడుక్కో, ఇంత పెద్ద వ్యాసం ఎందుకు అని చెప్పాను ..
నేను ఊహించని విధంగా మరుసటివారం ఆంధ్రభూమి సినిమా సంచిక వెన్నెలలో పెద్దగా వచ్చింది . రివ్యూలు నిష్పక్షపాతంగా రాస్తారని భూమి సినిమా స్పెషల్ వెన్నెలకు సినిమా రంగంలో మంచి పేరుంది . సినిమా జర్నలిస్ట్ లు , సినిమా వాళ్ళు చూపే వివక్ష , కవర్ల సంస్కృతిపై మాణిక్యం వ్యాసం సంచలనం సృష్టించింది . సినీ రిపోర్టర్ల కుటుంబం సమావేశమై మాణిక్యంను బహిష్కరించాలని నిర్ణయించారు . బయటి నుంచి బయటికే పంపించారు .
అతను ఎడిటర్ కు చెప్పడంతో ఎడిటర్ శాస్త్రి ఫోన్ చేసి మన సినిమా రిపోర్టర్ ను బహిష్కరించారు . వెళ్లి సినిమా వాళ్లందరితో మాట్లాడి ఓ స్టోరీ రాయి అని ఆదేశం … రాజకీయ నాయకులంటే ఆడుకోవచ్చు కానీ మనుష రూపంలో ఉన్న దేవతలం అనుకునే సినిమా వాళ్ళ దగ్గరకు పోవడమా ? తప్పదు అని మిత్రుడు చక్రధర్ కు ఫోన్ చేస్తే వస్తా అంటే, కలిసి ఇద్దరం వెళ్ళాం . హీరో వెంకటేష్ ను కలిసి విషయం చెబితే .. మీకు తెలుసు కదా వివాదాల్లో నేను జోక్యం చేసుకోను అన్నారు . నాకేం తెలుసండి .. మిమ్ములను మొదటిసారి కలుస్తున్నాను అన్నాను . అక్కినేని నాగేశ్వరరావు సుదీర్ఘంగా మాట్లాడారు . స్టూడియో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కడతారు . ఇది అందరి సొత్తు అందరూ రావచ్చు . … బహిష్కరించడం తప్పు ఇలా సాగింది ఆక్కినేని ఉపన్యాసం . అందుబాటులో ఉన్న వారితో మాట్లాడి పెద్ద స్టోరీ రాసి ఎడిటర్ కు ఇచ్చాను . పార్టీ కార్యాలయాల్లో ఎంత పెద్ద నాయకుడైనా జోకులేస్తూ మాట్లాడే రిపోర్టర్ కు బంజారాహిల్స్ లో నటుల అడ్రెస్ లు వెతుక్కొని, నటులను పట్టుకొని మాట్లాడడం చాలా కష్టమే .
సాయంత్రం ఏం జరిగిందో , ఎవరు రాయబారం నడిపారో తెలియదు . నేను రాసిన వార్తను పక్కన పెట్టి ఎడిటర్ తేలిగ్గా వద్దులే అన్నారు . వద్దులే అన్నవాడు నన్ను అంత ఇబ్బంది పెట్టి ఉదయం అంత ఆవేశంగా మాట్లాడడం ఎందుకు అనిపించింది . ఎడిటర్ ఆవేశానికి తగ్గట్టు రోడ్డున పడి తిరిగాను . ఇలా ఎందుకు జరుగుతుంది అనేది , వయసు , అనుభవం పెరిగాక అర్థం అవుతుంది . సాధారణంగా ఇలాంటి తెలివి తేటలు గల్లీ లీడర్లు చూపిస్తారు . ఇద్దరి మధ్య పంచాయితీ పెట్టి పెద్ద మనిషిలా వాటిని పరిష్కరిస్తారు .
