ఎక్కడో చదివినట్టు గుర్తు… షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనమట… డీకే శివకుమార్ మధ్యవర్తి అట… వావ్… అన్నను జైలులో వేసిన కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలకు గమ్యమా..? డబుల్ వావ్… ఆ కాంగ్రెస్‌లో చేరి ఇక తను కలలుగన్న రాజన్న రాజ్యం స్థాపిస్తుందా..? పొంగులేటి, రేవంత్, జూపల్లి, భట్టి, పొన్నాల, రాజనర్సింహ, జగ్గారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి… అడుగుకో సీఎం కేండిడేట్… వీళ్లందరి నడుమ షర్మిలకు సీఎం పోస్టు ఎవరివ్వాలి మరి..? సీఎం పోస్టు లేక రాజన్న రాజ్యం ఎలా..? (కాంగ్రెస్‌లోకి చేర్చి, బీజేపీ ఏమైనా కొత్త గేమ్ ప్లే చేయడం లేదు కదా…!!)
ఎస్, తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది… కర్నాటక ఎన్నికల తరువాత మరింత పెరిగింది… ఈమేరకు బీజేపీ డౌనయిపోతోంది… బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కనిపిస్తోంది… చివరకు మజ్లిస్ కూడా బీఆర్ఎస్‌కు దూరం జరిగే సూచనలున్నాయట… అవసరమైతే సొంతంగానే పాతబస్తీ దాటి పోటీలకు దిగుతుందట… పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ జాక్ కూడా, అనగా కోదండరాముడు కూడా జైకాంగ్రెస్ అంటాడట… అందరూ కలిస్తే బలమైన యాంటీ బీఆర్ఎస్ వోటు సాధ్యమేనా..? అదొక పెద్ద చర్చ…
నేను దేశమంతా గాయిగత్తర లేపుతా, ప్రధాని పీఠం ఎందుకు రాదో చూస్తాను అన్నాడుగా పెద్ద సారు… ఏ రాష్ట్రంలోనూ ఊదు కాలింది లేదు, పీరి లేచింది లేదు… మహారాష్ట్రంలో ఒకరిద్దరు పార్టీలో చేరినా దానికి ఖర్చెక్కువ… ఫాయిదా తక్కువ… నమస్తే తెలంగాణలో వార్తలు రాయనీకి పనికొస్తయ్ ఆ చేరికలు… అంతెందుకు, బలమైన యాంటీ మోడీ, యాంటీ బీజేపీ కూటమి కోసం పట్నాలో ఓ సీరియస్ ప్రయత్నమైతే జరుగుతోంది… ఫాఫం, కేసీయార్‌ను ఎవరూ నమ్మరు కదా… ఆయన్ని పిలవలేదు… పిలవరు కూడా…
Ads
మరోవైపు తను డబ్బుసాయం పొందిన జేడీఎస్ వంటివీ జైబీజేపీ అనబోతున్నయ్… నవీన్ పట్నాయక్ తటస్థం… మరిక కేసీయార్‌తో కలిసి కదం తొక్కేది ఎవరు..? ప్రస్తుతానికి ఎవరూ లేరు… ఒంటరి… తను కోల్పోయిన క్రెడిబులిటీ ఇది… శరద్ పవార్, నితిశ్, మమత, స్టాలిన్… పేరున్న ఓ ప్రతిపక్ష నాయకుడూ కేసీయార్‌తో చేతులు కలపడానికి రెడీగా లేరు… చివరకు అఖిలేశ్, తేజస్విలు కూడా..! తెలంగాణలో కూడా గతంలో ఉన్నంత బలం ఉన్నట్టు లేదు… జాన్ జిగ్రీ దోస్త్ జగన్ కూడా దూరాం రాం…
ఇవన్నీ చదువుతూ ఉంటే మరో వార్త కనిపించింది… బీఆర్ఎస్‌తో పొత్తు వ్యవహారాలు చర్చించడానికి సీపీఐ, సీపీఎం భేటీ అట… చివరకు తెలంగాణ రాజకీయాల స్థాయి ఇలా దిగజారిపోయింది… వీళ్లు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనుకూల కూటమిలో చేరరా..? కేసీయార్ విసిరేసే ముష్టి మూడు సీట్ల కోసం అంగలార్చుతారా..? సరే, తెలంగాణ ద్రోహులను చాలామందిని నెత్తిన మోస్తూ మంత్రి పదవులు కూడా ఇచ్చిన కేసీయార్ తెలంగాణ ద్రోహ పార్టీ సీపీఎంకు కూడా సీట్లు ఇస్తాడన్నమాట… సరే, సీపీఐకి ఒకటోరెండో ఇస్తే తప్పులేదు, తెలంగాణ పట్ల సిన్సియర్ సపోర్ట్ ప్రకటించిన పార్టీ అది…
ఏ వామపక్షాలను దబ్బనం పార్టీలు అని వెక్కిరించి దూరం పెట్టాడో వాటినే ఇప్పుడు అలుముకుని స్నేహగీతం పాడాలా కేసీయార్..? ఫాఫం… సీపీఎంను ఎందుకు చేరదీశావ్ అని అడిగితే తెలంగాణ సమాజానికి కేసీయార్ ఏమని సమాధానం ఇవ్వాలి..? ఐనా ఆయన ఏ ప్రశ్నకూ జవాబు ఇవ్వడు కదా… అసలు అడగనిస్తే కదా… జూలై రెండున పొంగులేటి అండ్ కో కాంగ్రెస్‌లో చేరుతున్నారు… రాహుల్, ప్రియాంక వస్తున్నారు… అప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇంకాస్త జోష్ పెరుగుతుంది… తనతోపాటు ఇంకా ఎవరెవరు చేరతారో… తెలంగాణ రాజకీయాలు రక్తికడుతున్నయ్…!! (పొంగులేటి చేరికకు ముందే కాస్త అతి ప్రదర్శన చేస్తున్నాడు… కాంగ్రెస్ సీనియర్లు ఎలా తొక్కబోతున్నారో చూడాలిక…)
Share this Article