Siva Racharla…… YSR the CM… ఆదివారం వీక్ ఎండ్ కామెంట్, దానికి పలువురు మిత్రుల కౌంటర్ , ప్రతి వారం జరిగేదే. అయితే చరిత్రను టచ్ చేసినప్పుడు చదివి ఇట్టే నిరాసక్తంగా దాటుకొని పోలేము. 2004 అంటే సంగతులు మరీ ఒకళ్ళు చెప్తే కానీ తెలుసుకోలేనంత పాత చరిత్రేమీ కాదు. మరో రకంగా జగన్ రూపంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు లైవ్ లో ఉంది.
రాధాకృష్ణ గారు ఏమంటారంటే , 2004 నాటికి రాజశేఖర్ రెడ్డి కన్నా సీనియర్లు కాంగ్రెసులో లేకపోవటం వల్లనే వైస్సార్ సీఎం అయ్యారు అని ఒక వాఖ్య చేశారు . చంద్రబాబు పాలనలో కరెంట్ ఉద్యమం, బషీర్ భాగ్ కాల్పులు, కరువు , కాంగ్రెస్- కమ్యూనిస్టుల ఉమ్మడి పోరు, రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర & బస్సు యాత్ర వెరసి కాంగ్రెస్లో వైస్సార్ తిరుగులేని నాయకుడు అవ్వటం అందరికీ తెలిసిందే. కానీ ఎన్నికలకు ముందు వైెఎస్సార్ ను సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు.
జర్నలిస్ట్ డైరీ సతీష్ గారు పాదయాత్ర జరుగుతున్న లోకేషన్ లోనే కాంగ్రెస్ గెలిస్తే మీరే సీఎం అవుతారా? అని వైస్సార్ ను అడుగుతారు. దానికి వైస్సార్ సీఎం ఎవరు అనేది ఎన్నికల ఫలితాల తరువాత గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది అని సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నకు కొనసాగింపుగా మరి మీ కార్యకర్తలు మీరే సీఎం అంటున్నారని అడగగా కార్యకర్తలకు చాలా అభిలాషలు ఉంటాయి , వాటిని వారి అభిప్రాయాలుగా మాత్రమే చూడాలని వైస్సార్ సమాధానం చెప్పారు.
Ads
2004 నాటికి వైస్సార్ కన్నా సీనియర్లు లేరా?
2004 ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి పునరుద్ధరణ జరిగి 2 ఇయర్స్ అయ్యింది , రాధాకృష్ణ గారు మంచి రైజింగ్ లో ఉండేవారు. వైఎస్సార్ కన్నా సీనియర్లు ఎవరు, సీఎం పదవికి బహిరంగంగా పోటీ పడింది ఎవరు, అంతర్గతంగా ప్రయత్నం చేసింది ఎవరో ఆయనకు బాగా తెలుసు.
కాంగ్రెస్ పాత సాంప్రదాయం ప్రకారం అంజయ్యకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు 2004లో ఎంపీలకు అవకాశం ఇస్తారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా , ముఖ్యంగా వైస్సార్ సీఎం కాకూడదు అని కోరుకునే వాళ్ళు వార్తలు రాశారు ,ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ప్రోగ్రామ్లు చేశారు.
ఎంపీలలో అందరికన్నా ముందున్నది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఖమ్మం ఎంపీగా గెలిచిన రేణుకా చౌదరి నాకేమి తక్కువ నేను ఎందుకు సీఎం కాకుడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు.
మరో వైపు అందరి కన్నా నేనే సీనియర్ అని రామన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి పోటీపడ్డారు. వైఎస్సార్ తో పాటు 1978లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 1994-1999 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసిన పి.జనార్దన్ రెడ్డి సీఎం పదవి మీద బహిరంగంగా మాట్లాడలేదు కానీ మర్రి చెన్నారెడ్డి కొడుకు, సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి శశిధర్ రెడ్డితో కలిసి UPA మిత్రపక్షాలు , ఏఐసీసీ నేతల ద్వారా ప్రయత్నం చేశారు. వెంకట స్వామి గారు , డి.శ్రీనివాస్ గారి లాంటి వాళ్ళు ఏమి ప్రయత్నం చేశారో తెలియదు కానీ డి. శ్రీనివాస్ మీద మాత్రం వైఎస్సార్ వర్గానికి అనుమానం ఉండేది.
సీఎం కావటానికి అధిష్టానం ఆశీస్సులు చాలు
1978-1983 మధ్య నలుగురు సీఎంలను మార్చిన కాంగ్రెస్ రేసులో లేని అంజయ్యను (1978 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి 1980లో ఎంపీగా గెలిచారు ), భవనం వెంకట్రామ్ (ఎమ్మెల్సీ), కోట్ల విజయభాస్కరెడ్డి (ఎంపీ)లను సీఎంలను చేసింది.