తనతో వార్త రాయించి , తనను బహిష్కరించిన తరువాత తనను అటు సినిమా వాళ్ళు , ఇటు భూమి పట్టించుకోక పోవడంతో సీతా మాణిక్యం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం . అదీ సినిమా ఫక్కీలోనే … ఆంధ్రభూమి ఆఫీస్ గేటుకు అనుకొనే కార్పొరేట్ ఆస్పత్రి ఉంటుంది . ఆంధ్రభూమి గేటు వద్ద పడిపోతే కాళ్ళు కార్పొరేట్ ఆస్పత్రి వద్ద ఉంటాయి . నిద్రమాత్రలు మింగి పడిపోగానే అంతా పరుగెత్తి ఆస్పత్రిలో చేర్పించాం .
సాయంత్రం గుడిపూడి శ్రీ హరి రాయబారానికి వచ్చారు . మీరూ , ఎడిటర్ , సినిమా వాళ్ళు అంతా బాగానే ఉంటారు . పాపం ఆ పిచ్చోడే అని ఏదో అంటే ఆయన అంతా సర్దుబాటు చేస్తాను అన్నారు . తరువాత పోలీసులు వస్తే జరిగింది పూసగుచ్చినట్టు వివరించా .. తరువాత నాకు చుట్టుకుంటుంది అని తెలియక .. తెలిస్తే ఎడిటర్ ను కలవండి, వారికి అంతా తెలుసు అనేవాడిని . అప్పుడు ప్రముఖ సినిమా జర్నలిస్ట్ లు అంతా ఈ కేసులో కోర్ట్ చుట్టూ తిరిగారు . తన ఆత్మహత్యకు ఎవరెవరు కారణమో మాణిక్యం ఓ లేఖ రాసిపెట్టడంతో అందులో పేర్లు ఉన్న సినిమా రిపోర్టర్లు అందరూ కోర్ట్ చుట్టూ తిరగాల్సి వచ్చింది . సీతా మాణిక్యం ఒక రకంగా సినిమా రిపోర్టర్లకు సినిమా చూపించాడు .
పనికిరాని వ్యాసం వేయడం ఎడిటర్ తప్పు . ఎడిటర్ అంటే దేవుడు . దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయవచ్చు అనుకోని ఆవేశంతో ఊగిపోవడం రిపోర్టర్ తప్పు .. రాయించేప్పుడు భరోసా ఇచ్చి , సమస్య వచ్చినప్పుడు తన్ని పంపిస్తారు అనేది రిపోర్టర్ కు సగం జీవితం సంకనాకిపోయాక తెలుస్తుంది .
తరువాత మాణిక్యం ఏమయ్యాడో అంతా మరిచిపోయాక ఆఫీస్ లో చిన్నపాటి కలకలం . ఎడిటర్ గ్రంథసాంగుడు , కళాకారుడు అంటూ పెద్ద కరపత్రం అన్ని పత్రికా కార్యాలయాల్లో హాట్ టాపిక్ గా మారింది . చివరకు దీన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎడిటర్ ప్లాన్ . అసమర్ధతతో రైలు ప్రమాదం జరిగితే, ఇది దేశ ద్రోహుల కుట్ర, నాకే ఓటు వేయండి అని ప్రచారం చేసినట్టు . నక్సల్స్ కింద బాంబు పెడితే ముందస్తుకు వెళ్లి నాకే ఓటు వేయమన్నట్టు .. తన కళారూపాలపై వచ్చిన కరపత్రాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు .
చూడ్డమే కాదు కరపత్రాన్ని అడ్డుపెట్టుకొని ఆఫీస్ లో భయానక వాతావరణాన్ని సృష్టించి, అందరూ తన గుప్పిట్లో ఉండేట్టు చేసుకున్నారు . ఆఫీస్ లో ఎవరికి ఎవరు పడక పోతే కరపత్రం వాడే వేసి ఉంటాడు అని అనుమానం . చివరకు బయటి నుంచి రాసే పాత్రికేయ అనే సినిమా ఫ్రీ లాన్సర్ , అప్పుడు రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న సుగం బాబు అనే సబ్ ఎడిటర్ ను పట్టుకొని కరపత్రం నువ్వే వేశావు కదా ? అని బెదిరింపు … అతను వణికిపోయాడు . భూమిలో యూనియన్ చాలా స్ట్రాంగ్ . పాత్రికేయను పట్టుకొని ఏరా మా స్టాఫ్ ను బెదిరించేంత మొనగాడివా ? ఇంకోసారి ఆఫీస్ కాంపౌండ్ లో కనిపించవద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపారు .
