అక్షయ పాత్ర హైదరాబాద్… ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది … జర్నలిస్ట్ జ్ఞాపకాలు
———————————–
ముహూర్తాల మీద నమ్మకం ఉన్నా లేకున్నా … హైదరాబాద్ నగరాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం ఏదో అద్భుతమైన ముహూర్తంలోనే నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు . లేకపోతే అక్షయ పాత్రలా ఎంతమంది వచ్చినా ఎలా తిండి పెడుతుంది …
Ads
*****
హలో ఎక్కడున్నావ్ ? అని ఉదయం ఓ జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో చిక్కుకున్నా 45 నిముషాలు అయినా ఆఫీస్ కు చేరుకోలేక పోయాను అని చెప్పి … ఉద్యమ కాలం నాటి విషయాలు కొన్ని గుర్తు చేశారు . తెలంగాణ ఏర్పడి మేం ఆంధ్రకు వెళ్ళిపోతే, మీ రోడ్ల మీద మనుషులు కనిపించరు అని భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చూపించాడట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ లో సీనియర్ రిపోర్టర్ ఒకరు … నిజానికి ఈ పదేళ్లలో హైదరాబాద్ కు బతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది .
పురాణాల్లో అక్షయ పాత్ర ఎంత మంది తిన్నా వడ్డించేందుకు ఇంకా తిండి ఉండేదట … అక్షయ పాత్ర నిజమో కాదో తెలియదు కానీ హైదరాబాద్ నిజంగా అక్షయ పాత్రనే .. బతకడానికి ఎంత మంది వచ్చినా వారికి బతుకు తెరువు చూపుతూ కడుపులో పెట్టుకొని దాచుకుంటుంది . ఇంకెంత మంది వచ్చినా అక్కున చేర్చుకుంటూనే ఉంది . ఏ ఆసరా లేకుండా పెద్ద కుటుంబంతో బతుకుతెరువు కోసం హైదరాబాద్ ను ఆశ్రయించిన లక్షల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం . మిత్రుడితో మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా మంది హైదరాబాద్ ఏమవుతుంది అన్న సందేహాలు గుర్తుకు వచ్చాయి .
****
తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు వచ్చారు . తెలంగాణ ఉద్యమం చివరి దశ . విలేకరుల సమావేశాల్లో మాట్లాడే గాలి ముద్దు కృష్ణమ నాయుడు వేరు . మాములుగా ఉన్నప్పుడు మాట్లాడే ముద్దు వేరు . మా వాళ్లు చాలా మంది ఆదిలాబాద్ లో లెక్చరర్లుగా పని చేస్తున్నారు అని ఏదో చెబుతుంటే … అదేంటీ మీది చిత్తూరు జిల్లా కదా ? మీతో పని చేసిన లెక్చరర్లు చిత్తూరులో ఉంటారు కానీ ఆదిలాబాద్ లో ఏంటీ ? అనడిగాను…
నేను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా వాళ్ళు చాలా మందిని నేనే లెక్చరర్లుగా నియమించాను అని నవ్వుతూ చెప్పారాయన . అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది అని వెంటనే బదులిచ్చాను . ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు విద్యాశాఖ మంత్రి . ఆ కాలంలో నియామకాలకు ఇష్టానుసారంగా చేసే అవకాశం ఉండేది . ముద్దు ఎన్టీఆర్ కు నమ్మిన బంటు . 94లో టీడీపీ విజయం సాధించాక బాబును అనుమానంగా చూస్తూ ఒక దశలో స్పీకర్ గా గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఉంటే బాగుంటుంది అని పరిశీలించారు . ఎందుకో సాధ్యం కాలేదు . యనమల స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెన్నుపోటు విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు . గాలి స్పీకర్ గా ఉంటే ఎలా ఉండేదో ?