1978-1983 మధ్య ఆ ఐదేళ్ల లో జరిగిన తిరుగుబాట్లు, ఫిరాయింపుల నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ 1989లో మాత్రం మొదట మర్రి చెన్నారెడ్డి గారికే సీఎం గా అవకాశం ఇచ్చింది. ఆయన్ను పదవి నుంచి దించి ఎమ్మెల్యేగా ఉన్న నేదురుమల్లి , ఆయన్ను కూడా తప్పించి కోట్లను సీఎం చేసింది. 1994లో చిత్తుగా ఓడిపోయింది.
నేదురుమల్లిని తప్పించి కోట్లను సీఎం చేసినప్పుడు వైఎస్సార్ సీఎం పదవి కోసం గట్టి ప్రయత్నం చేసిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఒక నేత తెర వెనుక గట్టి ప్రయత్నం చేశాడు , ఆయన గురించి అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఆయన సీఎం స్థాయి కాదని ఆ తరువాత ఎప్పుడు హెడ్ లైన్స్ లో లేరు. ఆయన గురించి చెప్పటానికే ఈ పోస్ట్.
రెడ్డివారి చెంగారెడ్డి
ఠక్కున గుర్తొచ్చే పేరు కాదు చెంగారెడ్డి గారిది. “పల్లె రెడ్డి” (బిసి ) అయిన చెంగారెడ్డి చిత్తూరు జిల్లా నగరి నుంచి తొలిసారి 1978లో ఎమ్మెల్యే గా గెలిచారు. ఎమ్మెల్యే కావటానికి ముందు 15 సంవత్సరాలు సర్పంచ్ గా , ఒకసారి పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో ఉండే నగరి ప్రజలకు చెన్నైతో అనుబంధం ఎక్కువ. చెంగారెడ్డి కూడా చెన్నైలో చదువుకున్నారు. వారి వ్యాపారాలు కూడా చెన్నైలో ఉండేవి. ఇప్పుడు కూడా వారి అల్లుడు చెన్నై కేంద్రంగానే వ్యాపారం చేస్తున్నారు. చెంగారెడ్డికి మొదటి నుంచి జి.కే మూపనార్ తో మంచి సంబంధాలు ఉండేవి. 1989-1994 మధ్య సీఎంల మార్పు ప్రక్రియలో కాంగ్రెస్ అధిష్టానం దూత మూపనార్ . ఆయన మద్దతుతో చెంగారెడ్డి సీఎం అవుతారని పత్రికలూ రాశాయి. కానీ పీవీ గారి ఆలోచన వేరుగా ఉండటంతో కోట్ల సీఎం అయ్యారు.
మరో సంగతి కూడా రాయాలి, దీనికి తగిన సాక్ష్యం లేదు. కానీ కాంగ్రెస్ సర్కిల్స్ లో అందరికీ తెలిసిన సంగతే. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తరువాత నాటి నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆయనకు శాసనసభలో ఎదురుపడి , మీరు నాకు థాంక్స్ చెప్పాలి అన్నారంట , నీకెందుకు థాంక్స్ అన్నా అంటే మరి నేను చెంగారెడ్డిని ఓడించకుంటే నీ స్థానంలో ఆయన సీఎం అయ్యేవాడు కదా అని ముద్దు కృష్ణమ నాయుడు అంటే, అవును అన్నా అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారంట . ఇది ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన సంగతి.
దాసరి నారాయణరావు గారి పేరు కూడా సీఎం రేసులో బలంగా వినిపించింది. ఆ తరువాత దాసరి కేంద్ర మంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం కావొచ్చు, సీనియారిటీ, ప్రజా బలం అనేది పెద్ద ప్రామాణికం కాదు అని అనేక మంది సీఎంల ఎంపిక నిరూపించింది. 2004లో సీనియర్లు లేకపోవటం వలనే వైఎస్సార్ సీఎం అయ్యారంటే ఆ పలుకుల్లో వాస్తవం శూన్యం.
నాటి కాంగ్రెస్ ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఎన్నికలకు ముందు అందరు నేతలను కలిపి బస్సు యాత్ర చేయించారు కానీ సీఎం అభ్యర్థి వైఎస్సార్ అనే విధంగా వైఎస్సార్ కు ప్రాధాన్యత ఇచ్చారు.
చెంగారెడ్డి వారసులు
90 సంవత్సరాల చెంగారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కుమార్తె స్వరూప ఇందిర గారు 2014లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఇందిరకు కాదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష్యుడు పోచారెడ్డి రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఒక దశలో చెంగారెడ్డి టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ వారు టీడీపీలో చేరకుండా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు బహిరంగ మద్దతు ఇచ్చారు. కానీ వైసీపీ తరుపున రోజా గెలిచారు.
రాబోయే 2024 ఎన్నికల్లో చెంగారెడ్డి కుమార్తెను వైసీపీలోకి తీసుకొని వచ్చి నగరి టికెట్ ఇప్పించాలని వైసీపీలో బలమైన నేత ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చెంగారెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి వైసీపీలో ఉన్నారు, శ్రీశైల దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు.