యూనియన్ అనేది లేకపోతే పర్మనెంట్ ఉద్యోగి అనే వాడిని ఒక్కడిని ఉంచకుండా పంపించి … భయంతో వణికిపోయేవాళ్లను.. తన కనుసన్నల్లో ఉండే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఎడిటర్ ఆఫీస్ నింపేసేవారు .. కరపత్రం ఎడిటర్ మీద వస్తే ఎడిటర్ సంతోషంగానే ఉన్నారు కానీ ఆఫీసులో ఒక్కొక్కరు వణికిపోతున్నారు . తప్పు చేయనప్పుడు వణికిపోవడం ఎందుకు? అని డైలాగులు చెప్పవచ్చు . ఆ రోజుల్లో పత్రికల్లో ఉద్యోగం అంటే అంతే .. ముళ్ళు వచ్చి ఆకుమీద పడ్డా? ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా .. ఉండేది కాంట్రాక్ట్ ఉద్యోగి ఉద్యోగం .. పర్మనెంట్ ఉద్యోగి అయితే బదిలీ .
సీతా మాణిక్యం తప్ప ఇంకెవరికీ మీ మీద కరపత్రం వేయాల్సిన అవసరం లేదు . అతనే అని శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పాను . రాత్రి 11. 40 వరకు అత్యవసర సమావేశాలు . నేను చేసిన శాస్త్రీయ విశ్లేషణకు తల ఊపినట్టు అనిపించింది . హమ్మయ్య అనుకున్నాను . అందరినీ రక్షించాను అని నన్ను నేను మనసులోనే అభినందించుకొని .. ఇంటికి వెళ్ళాను . సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ మా ఇంటికి వెళ్ళడానికి దాదాపు పదిహేను నిమిషాల సమయం పడుతుంది . బైక్ పార్కు చేసి ఇంట్లో అడుగుపెడుతున్నాను .
ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అయింది . అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేశారా ? అని చూస్తే ఫోన్ ఎత్తగానే ఎడిటర్ … ఆ కరపత్రాలు పంచడం అయిపోయిందా ? అని అడిగాడు . అలా అడిగితే ఉద్యోగికి గుండె ఆగినంత పని అవుతుంది . సైకాలజిపై అభిమానం , అయన తీరు గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం వల్ల .. భయపడకుండా .. కరపత్రాలు పంచడం కాదు .. మురళి ఆ కరపత్రం చదువుతుండగా నేను చూశాను అని ఎవరైనా చెప్పినా ఆధారాలు అవసరం లేదు .. రాజీనామా చేస్తాను అన్నాను .
ఇది పొలీసు కానిస్టేబుల్ తరహా విచారణ . ఒక వేళ నిజంగానే కరపత్రాలు పంచితే భయపడి పోయి, చూశాడేమో అనుకోని నిజం చెబుతారు . చదివాను అంటే రాజీనామా చేస్తాను అనేసరికి … ఒక్కసారిగా తగ్గిపోయి అదేంటీ నువ్వు చదవలేదా అని అడిగారు . చదవలేదు . చదవను అన్నాను . అందులో నీ గురించి కూడా ఉంది . చదవకపోవడం ఏమిటీ అంటే , నేనెంటో నాకు తెలుసు , వాడెవడో కరపత్రంలో చెప్పాలా ? అందుకే చదవలేదు అన్నాను . అంతకు ముందే ఆంధ్రప్రభ మిత్రుడు చెన్నూరు గణేష్ కరపత్రం పంపుతాను అంటే వద్దు అన్నాను . నువ్వు మొదట్లో మంచివాడివి అని , ఇప్పుడు ఎడిటర్ కు చెంచాగా మారావు అని కరపత్రంలో రాశాడు అని మిత్రుడు చెబితే మేనేజ్ మెంటే ఎడిటర్ కు చెంచాగా మారిపోయింది .. ఉద్యోగులు ఒక లెక్కనా అని జోకేసి . కరపత్రం చదివే ఆసక్తి లేదు అని చెప్పాను .
