పార్టీలే కాదు, ఆయా పార్టీల బాకాలు కూడా బజారుకెక్కి తన్నుకుంటయ్… తిట్టుకుంటయ్… తెలుగునాట చాలా సహజం… సాక్షిని ఈనాడు, సాక్షిని ఆంధ్రజ్యోతి… ఈనాడు, జ్యోతిలను సాక్షి… నమస్తేను వెలుగు, వెలుగును నమస్తే… నమస్తేను ఆంధ్రజ్యోతి, జ్యోతిని నమస్తే… ఇలా తిట్లదండకాలు నడుస్తూ ఉంటయ్… వార్తను బట్టి, తీసుకున్న పొలిటికల్ ధోరణిని బట్టి…
వీటిల్లో ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి మైకు… అందుకని అవే రంగులు పూసుకుని, బజారులో పడి శిగాలూదుతూ ఉంటయ్… కానీ ఏదైనా సబ్జెక్టు ఉన్నప్పుడు ఎవరి వెర్షన్ వారు వినిపిస్తే ఓ లెక్క… కానీ ప్రతి దానికీ వక్రబాష్యాలు తీస్తూ విమర్శలు చేయడం, తిట్టిపోయడం కరెక్టు కాదు… కానీ నమస్తే తెలంగాణకు ఆ సూత్రాలు గీత్రాలు జాన్తానై… చంద్రబాబు అనే పేరు వినిపిస్తే చాలు తిట్టిపోయడమే…
ఎహె… మా బాబును తిడతారా… అర్థం పర్థం లేకుండా తిట్టడం ఏమిటి..? కాస్త చూసి తిట్టండ్రోయ్ అని ఆంధ్రజ్యోతి తెగబాధపడిపోయింది ఈరోజు… విషయం ఏమిటంటే… మొన్నామధ్య… దూరం కాదులెండి… 20న నమస్తే తెలంగాణ అనే కరపత్రిక చంద్రబాబును ఆడిపోసుకుంది… ఎందుకయ్యా అంటే, అంతకుముందు చంద్రబాబు ఎక్కడో తన కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ… ‘‘ఇంతకుముందు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనేవాళ్లు… ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు, వందెకరాలు కొనే స్థితి వచ్చింది…’’అన్నాడట…
Ads
ఇంకేముంది..? బాబు మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేక, బాబు నమస్తే ఓనర్ కేసీయార్ పాలనను కూడా మెచ్చుకుంటున్నాడని తెలుసుకునే సోయి లేక…. ఓ విమర్శను పబ్లిష్ చేసిపారేసింది… తకరారు బాబు, ఎకరాల ఏడుపు అంటూ… అక్కసు వ్యాఖ్యలు, నొసటితో వెక్కిరింతలు అని దులిపిపారేసింది… నిజానికి నమస్తే ఇక్కడ తన జ్ఞానరాహిత్యాన్ని తనే బయటపెట్టుకుంది… కేసీయార్‌ను మెచ్చుకున్నా తిట్టేయడమేనా..?
అరె, మా చంద్రబాబు చెప్పింది వేరు, కేసీయార్ కరపత్రికకు అర్థమైంది వేరు… తిట్టినా సరే, కాస్త చూసి తిట్టాలి కదా… చంద్రబాబు ఏమన్నాడో, ఆ మాటల పరమార్థం ఏమిటో తెలుసుకునే సోయి కూడా లేకపోతే ఎలా..? అని తను ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికను దులిపేసింది… నిజానికి ఇలాంటి సందర్భాల్లో పత్రికలు తన్నుకునే సిట్యుయేషన్‌లో ఎవరి లైనూ తీసుకోవద్దు మనం… అది బురద… కానీ ఇక్కడ మాత్రం నమస్తే తెలంగాణ వాదన అబ్సర్డ్… ఆంధ్రజ్యోతి వాదనే కరెక్టు… ఐతే నమస్తే తెలంగాణ చంద్రబాబును ఆడిపోసుకుంటే ఆంధ్రజ్యోతికి ఎందుకు నొప్పి..? ఎందుకంటే… చంద్రబాబును ఎవరేమన్నా అది చంద్రబాబును మించి బాధపడుతుంది కాబట్టి…
చంద్రబాబు ఎందుకన్నాడు అలా..? ఏపీలో తన ప్రత్యర్థి జగన్ పాలన బాగా లేదని చెప్పడానికి… ఏపీ ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోవడమే కాదు, ఏపీలో అభివృద్ధి లేక, భూముల విలువలు దారుణంగా పడిపోయాయని చెప్పడానికి…. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనుక్కునే స్థితి నుంచి తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో యాభై ఎకరాలు కొనుక్కునే స్థితిలోకి పడిపోయాం అన్నాడు… దీనికి నమస్తే తెలంగాణ తప్పుపట్టడం దేనికి..? జగన్ పాలన బాగాలేదు, కేసీయార్ పాలన బాగుంది అని పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగానే చెబుతున్నాడు చంద్రబాబు… తన ఓనర్‌ను మెచ్చుకుంటే సహించలేకపోతున్నదా నమస్తే తెలంగాణ..?
ఆధిపత్య ఆభిజాత్యమని ఓ అర్థం కాని పేరు పెట్టి… చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు, ఈ మనిషి బుద్ధి ఎప్పుడూ ఇంతే, పైగా తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చే ఎత్తుగడ అని ఏదేదో రాసుకుంటూ పోయింది… తప్పేముంది..? కేసీయార్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ఏపీలోకి వెళ్తే తప్పులేదు గానీ చంద్రబాబుకు తన పాత పాలనప్రదేశానికి రావాలనే కోరిక ఉండటంలో తప్పేముంది..? ఇప్పుడు చంద్రబాబు పాలనను మించి తెలంగాణకు మేలు జరిగిందేముంది..? ఇప్పటి తెలంగాణ పాలకులంతా ఒకప్పటి తెలుగుదేశం వాళ్లే కదా… అందులో చంద్రబాబుకు దీటైన తెలంగాణద్రోహులు కూడా ఉన్నారు కదా… రాస్తూ పోతే, నమస్తే తెలంగాణ విమర్శల్లోని ఆధిపత్య ఆభిజాత్య డొల్లతనం ఇంకా కనిపిస్తూనే ఉంటుంది… మరి ఆంధ్రజ్యోతిని నొప్పి కలగడంలో ఆశ్చర్యం ఏముంది…!!
Share this Article