అద్భుతమైన నిర్మాణం… మిర్రర్ ఇమేజీ కన్‌స్ట్రక్షన్… హుసేన్ సాగర పరిసరాల్లో నిర్మితమైన అమరవీరుల స్మారకం తెలంగాణ ఉద్యమకారులకు నచ్చేలా పూర్తయింది… నిజమే… కానీ అంతటి అపురూప నిర్మాణమైతే చేశారు కానీ అమరుల పేర్లేవీ..? వారి చరిత్రలేవీ..? అవి లేకుండా ఆ స్మారకానికి విలువేదీ..? అసలు తెలంగాణ కోసం జరిగిన పోరాటాల్లో అమరులైన వారి వివరాల సేకరణ ఈ ప్రభుత్వానికి ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు పట్టలేదు..?
అమరవీరుల స్మారకం సరే, కానీ వారి ఆకాంక్షల మాటేమిటి..? ఎన్నికలొస్తున్నాయి కాబట్టి, ఇన్నాళ్లూ తెలంగాణ ద్రోహుల్ని మోసిన కేసీయార్‌కు ఇప్పుడు హఠాత్తుగా అమరులు గుర్తొస్తున్నారా..? నిజమైన తెలంగాణవాదుల ఆశల్ని, ఆశయాల్ని, ఆకాంక్షల్ని కాలరాచిన కేసీయార్ ఇప్పుడు ప్రేమ నటిస్తున్నాడా…. ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు, ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయి… కానీ నిజానికి హఠాత్తుగా అమరవీరుల స్మారకం గుర్తురావడం అనే విమర్శ కరెక్టు కాదు… ఈ నిర్మాణం చాన్నాళ్ల క్రితమే స్టార్టయింది…
కానీ తెలంగాణ కోసం అమరులైన వారి వివరాల సేకరణ, క్రోడీకరణ జరగలేదు… అది నిజం… ఫస్ట్ లిస్టులో గుర్తించింది కేవలం 459… ఆ తరువాత 23 ఫేజుల్లో గుర్తించింది మరో 126 మంది… 585 మంది కుటుంబాలకు కాస్త పరిహారం దక్కింది… నిజంగానే ఈ ప్రభుత్వం నిజమైన అమరులు ఎవరో నిజనిర్ధారణ చేయించి, ఓ లిస్టు ప్రకటించలేకపోయిందా..? వారి పేర్లను అమరుల స్మారకంలో పొందుపరచలేకపోయిందా..? ఈ ప్రశ్నలకు టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి వివరణ ఒకటి ఇంట్రస్టింగ్… అది యథాతథంగా…
Ads
అమరత్వం అనామకం కాదు. అదొక అసంఖ్యాక త్యాగాల సర్వనామం!!
నా చిరకాల మిత్రుడు సామాజికవేత్త ప్రొఫెసర్ రమణమూర్తి Ramanamurthy Rupakula అమరవీరుల స్మారక స్థలి లో అందరి పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే ఉండాలి. కానీ ఎక్కడున్నాయి. 1952 నుంచి వేలాదిమంది తెలంగాణ కోసం తపించి, పోరాడి తనువులు చాలించారు. పాలక వర్గాలు ఎప్పటికపపుడు వాటిని చెరిపేస్తూ వచ్చాయి.
1952 సిటీ కాలేజీ దగ్గర పోలీసు కాల్పుల్లో ఏడుగురు చనిపోయినట్టు విన్నాం. ఉద్యమ కాలంలో నేను NTV చర్చలో ఈ మాట అంటే లగడపాటి రాజగోపాల్ దమ్ముంటే పేర్లు చెప్పమని సవాలు చేశారు. ఆ ఏడు పేర్లు అధికారికంగా చెపితే తాను MP గా రాజీనామా చేసి సన్యాసం తీసుకుంటా అన్నారు. 1969 ఉద్యమంలో 376 మంది 396 మంది అని రకరకాల లెక్కలున్నాయి. నిర్దిష్ట సంఖ్య లేదు. పేర్లు లేవు. రికార్డే కాలేదు.
కొందరు ఉద్యమ, చరిత్ర కారులు వాటిని శోధించే ప్రయత్నం చేశారు. కానీ అన్నీ దొరకలేదు. ఆ తరువాత 1990 వ దశకంలో వామపక్ష ప్రభావిత ప్రయత్నాలూ జరిగాయి. జనసభ, మహాసభ సహా తెలంగాణ కోసం గొంతు విప్పిన అనేక మందిని పాలకులు అంతం చేశారు. వారి వివరాలు లేవు. మలిదశ అని చెపుతున్న 2001 తరువాతి కాలంలో ముఖ్యంగా 2009 తరువాత వేలాదిమంది ఆత్మత్యాగం చేసి బలి అయిపోయారు.
అప్పటి ప్రభుత్వం కూడా వాటిని నమోదు చేయ నిరాకరించింది. 1500, 1200 ఇలా అనధికార అంకెలున్నాయి. ఉద్యమకాలంలో నేను మరికొందరు మిత్రులం ఒక వెయ్యి దాకా పేర్లు సేకరించగలిగాం. అధికారికంగా 700-800 మంది వివరాలు దొరికినట్టు చెపుతున్నారు. బయట కూడా సామాజిక పరిశోధకులు, మేధావులు, పత్రికలు, సంస్థలు కూడా పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు లేవు.
ఇటువంటి స్థితిలో తెలిసిన పేర్లే రాస్తే పేర్లు వివరాలు తెలియని వారికి అన్యాయం జరిగినట్టు అవుతుందేమో ఆలోచించాలి. అలా కాకుండా ఒక సింబాలిక్ మెమరీగా అమరత్వం అనే భావన మంచిదేమో కూడా ఆలోచించాలి. సుదీర్ఘ కాలం పాటు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఎగిసిపడ్డ ఉద్యమంలో అందరి వివరాలు సేకరించడం కష్టమే అయినా ప్రభుత్వం, పరిశోధకులు ఆ ప్రయత్నం చేయాలి. అప్పటిదాకా ఆ త్యాగాలను విడివిడిగా కాకుండా ఉమ్మడిగా స్మరిస్తూ అమరత్వం ఒక ప్రతీకగా నిలపడమే మంచిది.. నివాళి 🪻
Share this Article