Sai Vamshi……. ఏ అవార్డులు ఎవరికి ఎందుకు ఇస్తారు? Disclaimer: ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి కాదు. వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. గమనించగలరు.
1972లో తెలుగులో ‘బడిపంతులు’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వాలని అవార్డుల కమిటీ దాదాపు ఖరారు చేసింది. అయితే అదే సంవత్సరం హిందీలో సంజీవ్‌కుమార్ నటించిన ‘కోషిష్’ సినిమా వచ్చింది. ఆయనకు అవార్డు ఇవ్వాలని మరో యోచన. ‘కోషిష్’ కంటే ‘బడిపంతులు’ ఎక్కడా తక్కువ కాదు. డ్యూయెట్లు, ఫైటింగ్స్ లేని డీగ్లామర్ రోల్. ఎన్టీయార్ కెరీర్లో మేలిమి పాత్ర. సంజీవ్‌కుమార్ నటనా తక్కువది కాదు. కానీ ఒకరికే అవార్డు. ఇలాంటి స్థితి వచ్చినప్పుడు కమిటీలో ఓటింగ్ నిర్వహిస్తారు. అలా ఓటింగ్ నిర్వహించగా ఒక్క ఓటు ఎక్కువ పడి సంజీవ్‌కుమార్‌కి అవార్డు దక్కింది.
1988లో తెలుగులో ‘దాసి’ సినిమా విడుదలైంది. తెలుగు సినీరంగంలో తిరుగులేని క్లాసిక్. జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు అందుకున్న ఏకైక తెలుగు సినిమా. ఉత్తమ నటిగా అర్చనకు జాతీయ అవార్డు ఖరారు చేశారు. అదే సినిమాలో దొర పాత్ర పోషించిన నటుడు, రచయిత భూపాల్‌రెడ్డికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వాలని అనుకున్నారు. అయితే అదే ఏడాది మలయాళం నుంచి ‘పిరవి’ అనే సినిమా వచ్చింది. దర్శకుడు షాజీ.ఎన్.కరున్. అందులో కొడుకును పోగొట్టుకున్న తండ్రి పాత్రలో నటించారు ప్రేమ్‌జీ అనే నటుడు. భూపాల్ రెడ్డి, ప్రేమ్‌జీ.. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అవార్డు? కమిటీ ఆలోచించింది. భూపాల్ రెడ్డి యువకుడు. ప్రయత్నిస్తే మరోసారి అవార్డు రావొచ్చు. ప్రేమ్‌జీ 80 ఏళ్ల వ్యక్తి. ఆ వయసులోనూ ఓపికతో అద్భుతంగా నటించారు. ఆయనకు అవార్డు దక్కడం అవసరం అనుకున్నారు. అవార్డు ప్రేమ్‌జీకి ఖరారైంది.
Ads
1993లో ‘రోజా’ సినిమా విడుదలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎ.ఆర్.రహమాన్ పాటలు అన్ని భాషల్లో మారుమోగాయి. ముఖ్యంగా ‘చిన్ని చిన్ని ఆశ’ పాట. అన్ని భాషల్లోనూ గాయని మిన్మిని ఆ పాట పాడారు. దాన్నే తన చిరునామాగా మార్చుకున్నారు. జాతీయ అవార్డుల్లో తప్పకుండా ఆమెకు అవార్డు వస్తుందని అంతా ఊహించారు. సంగీతం అందించిన రహమాన్‌కి అవార్డు వచ్చింది. పాట రాసిన వైరముత్తుకూ అవార్డు దక్కింది. కానీ జాబితాలో మిన్మిని పేరు లేదు. అదే సంవత్సరం విడుదలైన ‘దేవర్‌మగన్'(క్షత్రియ పుత్రుడు) సినిమాలో గాయని ఎస్.జానకి పాడిన ‘ఇంజి ఇడుప్పళగా'(సన్నజాజి పడకా) పాటకు అవార్డు ఇచ్చారు. “నాకు రావడం ఆనందమే కానీ, ‘చిన్ని చిన్ని ఆశ’ పాట పాడిన మిన్మినికి ఈ అవార్డు ఇచ్చి ఉంటే మరింత సంతోషపడేదాన్ని” అని గాయని ఎస్.జానకి గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
