నాన్నా!
ఈ పిలుపులో తీయదనం అనుభవించేవారికే తెలుస్తుంది.
ఒకరోజు ఒక లక్ష మాటలు మాట్లాడితే అందులో 90 వేల సార్లు వచ్చే పదం… నాన్నా!.
నిజం నాన్నా! అసలు నీకు ఇది నిజం అని చెప్పవలసిన అవసరం లేదు నాన్నా!
అబద్ధం అనే పదం తెలియకుండా పెంచావు మమ్మల్ని.
నువ్వు మా నుంచి భౌతికంగా దూరమై, 33 సంవత్సరాలు అవుతోంది.
శరీరం అశాశ్వతం. మనసే శాశ్వతం.
మానసికంగా నువ్వు మా మదిలో ఒక శిలాశాసనం.
ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, వెంటనే నీతో మాట్లాడుకుంటాం. కొద్దిసేపటికే నువ్వు మమ్మల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించేస్తావు.
ఇంతకంటె సాక్ష్యం వేరే కావాలా నాన్నా, నువ్వు మాతో ఉన్నావనడానికి.
తెల్లవారు జామున నాలుగున్నరకి నిద్ర లేవగానే, కాలకృత్యాలు పూర్తి చేసుకుని నీతో వాకింగ్‌కి రావటం గుర్తుకు వస్తుంది. మనసులోనే నీతో మాట్లాడుకుంటాను.
నవోదయ రామమోహన్‌రావుగారి ఇంటికి, పరకాల పట్టాభిరామ్ గారి ఇంటికి, ఏటుకూరి బలరామ్మూర్తిగారి ఇంటికి, వి. వి. సత్యప్రసాద్ గారి ఇంటికి… రోజూ ఎవరో ఒకరి ఇంటికి తీసుకువెళ్లేవాడివి. అక్కడ వాళ్లు ఇచ్చిన కాఫీ తాగి, మళ్లీ ఇంటికి బయలుదేరేవాళ్లం.
ఇంటికి రాగానే స్నానం చేసేవాడివి. నేను కొంచెం బద్దకించేదాన్ని.
Ads
నువ్వు సుందరకాండ చదువుకుని, పది నిమిషాలు శవాసనం వేసి, ఆ తరవాత పడక్కుర్చీలో రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని, భారతం రాసుకునేవాడివి. నేను వీణ సాధన చేసేదాన్ని. సరిగా వాయించకపోయినా నువ్వు ఎంతో మెచ్చుకునేవాడివి. త్యాగరాజ పంచరత్న కీర్తనలలో శ్రీరాగంలో ఎందరో మహానుభావులు వాయిస్తుంటే, నువ్వు తల ఊపుతూ తాళం వేసేవాడివి. అది నేను ఎన్నటికీ మరచిపోలేను నాన్నా!
ఏడున్నరకల్లా టిఫిన్, 12.30కి భోజనం, మధ్యాహ్నం 3.30 టీ, పల్లీలు, రాత్రి 7. గంటలకి భోజనం లేదా ఇడ్లీలు.. ఇదీ నువ్వు అలవాటు చేసిన టైమ్‌టేబుల్. రాత్రి తొమ్మిది గంట కొట్టిందంటే దీపాలు ఆర్పేసేవాడివి. లైట్లను దీపాలు అనటం నీకు అలవాటు కదా నాన్నా! అందుకే ఆ పదాన్ని వాడుతున్నాను నాన్నా!
అలా మంచం మీద వాలిన తరవాత నువ్వు ఎన్నో విషయాలు చెప్పేవాడివి. ముఖ్యంగా రామాయణం, భారతం కథలు చెబుతుంటే మాకు హాయిగా కంటి నిండా నిద్ర వచ్చేది.
అర్ధరాత్రి దాహం వేసినా, ఏ అవసరం వచ్చినా.. నాన్నా అని పిలవగానే వెంటనే పలికేవాడివి. నీకు విసుక్కోవటం అంటే ఏంటో తెలీదు నాన్నా. రాత్రి ఎంత ఆలస్యం అయినా మళ్లీ తెల్లవారుజామునే లేచేసేవాడివి.
నాకు ఒక విషయం బాగా గుర్తు…
మా చిన్నప్పుడు వేసవి కాలంలో మనం ఆరుబయటే పడుకునేవాళ్లం. నాకు చిన్నప్పటి నుంచీ నీ దగ్గరే నీ మీద కాలు వేసి పడుకునే అలవాటు కదా! నీ పక్కనే పడుకుంటే అదో భరోసా నాన్నా! మాకు భయం వేస్తోంది నాన్నా అనగానే, నువ్వు ఒక మాట అనేవాడివి నాన్నా! గుర్తుందా! … నేను రాక్షసుడిగా ఇక్కడ ఉండగా మీకు భయం ఎందుకమ్మా అనేవాడివి. నిజంగా మాకు ఎంత ధైర్యంగా ఉండేదో నాన్నా నువ్వుంటే. నాకు భయం ఎక్కువ కదా!
