జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ ….
అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే
జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
Ads
———————————-
బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం … అక్కడ లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పొలిట్ బ్యూరోతో పాటు కీలక నేతల ముఖ్య సమావేశం జరుగుతోంది . మీడియా ఆ ఇంటి ఆవరణలో బయటే ఉంది . లోపల మాట్లాడే మాటలు కొంచెం వినిపిస్తున్నాయి . అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన నాయకుడు ఒకరు ఎన్నికల వ్యూహాలు , ఎలా విజయం సాధించాలి అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నారు .
అది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సమావేశం . ఆ కొత్త పార్టీ తరపున అప్పటి వరకు గెలిచింది అతనొక్కడే కాబట్టి గెలుపు వ్యూహాలు చెబుతున్నాడు . ఎలాంటి పార్టీ ఎలా అయిపొయింది అనిపించింది . దేశ రాజకీయాలను శాసించే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ , ఒంటి చేత్తో కాంగ్రెస్ ను ఓడించి సీఎం అయిన ఎన్టీఆర్ నివాసం . జాతీయ నాయకులు , రాష్ట్రనాయకులు పడిగాపులు కాసిన ఇల్లు . ఎలా అయిపొయింది? . అనిపించింది . ఏదీ శాశ్వతం కాదు …
******
సినిమా రంగాన్ని వదిలి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జనం తండోపతండాలుగా ఆయన వెంట నడిచారు . ఇసుక వేస్తే రాలనంత జనం అనే వార్త ఎన్టీఆర్ సభలకు సర్వ సాధారణం అయింది . ముందుగా ప్రకటించిన ప్రాంతానికి 24 గంటలు ఆలస్యం అయినా జనం అలానే ఎదురు చూస్తూ రోడ్డు మీదనే ఉండిపోయిన సందర్భాలు అనేకం . అలాంటి ఎన్టీఆర్ జనం కోసం ఓసారి చాలాసేపు ఎదురు చూశారు . ఎదురు చూసినా జనం రాకపోవడంతో చైతన్య రథంలోనే భోజనం కానిచ్చారు . అప్పటికి చాలా కొద్ది మంది వస్తే వారిని ఉద్దేశించి మాట్లాడారు .
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చారు . ఇది అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ ఒక పార్టీ మాత్రమే పెట్టలేదు . రెండు పార్టీలు పెట్టారు . అన్నగారు పెట్టిన రెండో పార్టీ నుంచి వదిన ఒక్కరే గెలవడం విశేషం . ఎన్టీఆర్ గురించి రాసేటప్పుడు , చెప్పేటప్పుడు తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం గురించే చెబుతారు కానీ , అట్టర్ ప్లాప్ అయిన రెండో పార్టీ గురించి చెప్పరు . జనం కోసం ఎన్టీఆర్ ఎదురు చూడడమే కాదు స్వయంగా ఎన్టీఆర్ ను జనం ఓడించారు . ఈ రెండూ తెలంగాణలోనే జరిగాయి .
****
ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించేటప్పుడు తొలిసారి సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లో దర్గా వద్ద బట్టల షాప్ లో విరాళం అడుగుతున్నప్పుడు చూశా .. 1982లో టీడీపీ పెట్టినప్పుడు రామకృష్ణ స్టూడియోలో జిల్లాల వారీగా సమావేశాలు. నేను పదవ తరగతి విద్యార్థిని… కరీంనగర్ జిల్లాకు చెందిన క్లాస్‌మేట్ ఒకరు ఈ రోజు మా జిల్లా మీటింగ్ ఉంది . తెలిసిన వాళ్ళు వస్తారు అంటే అతనితో పాటు వెళ్ళాను .
మార్వాడీలు వేసుకునే గద్దె పరుపు దానిపై ఎన్టీఆర్ , నాదెండ్ల కూర్చున్నారు . ఒక ఫోటో గ్రాఫర్ ఫోటో తీస్తే ఎన్టీఆర్ కనులతోనే గద్దించారు . నాదెండ్ల సర్ది చెప్పారు . సాధారణంగా సినిమా వారికి గ్లామర్ ముఖ్యం . ఎలా పడితే అలా ఫోటో తీస్తే ఒప్పుకోరు . ఇది రాజకీయ మీటింగ్ అని నాదెండ్ల సర్ది చెప్పి ఉంటారు .
1989 ఎన్నికల ప్రచారం . గజ్వేల్ లో ఎన్టీఆర్ బహిరంగ సభ కావడంతో అప్పుడు మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ను, సంగారెడ్డి నుంచి ఎన్టీఆర్ న్యూస్ కవరేజ్ కోసం గజ్వేల్ వెళ్ళాను . విశాలమైన మైదానంలో సభ కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు . చైతన్య రథంపై ఎన్టీఆర్ వస్తే మీడియా తప్ప ఎవరూ లేరు . ఏమైందో అర్థం కాలేదు . ఎన్టీఆర్ వస్తున్నారు అంటే పొలం పనులు కూడా వదిలేసి రోడ్డు మీదకు జనం పరిగెత్తుకు వచ్చిన వార్తలు బోలెడు చదివి ఉండడంతో ఆ దృశ్యం అర్థం కాలేదు .
