————————————-
ఒక అంశాన్ని అందరూ ఒకే కోణంలో చూడాలని లేదు , చూడాల్సిన అవసరం లేదు . మీడియా ఒక కోణంలో చూస్తే రాజకీయ నాయకులు మరో కోణంలో చూస్తారు . ఈ రోజుల్లో అయితే మొత్తం మీడియా కూడా ఒకే కోణంలో చూడదు . తమ తమ మీడియా రాజకీయ అనుబంధ కోణంలో చూస్తే , రాజకీయ పక్షాలు తమ పార్టీ కోణంలో చూస్తాయి .
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడం , రైతుల ఆందోళన బషీర్ బాగ్ లో కాల్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చాయి . బషీర్ బాగ్ వద్ద కాల్పులు జరిగాయని తెలిసి అసెంబ్లీ వద్ద ఉన్న మీడియా ఏం జరిగింది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే అప్పుడు పలువురు మీడియా పెద్దలు తీవ్రవాదులు అసెంబ్లీ ముట్టడికి వచ్చి కాల్పులు జరిపారు అన్నారు.
Ads
కొద్దిసేపు నిజమే అనిపించింది . తరువాత అసలు విషయం తెలిసింది . తీవ్రవాదుల దాడి అంటూ బాబు మీద అభిమానంతో ప్రచారం చేసినా / నమ్మినా , ఈ వ్యవహారం బాబు కొంపే ముంచింది . 2004 లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ , కాల్పులు జరిగిన రోజే బాబు ఓటమి ఖాయం అయింది . అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కెసిఆర్ విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా లేఖ రాయడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు .
తెరాస ఆవిర్భావం తరువాత చేపట్టిన తొలి అంశం 610 జీవో . ఈ జీవో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చింది . ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో పని చేస్తున్నారని , 610 జీవో ప్రకారం వారిని తమ తమ ప్రాంతాలకు పంపాలని తెరాస పెద్ద ఎత్తున ఆందోళన జరిపింది . ఆందోళన ప్రభావం తీవ్రంగానే కనిపించింది .
****
అసెంబ్లీ సమావేశాలు … 610 జీవోపై ఆందోళన తరువాత జరుగుతున్న తొలి సమావేశం కాబట్టి సభలో పెద్ద ఎత్తున గందరగోళం తప్పదు అనుకున్నారు . సుదీర్ఘమైన చర్చ తరువాత హౌస్ కమిటీ వేయాలి అని కెసిఆర్ డిమాండ్ . ఓస్ ఇంతేనా ? వేసేద్దాం అని బాబు ప్రకటించారు . సాధారణంగా హౌస్ కమిటీలో అధికారపక్షం సభ్యులు ఎక్కువ మంది ఉంటారు . ఛైర్మెన్ కూడా అధికారపక్షమే కాబట్టి హౌస్ కమిటీకి అధికారపక్షం సాధారణంగా వెనుకాడదు .
శాసనసభ ప్రశాంతంగా ముగిసింది . మీడియా షాక్ తిన్నది . సభ దద్దరిల్లి పోతుంది , బ్రహ్మాండంగా కవరేజ్ చేయవచ్చు అనుకున్న మీడియా ఒక్కసారిగా డీలా పడింది . వ్యూహం తప్పింది , కెసిఆర్ ఏదో చేస్తాడు అనుకుంటే తుస్సుమనిపించారు అని మీడియా కామెంట్స్ . సభలో మైకులు విరిచేస్తారు , బల్లలు విరిగిపోతాయి అని ఆశించిన వారు ఇలా జరిగిందేమిటి అనుకోవడమే కాకుండా తప్పుడు వ్యూహం అని కామెంట్స్ చేశారు . ఉమా సుధీర్ అని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ హౌస్ కమిటీకి ఒప్పుకొని మౌనంగా ఉండిపోవడం తప్పుడు వ్యూహం అని అంటున్నారు అని ప్రస్తావిస్తే …. అంతకు ముందే మీడియా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోతున్న కెసిఆర్ ను కలిసి ఇలా అనుకుంటున్నారు అని ప్రస్తావించాను .
గొడవ చేస్తే ఒక్క రోజు పెద్ద వార్త అవుతుంది అంతే కదా ? కానీ హౌస్ కమిటీ వేస్తే ఏమవుతుందో వారికి తెలియదు . హౌస్ కమిటీ సమావేశం అయిన ప్రతిసారి తెలంగాణకు జరిగిన అన్యాయం , తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగాలు , ఇతర ప్రాంతాల వారు ఎంతమంది తెలంగాణలో పని చేస్తున్నారో శాఖల వారిగా చర్చ ఉంటుంది . ఒకరకంగా హౌస్ కమిటీ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తుంది అని చెప్పుకొచ్చారు . నిజంగా జరిగింది అదే .