అక్కయ్యలిద్దరూ, చెల్లాయి… వాళ్లకి భయం లేకపోవటంతో, విడిగా పడుకునేవారు. నా భయం కారణంగానే నేను నిన్ను విడిచి ఉండలేకపోయేదాన్ని.
నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం ఒకటి ఉంది నాన్నా!
అర్ధరాత్రి వేళ నువ్వు లేచి, మాకు దోమలు కుట్టకుండా ఓడోమాస్ రాసి, ఒంటి నిండా దుప్పటి కప్పేవాడివి. వేసవికాలంలో అయితే అర్ధరాత్రి ఒకసారి మమ్మల్నందరినీ నిద్రలేపి, మంచినీళ్లు తాగించి పడుకోబెట్టేవాడివి.
మధ్యమధ్యలో తాటాకు విసనకర్రతో మా నలుగురికీ విసిరేవాడివి. తల్లి కంటె ఎక్కువగా అంత సుకుమార హృదయం నీకు ఎలా వచ్చిందో ఇప్పటికీ మాకు అర్థం కాదు నాన్నా!
మేం నలుగురం ఆడపిల్లలం నీకు. ఒక్కనాడూ నువ్వు అయ్యో అని మనసులోనూ బాధపడలేదు. నీ చేతలలోనే మాకు ఆ విషయం తెలిసేది.
ఎంత గారం చేశావో, అంత పని కూడా నేర్పావు నాన్నా నువ్వు మాకు.
పిల్లల పెంపకం నీ దగ్గరే నేర్చుకున్నాను నాన్నా నేను.
ఏనాడూ మమ్మల్ని ఒక్క దెబ్బ వేయలేదు, ఒక్క పరుష వాక్కు అనలేదు. మేం చేసిన అల్లరికి మరొక తండ్రి అయితే నాలుగు దెబ్బలు తగిలించేవాడు అనుకుంటాను. నీ దగ్గర మాకు ఎంత చనువు ఇచ్చావో, అంత గౌరవంతో కూడిన భయం కూడా ఉండేది మాకు.
నా విషయంలో నీకు ఉన్న ధైర్యం చూస్తే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది నాన్నా! నేను నాలుగో తరగతి చదువుకుంటున్న రోజుల్లో, నేను ఒక్కర్తినే సినిమాకి వెళ్తాను అనగానే, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి, పంపిచావు. ఆ సినిమా పేరు కూడా నాకు బాగా గుర్తుంది. శోభన్‌బాబు నటించిన అమ్మ మాట సినిమా అది. అయితే ఆ సినిమా పూర్తిగా చూడలేదు. విశ్రాంతి అని పడగానే సినిమా అయిపోయిందనుకుని, ఇంటికి వచ్చేశాను.
అది అప్రస్తుతమనుకో…
నీకు బంగారమన్నా, పట్టు బట్టలన్నా ఇష్టం ఉండేది కాదు. పిల్లలకి బంగారం పెడితే, పిల్లల్ని ఎత్తుకుపోతారు అనేవాడివి. అలాగే పట్టుబట్టలు బీరువాలో దాచుకోవటానికే కానీ, రోజూ కట్టుకోలేం కదా అనేవాడివి. ఆ పట్టు బట్టలకయ్యే డబ్బుతో నాలుగు కాటన్ గౌన్లు కొనుక్కోమనేవాడివి. అది నా మీద బాగా పనిచేసిందనుకుంటాను. ఇప్పటికీ నాకు కాటన్ చీరలే ఇష్టం. పట్టు చీరలు, బంగారం వైపు నా కళ్లు వెళ్లవు. అది నీ పెంపకంలో వచ్చినదే నాన్నా!
సూర్యుడు ఉదయించేటప్పుడు మొదలయ్యే నీ జ్ఞాపకాలు, రాత్రి గడియారం తొమ్మిది కొట్టేవరకు వెంటాడుతూనే ఉంటాయి.
నీతో ఆడిన ఆటలు మరచిపోలేం నాన్నా!
క్యారమ్స్, చింత గింజలు, పేక, ట్రేడ్, గుళ్ల బోర్డు… నీతో ఆడితేనే మాకు సరదాగా ఉండేది. ముఖ్యంగా పేకాటలో అడ్డాట, అడిగే సెట్లు, స్పేడ్స్ మామ్మ గాడిద ఆటలు నువ్వు భలే సరదాగా ఆడేవాడివి. నువ్వు ఆటను ఆటలాగ సరదాగా ఆడించేవాడివి. చాలామంది పేకముక్కలు ఆడపిల్లలు ముట్టుకుంటే దోషం అన్నట్లుగా ఇప్పటికీ అంటుంటారు. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే నువ్వు మాకు అన్ని ఆటలూ నేర్పించావు.