అంతా మరిచిపోయాక ఓ రోజు నాకు కోర్ట్ నుంచి వారెంట్ … సీతా మాణిక్యం కేసులో సాక్షిగా హాజరు కమ్మని . ఎడిటర్ ను కలిసి వారెంట్ చూపితే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు .. నిజానికి నేను ఇదంతా రాసింది. జర్నలిజంలోకి కొత్తగా వచ్చే వారికి ఈ విషయం చెప్పడానికే . ఎడిటర్, మేనేజ్ మెంట్ అంటే కనిపించే దైవం అన్నంత భ్రమలు ఉంటాయి మనకు కొత్తలో … ఎడిటర్, మేనేజ్ మెంట్ చెప్పాక , పోలీస్ స్టేషన్ , కోర్ట్ , చట్టాలు అన్నీ పిపీలికల్లా కనిపిస్తాయి .
ఎడిటర్ మాట విని వెళ్లక పోతే అరెస్ట్ వారంట్ వస్తుంది . అప్పుడు ఇదే ఎడిటర్ ఉద్యోగం నుంచి తీసేయమని రికమండ్ చేస్తారు . దీన్ని గ్రహించి నిర్ణయం తీసుకోవాలి. న్యాయవాది అయిన ఫ్రెండ్ ను అడిగితే వెళ్ళాలి …. భయపడకు అని … సినీ దర్శకుడు జంధ్యాల ఓ కేసులో కోర్ట్ కు వస్తే చమటలు పట్టాయి, వణికిపోయారు అని న్యాయవాద మిత్రులు చెప్పారు . నువ్వు యల్ యల్ బి అయ్యాక కోర్ట్ చూసి ఉంటావ్ .. నేను టెన్త్ లోనే చూశాను . టెన్త్ హాలిడేస్ లో పోతుకూచి సాంబశివరావు అని న్యాయవాది వద్ద జాబ్ చేసేవాడిని . అప్పటి వరకు కోర్ట్ అంటే జస్టిస్ చౌదరి సినిమా తరహాలో వాదించుకుంటారు అనుకున్నా . ఎలా ఉంటుందో తెలుసు అన్నాను . ఎడిటర్ కు చెప్పకుండా కోర్ట్ విచారణకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా …
సినిమా షూటింగ్స్ లో దర్జాగా కనిపించే సినిమా జర్నలిస్ట్ లంతా కోర్ట్ లో కనిపించారు . వాయిదా పడ్డ ప్రతిసారి ఇలా వస్తున్నాం అన్నారు . బాధితుడు సీతా మాణిక్యం తప్ప అంతా ఉన్నారు . బోనులో నిల్చున్నాక జడ్జి సీతా మాణిక్యం ఏడీ అని అడిగారు . నాకేం తెలుసు … ఔను సీతా మాణిక్యం ఏడీ అని నేనూ అడిగాను . సరే మీరు వెళ్ళండి అని పంపించారు . తరువాత నన్ను ఎప్పుడూ పిలవలేదు . కేసు ఏమైందో పట్టించుకోలేదు . ఐతే దాదాపు రెండు దశాబ్దాల నుంచి సీతా మాణిక్యం కోసం చూస్తూనే ఉన్నా ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఏమయ్యాడో తెలియదు .. ఆ రోజు ఎడిటర్ పనికిరాని ఆ వ్యాసం వేయకపోయి ఉంటే జర్నలిస్ట్ గా ఎక్కడో పని చేస్తూ ఉండేవాడు . మాణిక్యంలా కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి .. ప్రాక్టికల్ గా ఉండాలి . చట్టం కన్నా ఎడిటర్/ మేనేజ్ మెంట్ గొప్పవాడు కాదు ….
Share this Article