ప్రకాశం జిల్లాకు చెందిన సంజీవరావు గజ్వేల్ నుంచి టీడీపీ శాసన సభ్యులు . 89లో కూడా ఆయనకే టికెట్ రావడంతో పోటీ చేస్తున్నాడు . ఇప్పుడున్నంత మీడియా హడావుడి అప్పుడు లేదు . నలుగురైదుగు తప్ప మీడియా పెద్దగా ఉండదు . జనం లేకపోవడంతో సంజీవరావును ఎన్టీఆర్ చైతన్య రథంలోకి పిలిచారు . కొంత సేపటి తరువాత రావచ్చులే అని చైతన్య రథంలో నిరీక్షించి , అక్కడే భోజనం చేశారు . ఎన్టీఆర్ మాట్లాడే సమయంలో కూడా గ్రౌండ్ ఖాళీగానే ఉంది .
ఈ సభతో 89 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం అయింది . గజ్వేల్ ఖాళీ గ్రౌండ్ , ఎన్టీఆర్ ఉపన్యాసం , బ్యారికేడ్లు ఇవన్నీ వచ్చేట్టుగా అప్పుడు నేను తీసిన ఫోటో భూమి , క్రానికల్ లో మొదటి పేజీలో వచ్చింది . అంతకు ముందు భువనగిరిలో భారీ బహిరంగ సభ అని ప్రచారం చేసినా జనం అంతంత మాత్రంగానే వచ్చారు . ఐతే గజ్వేల్ సభలో స్వయంగా జనం కోసం ఎన్టీఆర్ నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అర్థం అయింది . జనం పొలం పనుల్లో ఉండడం వల్ల రాలేక పోయారు అని సంజీవరావు వివరణ ఇచ్చారు .
ఇక్కడి నుంచే 89 ఎన్నికల్లో గీతారెడ్డి సంజీవరావుపై విజయం సాధించారు . ఇందిరాగాంధీలా తలపై చీర కొంగు కప్పుకొని ఆమె సాగించిన ప్రచారం ఫొటోలతో లోకల్ మీడియాను ఆక్రమించేశారు . 89 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు . అదే దాస్ బాబు నాయకత్వంలోని టీడీపీలో చేరారు . ఎన్టీఆర్ ను ఎన్నికల్లో ఓడించిన చిత్తరంజన్ దాస్ , వెన్నుపోటుతో ఓడించిన బాబు ఒకే గూటికి చేరారు అని అప్పుడు జోకులు వినిపించేవి .
అంతకు ముందు పిసిసి అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు . అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మొదటిసారి కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు . 180 + సీట్లు ( 182 నో లేక 183 ) వస్తాయని చెప్పారు . ఆయన చెప్పినట్టే ఒకటో రెండో సీట్ల తేడాతో ఆ జోస్యం నిజమైంది .
****
వెన్నుపోటులో బాబు చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు . న్యాయ పోరాటంలోనూ పరాజయం ఎదురయ్యాక తన వద్ద ఉన్న దాదాపు 30 మంది శాసన సభ్యులతో కలిసి ఎన్టీఆర్ 1996 లో కొత్త పార్టీ పెట్టారు . ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీ పెట్టి సింహం గుర్తుతో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు . తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు .
ఎన్టీఆర్ సినిమా నటునిగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్లిన యాత్రికులు చాలా మంది అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ను చూసే వారు . ఎన్టీఆర్ ను దించేశాక అదే తరహాలో పెద్ద సంఖ్యలో జనం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి చూసి వెళ్లేవారు . అక్కడో జాతరలా ఉండేది . 96 పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎన్టీఆర్ మరణించారు. చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టు అయింది . పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎన్టీఆర్ బతికి ఉంటే రాజకీయాలు ఎలా ఉండేవో . ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా ఓడిపోయారు . ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ ఎన్టీఆర్ టీడీపీ తరుపున శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయారు .
ఎన్టీఆర్ టీడీపీ తరపున ఒకే ఒకరు గెలిచారు . ఉప ఎన్నికల్లో పాత పట్నం నుంచి నందమూరి లక్ష్మీ పార్వతి గెలిచారు . తరువాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు . ఒక్కరు కూడా గెలువ లేదు . ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడు ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని విమర్శించేవారు . అలాంటి ఎన్టీఆర్ రెండు పార్టీలు పెడితే , కుమారుడు ఓ పార్టీ పెట్టారు .
అన్న టీడీపీ , అల్లుడు టీడీపీ , కుమారుడు టీడీపీ , వదిన టీడీపీ ఎన్ని బంధుత్వాలు ఉంటాయో అన్ని టీడీపీలు . వైస్‌రాయ్ క్యాంపు బాగా పాపులర్ కానీ ఎన్టీఆర్ కూడా ఓ క్యాంపు నడిపారు అది పెద్దగా పాపులర్ కాలేదు . 30 మంది శాసన సభ్యులతో గోల్కొండ హోటల్ క్యాంపు నడిపారు . విజయాలనే కాదు పరాజయాలను కూడా గుర్తు చేసుకోవాలి . సినిమాలు , జీవితాన్ని మించిన మలుపులు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నాయి …….. బుద్దా మురళి ..
Share this Article