ఆ రోజుల్లోనే మన ఇంట్లో ఉన్న శతక సంపుటం పుస్తకంలోని. కాళహస్తీశ్వర శతకం నుంచి శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పద్యం… వంటి ఎన్నో శతక పద్యాలు నేర్పావు. పోతన భాగవతం నేర్పావు. భారతంలో సులువుగా అర్థమయ్యే కథలిచ్చి చదివించావు నాన్నా!
మమ్మల్ని వ్యక్తిత్వంతో పెంచావు నాన్నా! ఎవరికీ తల వంచకుండా, ఎవరి దగ్గరా చేయి చాపకుండా, ఎవ్వరినీ దూషించకుండా, ఎవ్వరితోనూ దెబ్బలాడకుండా ఉండే లక్షణం నీ పెంపకంలోనే వచ్చింది నాన్నా!
ఉన్నదానితో తృప్తి చెందటం అలవాటు చేశావు నాన్నా! ఖాళీగా కూర్చుని అమ్మలక్కల కబుర్లు చెప్పుకోకుండా సంస్కారంగా ప్రవర్తించేలా పెంచావు నాన్నా మమ్మల్ని.
మాకు ఎప్పుడైనా ఒంట్లో బాగోలేకపోతే, రామనామం జపించుకోమనేవాడివి. ఆయనే మన బాధ తీరుస్తాడనేవాడివి. కాని మాకు రామనామం కంటె నాన్న జపమే ఇష్టంగా ఉండేది. నువ్వు మాకు కనిపించే, నడిపించే దేవుడివి నాన్నా! ఇప్పటికీ మనసుకి ఏ కష్టం కలిగినా, నాన్నా! అని నీకు మనసులో మా బాధంతా చెప్పుకుంటాం. ఆ బాధను నువ్వే తుడిచేస్తావు నాన్నా!
నువ్వు నాకు, చిన్నక్కకి రెండు రోజుల వ్యవధిలో పెళ్లి చేసి, మా కాపురం ఆరు నెలలు కూడా చూడకుండానే మాయమైపోయావు. ఆ విషయంలో నీ మీద నాకు చాలా కోపం నాన్నా. బహుశ ఆ కోపం తీర్చటానికేనేమో నువ్వు చిన్నక్క, నాకు మగపిల్లవాడిగా పుట్టావు. నీ కలం పేరు ఉషశ్రీ, నీ పేరులోని చివరి భాగం కలిపి చిన్నక్క వాళ్ల పిల్లాడికి ఉషశ్రీ దీక్షిత్ అని పేరు పెట్టుకుంది. ఆ తరవాత నాకు పుట్టిన నీకు ఏం పేరు పెట్టాలా అనే ఆలోచన అక్కర్లేకుండా నీ పేరులో మిగిలిన సూర్యప్రకాశ్ అని పెట్టుకున్నాను. కడుపు నిండా రోజూ వేల సార్లు వాడిని.. నాన్నా! అని పిలుచుకుంటూ, నాన్న అనే పిలుపు నాకు దూరం కాకుండా చేసినందుకు నీకు పాదాభివందనాలు నాన్నా!
మర్చిపోయాను, నీకు ఈ పాద నమస్కారాలంటే ఇష్టం ఉండవు.
నిరంతరం మా మనస్సులో ఉంటూ, మా మనోనేత్రం తెరుచుకుని, తప్పులు చేయకుండా కాపాడుతున్న నీకు కన్నకూతురిగా పుట్టినందుకు సంతోషం నాన్నా. ఏనాడో పుణ్యం చేసి ఉంటాను నాన్నా!
ఫాదర్స్ డే రోజున నీ గురించి రాసినంత మాత్రాన ఆ ఒక్కరోజే నువ్వు గుర్తుంటావని ఎవరు భ్రమ పడినా అది పొరపాటే కదా నాన్నా! నాకు ఒకే ఒక్క బాధ నాన్నా! నీతో గడిపిన రోజుల కంటె, నీ జ్ఞాపకాలతోనే ఎక్కువ రోజులు గడుపుతున్నాం నాన్నా!
జరిగిపోయినదానికి బాధ పడకూడదని నువ్వు మాకు వేదాంతం బోధించేవాడివి. అందుకే బాధ పడట్లేదు.
నేను పదే పదే చెప్పేది ఒక్కటే నాన్నా…
నిన్ను ఏ క్షణం స్మరించుకోలేదో, ఆ క్షణం నా ఊపిరి ఆగిపోయిందని అర్థం నాన్నా!
ఇలా ఇన్ని సంవత్సరాలు స్మరించుకునే అదృష్టం ప్రసాదించిన నీకు…
ఏమని ముగించాలో అర్థం కావట్లేదు…
అయినా ఇది ముగింపులేని జ్ఞాపకాల ప్రవాహం నాన్నా!
(వైజయంతి, ఉషశ్రీ పురాణపండ మూడవ కుమార్తె)
Share this Article