House-Wish: పాపం పాపారావు. భార్య పోరు భరించలేక…కొన్ని ఆదివారాలను ఇల్లు కొనడానికి అన్వేషణకోసం కేటాయించాడు. పాపారావు పేరే పాతగా ఉంటుంది కానీ ఆయన ఉద్యోగం చాలా ట్రెండీగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ కొలువు. భార్య కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగే. ఇద్దరికీ కలిపి రెండు లక్షల నెల జీతం చేతికి వస్తుంది. పెళ్లయి నాలుగేళ్లయింది. ఏడాది పాపతో పాపారావు ఇల్లు కళకళలాడుతూ ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సహజంగా అలవడే శని, ఆదివారం అర్ధరాత్రి అలవాట్లు భార్యా భర్తలకు లేకపోవడంతో ఆ ఇంట్లో సమస్యలేమీ లేవు.
కాకపోతే- ఉద్యోగం గచ్చిబౌలిలో. అద్దెకు ఉంటున్న ఇల్లు హయత్ నగర్లో. చిన్న కారు కూడా కొన్నారు కానీ…హైదరాబాద్ ట్రాఫిక్లో ఉదయం ఒకటిన్నర గంట, సాయంత్రం రెండు గంటలు ప్రయాణానికే సరిపోతోంది. రోజూ పేపర్లలో, టీ వీ ల్లో, రేడియోల్లో వచ్చే “మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి…” అన్న ప్రకటన చూసి చూసి, విని విని పాపారావు భార్య పావని గృహాన్ని సొంతం చేసుకోవాలని దృఢంగా సంకల్పించుకుంది.
వారమంతా గొడ్డు చాకిరి చేస్తున్నాం. శనివారం బట్టలుతుక్కోవడానికి, ఇల్లు సర్దుకోవడానికి సరిపోతోంది. ఉన్న ఒక్క ఆదివారం ఇలా ఊరవతల ఎడారుల్లో గమ్యం లేని పయనాలు అవసరమా? అని పాపారావు విసుక్కోవాలని అనుకున్నాడు కానీ…భార్య పావని నూతన గృహాన్వేషణోత్సాహం చూసిన తరువాత…ఇలాంటి భార్య దొరకడం తన పూర్వజన్మల పుణ్యఫలం అనుకుని ఒక్కో ఆదివారాన్ని ఆ గృహ యజ్ఞంలో హవిస్సుగా అర్పిస్తున్నాడు.
Ads
పాపారావు- పావని ఆరు నెలల ఇంటి అన్వేషణ అనుభవాలు;
కొన్న ఇల్లు చేతికి వచ్చేలోపు అనుభవాలు;
ఇంట్లో చేరిన తరువాత అనుభవాలు…
ఇలా ఈ ఇంటి రామాయణాన్ని కొన్ని కాండలుగా విభజించి చూస్తే తప్ప…మనకు క్లారిటీ రాదు.
అయోమయ కాండ:
హైదరాబాద్ మహానగరంలో లో ఏది హైదరాబాద్ జిల్లా? ఏది రంగారెడ్డి జిల్లా? ఏది మేడ్చల్ జిల్లా? ఏది నల్గొండ జిల్లా? ఏది మెదక్ జిల్లా? ఏది సంగారెడ్డి జిల్లా? అని వెతుక్కోవడం రెవెన్యూ వారికే తికమకగా ఉంటుంది. ఇక సామాన్యులకు అయ్యే పనేనా? ఇల్లు మేడ్చల్ జిల్లాలో ఉంటే…ఉద్యోగం రంగారెడ్డి జిల్లా అయి ఉంటుంది. లేదా నిలుచున్న చోట ఒక కాలు హైదరాబాద్ జిల్లాలో ఒక కాలు సంగారెడ్డి జిల్లాలో ఉండవచ్చు.
దాంతో పాపారావు దంపతులు హైదరాబాద్ లో అంతర్భాగమయిన నాలుగయిదు జిల్లాలను ప్రతి ఆదివారం కొనాల్సిన ఇంటి కోసం జల్లెడ పట్టేవారు. ఈ అన్వేషణ పుణ్యమా అని వారికి సగం తెలంగాణా రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన ఏర్పడింది. ఒక్కోసారి ఎడారుల్లో ఒంటరి ఒంటె గమ్యం తెలియక నిలుచున్నట్లు పాపారావు దంపతులు అయోమయంగా కడుతున్న అపార్ట్ మెంట్లు, విల్లాల దగ్గర పిచ్చి చూపులు చూస్తూ నిలుచునేవారు. చివరికి అక్కడ పనిచేసే ఉత్తర భారత వలస కార్మికులు వీరికి హిందీలో తిరిగి ఊళ్లోకి ఎలా వెళ్లాలో అడ్రస్ చెప్పి పంపేవారు.
విసిగి విసిగి…చివరికి మరో వందేళ్లలో మరో గచ్చిబౌలి అవుతుందనుకున్న వికారాబాద్ ఊరి పొలిమేరల్లో ఒక పెద్ద అపార్ట్ మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో మోడల్ హౌస్ నచ్చి…ఒక శుభ ముహూర్తాన అడ్వాన్స్ ఇచ్చారు. ఇక్కడికి ఇంటి అన్వేషణ కాండ ముగిసి…బిల్డరు కాండలోకి ప్రవేశించారు పాపారావు దంపతులు.
