Bharadwaja Rangavajhala…… గూడ అంజన్న స్మృతి లో… అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది. నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు.
అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో నెమలూరి భాస్కరరావుగారితో సమావేశం జరిగింది. ఆయన మాకు ఆ రాత్రంతా నక్సల్బరీ వెలుగు ప్రసరింపచేశారు. ఆ రాత్రి ఆయనతో మాట్లాడానికి వెళ్లిన ఇద్దరిలో ఒకరు ఆ రాత్రికే చాలనుకున్నారు.
వారు ఆ మధ్య వరకూ ఇండియన్ ఎక్స్ ప్రెస్సు లో ఉండెడివారు. రెండో వాణ్ణి నేను. ఆ మర్నాడు కూడా వెళ్లాను. నెమలూరి నన్ను గోటూ విలేజ్ క్యాంపెయిన్ కు పంపించారు. ఆ క్యాంపెయిన్ లో మా దళంలో మదార్, వాసు అనే ఇద్దరు గాయకులు ఉండేవారు. వాసు డప్పు అద్భుతంగా వాయించేవాడు.
Ads
అప్పుడే మొదటి సారి… నమ్మొద్దు బాబో ఓరి కూలన్న బాబూ నమ్మద్దు బాబూ ఓరి కూలన్న పాట … ఏమి బతుకులు ఏమి బతుకన్నా ఈ రైతు బతుకులు వెట్టి బతుకులు మట్టి బతుకన్నా… ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా దొర ఏందిరో వాడి దోపిడేందిరో… లాంటి పాటలు విన్నాను. కోరస్ పాడాను. ఒక్కో చోట నేనూ పాడాను.
అయితే ఈ పాటలు ఎవరు రాశారు అనే ఇంట్రస్టు కొద్దీ నేను పరిశోధన చేసి నమ్మొద్దు బాబో పాట పెంజండ్రలో ఓ ఆర్టిస్టు రాశారనీ … ఊరు మనదిరా పాట అంజయ్య రాశాడనీ తెలుసుకోగలిగాను. నిజానికి ఈ పాటలన్నీ జననాట్యమండలి పాటల పుస్తకంలో ఉండేవి. అయితే ఆ పుస్తకానికి ఉన్న ముందుమాటలో … ఇలా రాశారు.
ఈ పాటలన్నీ జనం నుంచీ నేర్చుకున్న పాఠాలతో వారి నుంచీ తీసుకున్న బాణీల్లో తిరిగి వారిని చైతన్యపరచడం కోసం తయారైనవి. అందుకని ఇందులో రచయితల పాత్ర నామమాత్రం. అందుకే ఏ పాటకీ రచయిత పేరు ప్రత్యేకంగా ఇవ్వడం లేదు అని రాశారు. అలా ఓ గొప్ప సంప్రదాయానికి జననాట్యమండలి పాటల పుస్తకం నాంది పలికింది అనుకునేవాళ్లం. ఇలా నడుస్తూండగా …
ఓ పదేళ్లకి అంటే… 1991లో రామోజీరావు పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమా తీశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయం అది. చెన్నారెడ్డి అధికారంలోకి రాగానే అప్పటి వరకు అన్నగారి పాలనలో అమలైన ఆట మాట పాట బంద్ అనే నిబంధనను తొలగించారు. ఎవరికైనా రాజకీయ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ ఉందనీ సభలూ సమావేశాలూ పెట్టుకోవచ్చనీ సెలవిచ్చారు. వ్యవహరించారు.
ఈ కాలాన్ని రిలాక్సేషన్ పిరియడ్ అని చెప్పుకునేవారు. అన్నగారి పాలనలో అజ్ఞాతంలోకి పోయిన గద్దర్ తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చాడు. అన్నగారి పాలనలో జైలుకు వెళ్లిన వరవరరావు విడుదలయ్యారు. రాజమండ్రి జైలు నుంచీ సూర్యంగారు , భూషణం, ప్రభు లాంటి వాళ్లంతా విడుదలై వచ్చేశారు. ఇక రాష్ట్రమంతటా ఎర్ర కోలాహలం. మరొక్కసారి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా దొర ఏందిరో … పాట మార్మోగింది.
ఈ వాతావరణంలో రామోజీరావు పీపుల్స్ ఎన్ కౌంటర్ ప్రారంభించారు. ఒక వైపు నక్సల్స్ మరో వైపు ప్రభుత్వం … ఈ రెంటి మధ్యా జనం అమాయకంగా చనిపోతున్నారంటూ సినిమా తీశారు దర్శకుడు మోహనగాంధీ. ఈ సినిమా కోసం ఊరుమనదిరా పాటతో సహా మరి కొన్ని అప్పటికి జనంలో బాగా నానిన విప్లవగీతాలను సినిమా కోసం వాడుకుంటామని విప్లవకవులను కోరారు ఉషాకిరణ్ మూవీస్ వారు. సరిగ్గా అప్పుడు గూడ అంజయ్య ప్రెస్ ముందుకు వచ్చాడు..
రామోజీకి మా పాటలు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అంజయ్య తదితర విప్లవ కవులు. విప్లవ సాహిత్యాన్ని కూడా గిరాకీ ఉన్న సరుకుగా పరిగణించడం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో గూడ అంజయ్య కాస్త ఆవేశంగానే అంటూ దొర ఏందిరో వాడి పీకుడేందిరో అన్నంత ఆగ్రహంగానూ కనిపించాడు.
అప్పుడు రామోజీరావు తనదైన పద్దతిలో వేటూరి సుందరరామ్మూర్తిని ప్రవేశపెట్టాడు. తమ సినిమాలో పెట్టదల్చుకున్న విప్లవగీతాలననింటినీ వేటూరికి అందించారు. ఆయన ఏ మాత్రం మొహమాటం లేకుండా వాటినే పదాలు కాస్త అటూ ఇటూ చేసి మసిపూసి మారేడు కాయలను అద్భుతంగా తయారు చేశాడు. బాలసుబ్రహ్మణ్యం గద్దరవతారం ఎత్తాడు. గూడ అంజయ్య వర్గకసితో రాసిన ఊరు మనదిరా పాటను నేలమనదిరా అంటూ చాలా దారుణంగా నేల మనదిరా అంటూ మార్చారు వేటూరి.
పొట్టకూడి కోసం పోలీసుల్ల కలసినాడు అంటూ గద్దర్ రాసిన పాటను… పొట్ట కూటి కోసం పోలీసన్నా అంటూ అనువదించేసుకున్నారు. అప్పుడు నాకు వేటూరి మీద చాలా కోపంగా ఉండేది. అలా గూడ అంజయ్య నాకు గుర్తుండిపోయాడు. ఇలా తెలుగుతో సహా మరో పదహారు భాషల్లోకి అనువాదమయ్యింది ఊరు మనదిరా పాట. జోహార్ గూడ అంజయ్య…
Share this Article