1995లో కన్నడ సినిమా ‘సంగీత సాగర గానయోగి పంచాక్షర గవయ్’, 1996లో తమిళ సినిమా ‘మిన్‌సార కనవు’ సినిమాలకుగానూ వరుసగా రెండు సార్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడి పురస్కారాలు అందుకున్నారు. 1997లో తెలుగులో ‘అన్నమయ్య’ సినిమా వచ్చింది. అందులో ‘అంతర్యామి అలసితి.. సొలసితి’ పాటకు ఆయన ముచ్చటగా మూడోసారి జాతీయ అవార్డు అందుకుంటారని అందరూ ఊహించారు. బాలసుబ్రహ్మణ్యం గారూ అనుకున్నారు. కానీ వరుసగా మూడు సార్లు ఒకే వ్యక్తికి అవార్డు ఇవ్వకూడదనో, మరో కారణమో కానీ, ఆ సంవత్సరం హిందీ సినిమా ‘బార్డర్’లో పాటలు పాడిన హరిహరన్‌కి అవార్డు ఇచ్చారు. ఈ సినిమాకు గానూ తనకు అవార్డు రానందుకు చాలా ఫీలయ్యానని బాలు గారు పలు మార్లు తెలిపారు.
2004లో ఇంద్రగంటి మోహనకృష్ణ గారు తొలి సినిమాగా ‘గ్రహణం’ తీశారు. జాతీయ అవార్డుల కోసం పంపారు. ఆ సంవత్సరం అవార్డుల కమిటీలో నటి వాణిశ్రీ ఉన్నారు. ‘గ్రహణం’ సినిమాకు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి ఇచ్చే ఇందిరాగాంధీ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత వాణిశ్రీ గారు ఈనాడు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గ్రహణం’ సినిమాకు అన్యాయం జరిగిందని అన్నారు. ఆ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులు కూడా రావాల్సి ఉందని, అయితే అవార్డుల్లో లాబీయింగ్ కారణంగా అవి రాలేదన్నారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యల మీద చాలా చర్చ జరిగింది.
2007లో తమిళంలో ‘పరుత్తివీరన్’ సినిమా వచ్చింది. హీరో కార్తీకి తొలి సినిమా. నటి ప్రియమణి. ఇద్దరివీ బలమైన పాత్రలు. ఒకరితో పోటీ పడి మరొకరు నటించారు. అయితే కార్తీని మించి ప్రియమణి తెర మీద విజృంభించారు. ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ నటి పురస్కారం ఆమెకు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఉత్తరాది సభ్యులు అభ్యంతరం తెలిపారు. సినిమాలో హింస చాలా ఎక్కువగా ఉందని అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సభ్యులుగా ఉన్నవారు గట్టిగా నిలబడి, సినిమా కథ అలాంటిదని, అందులో ఆమె నటన చూసి అవార్డు ఇవ్వండి అని చెప్పారు. ఆ తర్వాత అవార్డు కమిటీ ప్రియమణికి ఫోన్ చేసి, ఆ సినిమాకు ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని నిర్ధారించుకున్నాక అవార్డు ఖరారు చేశారు.
.. ‘గాయం’ సినిమాలో అనుకుంటా ఒక సన్నివేశం ఉంటుంది. ‘పాండవ వనవాసం’ సినిమాలో ఎన్టీఆర్ గద పట్టుకుని కూర్చుంటే సినిమా ఏం ఆడుతుంది అంటారు ఉత్తేజ్. పక్కనున్న అతను ‘ఆ సినిమా చాలా బాగా ఆడిందన్నా’ అంటాడు. అప్పుడాయన “గంతేరబయ్! మనోళ్లు ఎప్పుడు ఏ సినిమా హిట్ చేస్తారో ఎవ్వర్ జెప్పలేరు” అంటారు.
అవార్డులు కూడా అంతే అనుకుంటా! ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎవరికి ఇస్తారో ఎవరూ చెప్పలేరు. కొన్ని పరిణామాలు కుదరాలి. కొన్ని లెక్కలు తేలాలి. అందులో ఇమడాలి………. విశీ
Share this Article