Murali Buddha……… తనను తానే ఓడించుకున్న డీసీ రెడ్డి…. తెలంగాణ ఆత్మ ఆంధ్రభూమి… జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
…..
ప్రత్యర్థి పై విజయం సాధిస్తే వీరుడు . తనపై తానే విజయం సాధిస్తే మహావీరుడు . వీరుడు కావడం కన్నా మహావీరుడు కావడం చాలా కష్టం . అందుకే మహావీరుడు దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు .
Ads
మరి తనను తానే ఓడించుకున్న వారిని ఏమనాలి ? ఉదయమే టివిలో డిసి ప్రమోటర్లను అరెస్ట్ చేసిన ఈడీ అనే వార్త చూడగానే వెంకట్రామ్ రెడ్డి తనను తానే ఓడించుకున్నవారు అనిపించింది . ఒక్కరికీ జీతాలు ఎగ్గొట్టలేదు . ఎవరినీ కడుపు మీద కొట్టలేదు . మూసేసిన తరువాత కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఏడాది జీతాలు ఇచ్చారు . నాకు రావలసింది ఏదో రాలేదు అనే కోపంతో రాయడం కాదు . బాధతో రాయడం . సంస్థ నాలుగు కాలాలు ఉండాలి .ఇంకా ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కోరిక .
అంతా బాగానే ఉంది కానీ సంస్థను ఎలా నడపాలో అలా నడపకుండా తనను తానే ఓడించుకున్నారు . ఉదయం మిత్రుడు ఫోన్ చేసి టీవీ చూశావా ? అని అడిగాక చూస్తే ఈ వార్త .. ఒక్క సారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . అంతా మునిగిపోయిన తరువాత కూడా తప్పు ఎక్కడ జరిగింది అని మాట్లాడుకోక పోతే మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే … మరో వ్యక్తి మరో సంస్థ తప్పు జరగకుండా చూసుకోవచ్చు .
2008 లో ఐపియల్ ఏర్పాటు డక్కన్ క్రానికల్ కు శనిలా పట్టుకుంది . అయ్యర్ అనే వ్యక్తి శని ప్రతినిధిలా డిసిలో అడుగు పెట్టాడు . ఈ అయ్యర్ ఎక్కడి నుంచి ఊడి పడ్డాడో కానీ సంస్థను దెబ్బ కొట్టాడు . వెంకట్రామ్ రెడ్డి , అయ్యర్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు . అప్పట్లో జర్నలిస్ట్ మిత్రుడు రాంలాల్ సింపుల్ గా ఓ మాట చెప్పారు . ఆఫీస్ పక్కన అజంతా టాకీస్ గేటు వద్ద మిర్చి బజ్జి బండి వద్ద నిలబడి మాట్లాడుకుంటూ – ఈ మిర్చి బజ్జిల అతనికి కూడా ఓ ప్లాన్ ఉంటుంది . వర్షం వస్తే ఎంత పిండి కలపాలి , రాకపోతే ఎంత కలపాలి అనే లెక్కలు ఉంటాయి . మేనేజ్ మెంట్ కు ఈ మాత్రం ముందు చూపు లేనట్టుంది అని ..
*****
డిసి , ఆంధ్రభూమి మొదటి యాజమాన్యం తమిళులు . మొదట డిసి పత్రిక తెచ్చి , తరువాత ఆంధ్రభూమి తెచ్చారు . తరువాత నెల్లూరుకు చెందిన తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్నారు . మొదటి యజమాని , రెండవ యజమాని తెలంగాణ వారు కాదు . గుర్తున్నంత వరకు ఆంధ్రభూమి మొదటి ఎడిటర్ నుంచి మూత పడే సమయంలో ఎడిటర్ గా ఉన్న సదాశివ శర్మ వరకు ఒక్కరు కూడా తెలంగాణ వారు లేరు .. ఎడిటర్ లు సత్య సుబ్రహ్మణ్యం , గోరాశాస్త్రి , గజ్జెల మల్లారెడ్డి , ఎబికె ప్రసాద్ , పతంజలి , సి కనకాంబరరాజు , శాస్త్రి , సదాశివ శర్మ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ కాదు . కానీ ఆంధ్రభూమి అంటే తెలంగాణ ఆత్మగా భావించేవారు .
ఓనర్ నెల్లూరు రెడ్డి , సిఇఓ థామస్ ఆంధ్రా ఐనా భూమి అంటే తెలంగాణ అనే ముద్ర ఉండేది . ఎక్కువ మంది సిబ్బంది , యూనియన్ తెలంగాణకు చెందిన వారు ఉండేవారు . ఈనాడు పత్రిక రాక ముందు మార్గదర్శి ప్రకటనలు కూడా ఆంధ్రభూమికే ఇచ్చారు . తెలంగాణలో ఒకప్పుడు ఆంధ్రభూమి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పత్రిక . 1969 లో తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది . డిసి , భూమిలో పని చేసేవారు రాష్ట్ర స్థాయిలో నాయకత్వ స్థాయిలో ఉండేవారు . రాష్ట్రంలో రాయలసీమ , విశాఖ , నెల్లూరు , విజయవాడలలో ఎడిషన్లు పెట్టినా భూమిపై తెలంగాణ ముద్ర పూర్తిగా చెరిగిపోలేదు . ఎంతో కొంత మిగిలే ఉంది . శాస్త్రి సమైక్యాంధ్ర ముద్ర కోసం తీవ్రంగా ప్రయత్నించినా తెలంగాణ ముద్ర పూర్తిగా చెరిగిపోలేదు .