సాధారణంగా హౌస్ కమిటీ అనేది ఒక ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేస్తే అదే ప్రభుత్వ హయాంలో తన పని ముగించి నివేదిక ఇస్తుంది . కానీ తొలుత చంద్రబాబు హయాంలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఛైర్మెన్ గా హౌస్ కమిటీ వేస్తే అనేక సార్లు సమావేశాలు జరిగాయి . తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మెన్ గా 610 జీవోపై హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు . ఈ కమిటీ ఏర్పాటు వల్ల ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతి కార్యాలయంలో తెలంగాణవాదం వినిపించింది .
తమ కార్యాలయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో కార్యాలయాల వారీగా నాయకులకు వివరాలు ఇచ్చేవారు . ఉద్యోగుల్లో తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఇది బాగా దోహదం చేసింది . కమిటీ నివేదిక ప్రకారం అప్పటి వైస్సార్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళమని ఒకవైపు ఆర్డర్ ఇస్తూ మరోవైపు కోర్ట్ కు వెళ్లి స్టే తెచ్చుకోమని సలహా ఇచ్చారు . స్టే వల్ల ఒక్క ఉద్యోగి కూడా తరలి వెళ్ళలేదు . అలానే జరుగుతుంది అని అందరికీ తెలుసు . ఐతే తెలంగాణ వచ్చిన తరువాత ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది .
***
మీడియా ఆశించినట్టు సభలో 610 పై బీభత్సం సృష్టిస్తే మీడియాకు మసాలా వార్త దొరికేది కానీ .. తెలంగాణకు నష్టం జరిగేది …. బాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే విధంగా మీడియా అంచనా తప్పింది . ఇప్పుడు అమరవీరుల స్మృతి చిహ్నం అమర జ్యోతి నిర్మించిన జలదృశ్యం స్థలంలో తెరాస పార్టీ కార్యాలయం ఉండేది . రాత్రికి రాత్రి పోలీసులు కార్యాలయంలోని వస్తువులు బయట పడేసి ప్రభుత్వ స్థలం అని స్వాధీనం చేసుకున్నారు . దీనివల్ల గొడవ తప్పదని మీడియా మొత్తం అక్కడికి పరుగు తీసింది . అక్కడికి చేరిన నాయకులకు కెసిఆర్ ఫోన్ చేసి ఎలాంటి గొడవ చేయవద్దు అని చెప్పి ఒక అద్దె భవనాన్ని మాట్లాడి ఆ వస్తువులు అన్నీ అక్కడకు తరలించారు . అక్కడికి వెళ్లిన మీడియా విస్తుపోవాల్సి వచ్చింది …
****
హింసకు చోటు లేకుండా ఉద్యమించడం వల్లనే తెలంగాణ సాకారం అయింది . హింసతో ఎలక్ట్రానిక్ మీడియాలో బోలెడు ప్రచారం లభించేదేమో కానీ .. కానీ తెలంగాణ సాధనకు ఉపయోగపడేది కాదు .
*****
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ ఓ ఆశ్చర్యకరమైన లెక్కలు బయటపెట్టింది . దాదాపు డజను న్యూస్ ఛానల్స్ ఉంటాయి . కొద్ది మంది సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటల పాటు టివి ఛానల్స్ చూస్తూ ఏ ఛానల్ ఏ పార్టీ వార్తలు ఎంత సమయం చూపిందో జాబితా తయారు చేసేవారు . వారానికి ఒక రోజు ఈ వివరాలు ప్రకటించేవారు . ఓసారి విలేకరుల సమావేశంలో బాబు మీడియా సమయంలో ఛానల్స్ రాజకీయ పార్టీలకు వార్తల్లో కేటాయించిన సమయంపై ఈ వివరాలు చదివి వినిపించారు . టివి వార్తల కోసమే పాలన , రాజకీయాలు చేసేవారు ప్రాముఖ్యత ఇచ్చేది ఇలాంటి వివరాలకే …
ఉమ్మడి రాష్ట్రంలోని సగం ప్రాంతంలో 23 సీట్లకు పరిమితం అయిన తరువాత కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ? వార్తలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిందో లేదో తెలియదు . ఛానల్స్ ది వారి వ్యాపారం వారిది , నిముషాలు , క్షణాలు లెక్కించడం రాష్ట్రాన్ని పాలించిన , పాలించాలి అనుకుంటున్న పార్టీకి ప్రాధాన్యతా అంశం కాకూడదు . ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా క్షణాలు , నిముషాలు లెక్కించడం జరపలేదు .
దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు బిజెపి , ఇతర పక్షాలు రాజీవ్ దర్శన్ గా మారింది అని విమర్శించాయి కానీ , ఎప్పుడూ ఏ పార్టీ కూడా క్షణాలు , నిముషాలు లెక్కించలేదు . న్యూస్ కూడా వ్యాపార వస్తువే ఛానల్స్ కు వారి వ్యాపారం వారికి ముఖ్యం , రాజకీయ పార్టీలు తమకు ఏది ముఖ్యమో దానిపై దృష్టి పెట్టాలి . కుక్క తోకను ఆడించడం , తోక కుక్కను ఆడిచడం కాదు .. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి …… – బుద్దా మురళి
Share this Article