సీఎం కావటానికి రహస్య ప్రయత్నాలు
2004లో నేదురుమల్లి వర్గం వైస్సార్ వర్గం సీఎం పదవి కోసం గట్టిగా పట్టుబడితే మధ్యేమార్గంగా తనను సీఎం చేస్తారని ఒక పెద్ద మనిషి అనుకున్నారు. దాని కోసమే తన చిరకాల ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్సార్ తీసుకొచ్చినా ఆయనకు సహకరించారు, ఆయన గాదె వెంకటరెడ్డి.
పర్చూరు నియోజకవర్గం నుంచి 1967లో గాదె వెంకట్ రెడ్డి తొలిసారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ 1991 ఉప ఎన్నికల్లో గెలిచారు. 1994 టీడీపీ గాలిలో కూడా గాదె వెంకట్ రెడ్డి గెలిచారు. 1999 లో ఓడిపోయారు.
2004 ఎన్నికల ముందు దగ్గుబాటి దంపతులను కాంగ్రెసులోకి రావటానికి వారు బాపట్ల ఎంపీ + పర్చూరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని అడిగారు. దగ్గుబాటి కుటుంబం కాంగ్రెస్లో చేరటంలో గాదె వెంకట్ రెడ్డి కూడా కీలకం. దగ్గుపాటి వెంకటేశ్వర రావు గారు పర్చూరు తనకు వదిలేసి చీరాల నుంచి పోటీ చేస్తారని ఆయన భావించారు. దీనికి ప్రధాన కారణం 1999 ఎన్నికల్లో రోశయ్య గారు చీరాలను వదిలి తెనాలి నుంచి పోటీ చేసి ఉండటం.
2004లో కూడా రోశయ్య గారు తెనాలి నుంచి పోటీ చేస్తే చీరాల నుంచి దగ్గుబాటి, పర్చూరు నుంచి తానూ పోటీ చేయొచ్చని గాదె వెంకట్ రెడ్డి భావించారు కానీ రోశయ్య చీరాల అడగటంతో లెక్కలు మారిపోయాయి. చివరికి గాదె వెంకట్ రెడ్డి బాపట్ల నుంచి పోటీ చేసి గెలిచారు.
ఫలితాల తరువాత ఎవరు సీఎం అనే వాదన లేకుండా వైఎస్సార్ వైపు అధిష్టానం మొగ్గు చూపటంతో గాదె సైలెంట్ అయ్యారు. వైఎస్సార్ కు గాదెకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. మంత్రి పదవి కూడా ఇచ్చారు.
డిఎల్ రవీంద్రారెడ్డి గురించి కూడా ఒక మాట చెప్పాలి. 1993లో నేదురుమల్లిని పదవి నుంచి దించిన తరువాత కోట్ల ఎంపిక అంత సులభంగా ఏమి జరగలేదు. వైఎస్సార్ సీఎం పదవి కోసం పట్టుబట్టడం, ఆయనకు ఎమ్మెల్యేలలో మంచి మద్దతు ఉండటంతో పీవీ గారు సీఎం ఎంపికలో అందరితో మాట్లాడారు. వైఎస్సార్ వర్గం తరుపున డిఎల్ రవీంద్రారెడ్డి ఎక్కువగా ఢిల్లీకి వెళ్లేవారు. ఒక దశలో ఈ ఇద్దరు రెడ్లను ఒప్పించుకొనిరా, నిన్నే సీఎం చేస్తానని పీవీ అన్నారని డిఎల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ విధంగా కాంగ్రెస్ సీఎం ఎంపికకు పెద్ద కొలమానాలు ఏమి లేవు. అధికారంలో లేనప్పుడు ప్రజాబలం ఉన్న నేతలను ప్రోత్సహిస్తుంది, అధికారం వచ్చిన తరువాత అంతా లాబీయింగ్. కాకుంటే 2015 తరువాత ఈ పరిస్థితిలో కొంత మార్పు ఉంది ఒక్క పంజాబ్ లో మాత్రం తమ పాత పద్దతిలోనే వెళ్లి ఓడిపోయారు.
కాంగ్రెస్లో జస్ట్ మిస్ సీఎంలు చాలా మందే ఉన్నారు. వీరిలో కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి ముఖ్యులు. పి.శివ శంకర్ గారు, జానారెడ్డి గారు , పల్లంరాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు , చిరంజీవి గారు,ఆనం రామనారాయణ రెడ్డి అందరి పేర్లు ఏదో ఒక దశలో సీఎం పదవికి పరిశీలనకు వచ్చినవే. రాధాకృష్ణ తన కొత్తపలుకుల్లో కొత్త ఆలోచనలు చెప్పొచ్చు, కానీ చరిత్ర మారదు .
Share this Article