*******
ఐపియల్ లో డక్కన్ ఛార్జర్స్ ను డిసి వాళ్ళు కొన్న రోజు ఆఫీస్ మొత్తం సంబరంగా ఉంది . ఏదో విజయం సాధించినట్టు ఆనందంగా ఉన్నారు . ఆఫీస్ బయటకు వచ్చి మిత్రులందరూ బృందాలుగా చర్చలు . బాగా గుర్తున్న చర్చ ఏంటంటే… రిపోర్టర్ శైలేంద్ర నేనూ గేటు బయట మాట్లాడుకుంటూ పత్రిక నడపాల్సిన వాళ్ళు దాన్ని మరింత బాగా ఎలా నడపాలి , కొత్త ఎడిషన్లు ఎలా తేవాలి అని ఆలోచించాలి కానీ ఈ క్రికెట్ ను కొనడం ఏందీ ? మనను ఏం చేయదలుచుకున్నారు అని ఆందోళన పరస్పరం పంచుకునే వాళ్ళం .
ఒక పార్ట్ టైం , ఫుల్ టైం , జర్నలిస్ట్ లు ఏజెంట్లు అంతా కలిసి ఉమ్మడి రాష్ట్రంలో మూడు నాలుగు వేల మంది ఉంటారు . యాజమాన్యం వ్యక్తి కాదు, వారు తీసుకునే నిర్ణయం నాలుగువేల మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది .తెలిసిన మిత్రుడి వద్ద 30 ఏళ్ళ నుంచి చిట్టీలు వేస్తుంటా . ఓ రోజు అతను ‘‘అన్నా నేను మందు తాగను , వ్యసనాలు లేవు , ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను’’ అని చెప్పాడు . ఏదో వందేళ్లు బతకాలి అని కాదు . అతను వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు . రిటైర్ అయిన వాళ్ళు ఇతని వద్ద వడ్డీ కోసం డబ్బు దాచుకుంటే , ఇంకొంత ఎక్కువ శాతానికి ఇతను వడ్డీకి ఇస్తాడు . వ్యసనాల వల్ల నాకేమన్నా అయితే నన్ను నమ్మి డబ్బు పెట్టిన వృద్దులకు అన్యాయం అవుతుంది . వాళ్లకు కనిపెంచిన పిల్లల మీద కన్నా నా మీద ఎక్కువ నమ్మకం ఉంచి డబ్బు పెట్టినందుకు నేనెంత జాగ్రత్తగా ఉండాలి అని … అందుకే వ్యసనాలకు దూరం అన్నాడు . ఓ పాతిక మంది వృద్ధుల నమ్మకం కోసం అతను అలా ఉంటే నాలుగు వేల మంది జీవితాలు ఆధారపడి ఉండే సంస్థ మరింత జాగ్రత్తగా , బాధ్యతతో ఉండాలి కదా .
****
ఆందోళన పరిస్థితులపై కాస్త మనసు విప్పి మిత్రులం గార్డెన్ హోటల్ లో మాట్లాడుకునే వాళ్ళం . యూనియన్ లో చోటా నాయకుడు నేనూ శైలేంద్ర మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి ‘‘ఎండీ సార్ తాగే సిగార్ మూడు వేలకు ఒకటి తెలుసా’’ అని ఏదో చెబుతుంటే .. అంతకు ముందు చాలా సార్లు భరించినా ఆ రోజు భరించలేక .. పది రూపాయలకు గంట చుట్ట ప్యాకెట్ వస్తుంది కదా అన్నాను . రూపాయికి ఒకటి దొరికే గంట చుట్టను , మూడు వేలకు ఒకటి ఉండే సిగార్ ను చుట్ట అనే అంటారు అని వివరించా… ఎడిటర్ పేపర్ ను అమ్ముకుంటున్నా పట్టించుకోలేదు .
ఐపియల్ కొన్నప్పటి నుంచే ఏదో ఒక అపశకునం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది . అంతర్జాతీయ ప్లేయర్లకు ఇంట్లో పార్టీ ఇస్తే అగ్ని ప్రమాదం , కాలింది .. కాలిన మచ్చ పోదు . అరెస్ట్ మచ్చ పోదు . వ్యాపారంలో దెబ్బ తీయాలి అని పోటీదారుడు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు . న్యూస్ టైం , టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి హేమాహేమీలైన సంస్థలు కూడా డిసి రెడ్డిని ఓడించలేక పోయాయి . తన చేతులతో తానే ఓడించుకున్నారు . మంచి మనిషి అయితే సరిపోదు . ఎప్పటి నుంచో ఉన్న సంస్థ భూమి . తరువాత వచ్చిన రామోజీ వందల ఎకరాల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే , ఈయనేమో తండ్రి నిర్మించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని కూడా ప్రశ్నార్ధకంగా మార్చారు …
Share this Article