ఇంట్రస్టింగ్… తమిళనాడులో ఒకాయన ఉద్యోగం కోసం అరబ్ కంట్రీస్ వెళ్లాడు… తినీతినకుండా, పొదుపు చేసుకుంటూ తన జీతం నుంచి ఎప్పటికప్పుడు ఇంటికి డబ్బు పంపించేవాడు… భార్య ఆ డబ్బుతో కొన్ని ఆస్తులు కొన్నది… ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ… ఇక్కడి వరకూ కథ సజావుగానే సాగింది…
తను ఇండియాకు తిరిగి వచ్చాడు… ఆమెతో సంబంధాలు దెబ్బతిన్నాయి… ఆ ఆస్తుల్లో నా వాటా నాకు కావాలంటుంది ఆమె… నో, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది, తన డబ్బులతో సుఖజీవనం గడిపింది, ఆమె పేరిట కొనుగోలు చేసినా సరే ఆ ఆస్తులతో నిజానికి ఆమెకేం సంబంధం లేదు, అవన్నీ తను చెమట చిందించి సమకూర్చుకున్న ఆస్తులు కాబట్టి ఆమెకు వాటిల్లో ఏ హక్కూ లేదంటాడు ఆయన… నీ కొలువు కోసం మావాళ్లు ఇచ్చిన తాతల్నాటి ఆస్తులు అమ్మాను, పైసా పైసా జమచేసి ఆ ఆస్తుల్ని కొన్నాం… ఆ ఆస్తుల్లో నాకూ సమాన వాటా ఉంది అని ఆమె వాదన… వ్యవహారం కోర్టుకెక్కింది…
హైకోర్టు దాకా వచ్చింది కేసు… ఈలోపు ఆయన చనిపోయాడు… పిల్లలు ఈ కేసులో తల్లి మీద కొట్లాడుతున్నారు… పోయిన వారం మద్రాస్ హైకోర్టు ఓ తీర్పు వెలువరించింది… ఆ ఆస్తుల్లో సగం వాటా ఆమెకే చెందుతుందని చెప్పింది… అంతేకాదు, లాకర్లలో ఉన్న నగలు, ఇతర విలువైనవి కూడా ఆమెకే చెందుతాయనీ, ఆమె కోసమే వాటిని కొనుగోలు చేశారు కాబట్టి వాటిపై పూర్తి హక్కు భార్యదేనని క్లారిటీ ఇచ్చింది… జస్టిస్ కృష్ణన్ రామసామి తన తీర్పులో ఏమంటాడంటే…
Ads
‘‘భార్యగా ఉండటం అంటే 8 గంటల కొలువు కాదు… 24 గంటల డ్యూటీ… తల్లిగా బాధ్యతలు చూసుకుంటూ, డబ్బు వ్యవహారాలు చక్కబెడుతూ, జాగ్రత్తగా వ్యవహరించింది కాబట్టే భర్త అక్కడ సౌదీలో నిమ్మళంగా తన కొలువు చేసుకుని నాలుగు రాళ్లు సంపాదించాడు… అందుకని భార్య పాత్ర లేదు, హక్కు లేదు అంటే ఎలా..? సంసారం అంటే రెండెడ్ల బండి… సో, తను సంపాదించిన ఆస్తుల్ని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఉమ్మడి సంపాదనలాగే పరిగణించాలి ఒకరకంగా…’’
‘‘నువ్వు అక్కడ కొలువు చేసుకున్నవ్… నేనేమో ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ, టైలరింగ్, ట్యూషన్లతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను… నేనిక్కడ సజావుగా ఇంటి బాధ్యతలు నిర్వహించకపోతే నువ్వు అక్కడ నిమ్మళంగా కొలువు చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాడివా..? సో, ఆ ఆస్తుల్లో నాకూ వాటా కావాలి…’’ అంటుంది ఆమె… దిగువ కోర్టులు ఆమె వాదనను కొట్టేశాయి… దీంతో వ్యవహారం పైకోర్టు దాకా వచ్చింది… ఈ ఇంట్రస్టింగ్ తీర్పు వచ్చింది…
తండ్రి మరణించాక ఆ పిల్లలు కూడా… ఆ ఆస్తులు మా నాన్న సంపాదించినవి, వాటిని చట్టపరమైన వారసులం మేమే… ఎవరికీ ఏ హక్కూ ఉండదంటూ హైకోర్టులో వాదించారు… తండ్రి సంపాదనలో తల్లికి పైసా కూడా ఆశించే హక్కు లేదంటారు వాళ్లు… ‘‘ఓ గృహిణిగా, ఓ తల్లిగా, ఓ భార్యగా ఆమె నిరంతరం కష్టపడి, భర్తకు తోడుగా నిలిచి, ఆ ఆస్తుల సంపాదనకు పరోక్షంగా కారణమైన ఆమెకు అసలు ఆ ఆస్తుల్లో వాటా లేదంటే ఇక ఆమె కష్టానికి, త్యాగానికి విలువ ఏమున్నట్టు..? సో, ఆమెకు సగం వాటా దక్కాల్సిందే అనేది హైకోర్టు తీర్పు సారాంశం…
Share this Article