****
ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో అసెంబ్లీ లాబీలో ముద్దు అనేక విషయాలు చెప్పారు . తెలుగుదేశంలో ఉన్న తెలంగాణ నాయకులు ఒకరిద్దరు తప్ప ఎవరూ పార్టీ విడిచిపోరు . నాకు కాంగ్రెస్ , టీడీపీ రెండింటితో అనుబంధం ఉంది . కాంగ్రెస్ లో మన ఖర్చు మనమే భరించాలి , కానీ అదే టీడీపీలో అయితే టికెట్ ఇస్తారు , ఎన్నికల్లో ఖర్చుకు డబ్బు ఇస్తారు . చివరకు పరిశీలకులుగా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రయాణానికి టికెట్ కూడా పార్టీ నుంచే ఇస్తారు . ఇంత సౌకర్యం వదిలి ఎవరు పోతారు అని గాలి విశ్లేషించారు . ఆ సమయంలో అతని అంచనా నిజమే అని తేలింది . ఐతే హైదరాబాద్ గురించి గాలి అంచనా తలక్రిందులు అయింది .
*****
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ రోజు గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఓ లెక్క చెప్పారు . ఆ రోజుకు హైదరాబాద్ నగరంలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో ఓ లెక్క చెప్పి .. ఒకవేళ తెలంగాణ వస్తే ఈ నిర్మాణాలు ఆగిపోతాయి . ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతారు . ఒక వైపు నిర్మాణాలు ఆగిపోవడం , మరోవైపు ఖాళీ కావడం, ఆలోచించు, ఎలా ఉంటుందో అని తన మనసులో ముద్రించుకున్న ఖాళీగా ఉన్న హైదరాబాద్ రూపాన్ని ప్రదర్శించారు .
అదే సమయంలో యన్టివిలో బెంగళూరులో జరిగే భారీ నిర్మాణాల దృశ్యాలు చూపుతూ హైదరాబాద్ ఖాళీ అయింది అంతా బెంగళూరు వెళ్లారు అని ఉత్సాహంగా స్టోరీలు వండి వార్చారు . ఇప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా హైదరాబాద్ ను తమ వార్తల ద్వారా ఖాళీ చేయాలనీ చూస్తారు . ఏ వార్త లేక పోతే టివి9 వాళ్ళు యుగాంతం వార్త , ntv వాళ్ళు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అనే ప్రత్యేక స్టోరీలు చూపుతారు .
ఓసారి సాక్షి వాళ్ళు ఓ అడుగు ముందుకు వేసి కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ పై ఓ చిత్రమైన వార్త వేశారు . కొన్న ధర కన్నా పదింతలు తక్కువకు అమ్ముతాము అన్నా ఎవరూ రావడం లేదు అని రాశారు . పదింతలు అంటే అంటే ఉచితంగా ల్యాండ్ ఇచ్చి, డబ్బు కూడా ఇవ్వడం అన్నమాట .
గతంలో ప్రధాన మంత్రికి మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు కూడా తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఏదో అవుతుంది అనుకున్నాను . కానీ నా భయాలు పటాపంచలు అయ్యాయి . అద్భుత ప్రగతి సాధించింది అన్నారు . ఆ రోజుల్లో మీడియా చూపించిన భయం ఆ స్థాయిలో ఉండేది . బారులాంటి వారిని కూడా భయపెట్టేట్టుగా …
సరే, ముద్దు కృష్ణమ చెప్పిన లెక్క ఏమైంది ? ఆ భవనాల నిర్మాణం ఆగిపోయిందా ? అంటే అది తెలియదు కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమార్తె డాక్టర్ హైదరాబాద్ లో ఓ పెద్ద ఆస్పత్రి నిర్మించారు… అది తెలుసు .
***
నేను కన్నెర్ర చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోతుంది అని సీఎంగా ఉన్నప్పుడు హెచ్చరించిన చంద్రబాబు విజయవాడలో అద్దె భవనంలోనే ఉన్నా , హైదరాబాద్ లో మాత్రం పెద్ద భవనం నిర్మించుకున్నారు … — బుద్దా మురళి …
Share this Article