బిల్డరు కాండ:
మొదట వారం వారం సైటుకు వెళ్లేవారు. ఎన్నాళ్లయినా అవే పిల్లర్లు…అవే స్లాబులు. మూడేళ్లయినా మార్పు లేదు. ఈలోపు రియలెస్టేట్ వార్తలు పాపారావు దంపతులకు నిద్రను దూరం చేశాయి. కొన్నవారిని ముంచిన పెద్ద పెద్ద రియలెస్టేట్ కంపెనీల వార్తలు చదివి చదివి పాపారావుకు షుగర్ వచ్చింది. పావనికి బీ పి వచ్చింది. మరో రెండేళ్లు…అంటే అయిదేళ్ళయ్యాక ఇల్లు చేతికొచ్చింది. ఈలోపు నగా నట్రా అమ్ముకున్నారు. బ్యాంకు లోను ఈ ఎం ఐ నాలుగేళ్ల కిందటే మొదలయ్యింది. ఇల్లు మోడల్ హౌస్ లా ఉండనే ఉండదన్న క్లారిటీ వచ్చింది.
ఇంటీరియర్ కాండ:
బిల్డరే ఒక ఇంటీరియర్ పనులు చేసేవాడిని తగిలించాడు. వాడికి తెలుగు రాదు. వీరికి హిందీ రాదు. భాషా సమస్యకు తోడు భావపరమయిన సమస్యలు కూడా వచ్చి…పాపారావు దంపతులకు ఏ రంగులు నచ్చవో ఇల్లంతా ఆ రంగులతో నిండిపోయింది. ఇల్లు ఎలా ఉండకూడదనుకున్నారో అక్షరాలా అలాగే వచ్చింది. సొంత ఇంట్లో సేద తీరాలన్న ఆరాటం కాస్త ఆవిరై…అద్దె ఇంటి ఆనందమే గొప్పదని రోజూ అనుకుంటున్నారు.
అరణ్యరోదన కాండ:
బిల్డరుకు ఎస్ ఎఫ్ టీ కి ఇంతని ఎంత చెల్లించారో దాదాపు ఆంత రెండో కారు పార్కింగ్ కు, కార్పస్ ఫండ్ కు, క్లబ్ మెంబర్ షిప్ కు, పదో ఫ్లోర్ ఆకాశ దృశ్య వసతికి, బిల్డరు ఇవ్వని ఫ్లోరింగ్, బిల్డరు ఇవ్వని బాత్ రూమ్, బిల్డరు ఇవ్వని ఇతర వసతులకు అయ్యింది. బిల్డరు ఒట్టి పిల్లర్లు, స్లాబు మాత్రమే ఇచ్చాడు…మిగతాదంతా మేమే కట్టించుకున్నామన్న పాపారావు దంపతుల ఏడుపు అరణ్యరోదనగానే మిగిలిపోయింది.
దా’రుణ’ కాండ:
ఇద్దరి జీతం రెండు లక్షల్లో లక్షా పాతిక వేలు ఇంటి ఈ ఎం ఐ కే పోతోంది. అలా ఇప్పటికి నాలుగేళ్లయింది. ఇక మిగిలింది పదహారేళ్లే. మధ్యలో ఆర్ బీ ఐ ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన ప్రతిసారీ…రివర్స్ రెపో రేటు ఆటు పోట్లకు గురై…ఈ ఎం ఐ పెరగకపోయినా…కట్టాల్సిన కాలపరిమితి పదహారేళ్లు కాస్త ఇప్పటికి ఇరవై ఐదేళ్లకు పెరిగింది. బహుశా పాపారావు కూతురి తరం వచ్చినా…ఈ ఇంటి రుణం తీరని దా’రుణం’గా అలాగే మిగిలి ఉంటుందేమో!
మరి-
వేల, లక్షల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి…దర్జాగా తిరిగేవారి భారాన్ని ఎగ్గొట్టనివారికి బ్యాంకులు సమానంగా పంచడమే కదా రివర్స్ రెపో స్థూల సర్దుబాటు పరపతి…పరస్పర పరపతి లాంటి అర్థం కాని పారిభాషిక పదాలు చెప్పే నీతి!
“ఇల్లు కట్టి చూడు” అన్నందుకు పాపారావు దంపతులు “ఈ ఎం ఐ కడుతూ…ఇంటిని చూడలేక చూసుకుంటూనే ఉన్నారు.
సామెతలో రెండో భాగం “పెళ్లి చేసి చూడు”కూడా చూస్తారు.
“ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు?”
“చేసుకున్నవారికి చేసుకున్నంత” లాంటి సామెతల అంతరార్థాలు పాపారావు భార్య పావనికి ఇప్పుడు ఇటుక ఇటుక పేర్చి గోడ కట్టినట్లు స్పష్టంగా అర్థమవుతున్నాయి.
ఇంటి కష్టం కంటే బయట బంధువులు, లోకం-
“పాపం…మన పాపారావు ఇల్లు కొన్నాడు”
అన్న ఒక్క మాటే వారి గుండెల్లో పునాదిని తవ్విన గునపంలా పదే పదే గుచ్చుకుంటోంది!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article