వోటర్లను ప్రలోభపెట్టడానికి రకరకాల ఉచిత పథకాలు పెట్టేసి, తోచిన ప్రతి అంశాన్ని సాధ్యాసాధ్యాల అధ్యయనం లేకుండానే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేసి… తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లూ పడటం లేదంటే కోతలు పెట్టడం, నామమాత్రంగా అమలు చేయడం ప్రతి పార్టీకి అలవాటైంది… అసలు ప్రతి పార్టీ ప్రాథమిక ఎజెండాయే ప్రజల్ని మోసగించడం కదా… ఇప్పుడు తమ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం కిందామీదా పడుతోంది…
బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం అమలు ఎలా ఏడ్చిందో చూస్తున్నాం, చదువుతున్నాం… మొత్తం ప్రజారవాణా వ్యవస్థను ఈ పథకం డిస్టర్బ్ చేసింది… ఇంకా 200 యూనిట్ల కరెంటు వంటి హామీలపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది… నోటికొచ్చిన ప్రతి పథకాన్ని ప్రకటించి, ఇప్పుడు తలలు పట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు… మరో హామీ సంగతి చూద్దాం… అది రేషన్ బియ్యం…
అన్నభాగ్య పథకం… కేంద్ర సర్కారు ఆహారభద్రత చట్టం కింద అయిదేసి కిలోలు ఇస్తోంది… దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదేసి కిలోలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది… అంటే ఒక్కో కుటుంబ సభ్యుడికి పది కిలోలు… తీరా దీని అమలు దగ్గరకొచ్చేసరికి మల్లగుల్లాలు పడుతోంది… సరిపడా బియ్యం ఎఫ్సీఐ, ఇతర రాష్ట్రాల ఆహార సంస్థల దగ్గర లేకపోవడంతో, ఇక బియ్యానికి బదులు నగదు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని కర్నాటక కేబినెట్ తీర్మానించింది…
Ads
నిజానికి అలవిమాలిన వాగ్దానాలు చేసి, వోట్లు దండుకుని, ఇక వాటి అమలుకు నానా అగచాట్లు పడుతున్న కాంగ్రెస్ ధోరణిని నిందించాలి… పెరుగుతున్న ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను తల్లకిందులు చేయడం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమనే అనాలి… వోట్ల కోసం పార్టీలు ఏ పనైనా చేస్తాయి… ఐతే ఇక్కడ బియ్యానికి బదులు నగదు అనే నిర్ణయాన్ని మరో కోణంలో అభినందించాలి… ఎందుకంటే..?
చాలామంది బియ్యం తీసుకోవడం లేదు… రేషన్ డీలర్లు కూడా అమ్మేసుకుంటున్నారు… లబ్ధిదారుల్లో ఎవరైనా బియ్యం తీసుకున్నా సరే, వాళ్లూ అమ్ముకుంటున్నారు… ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రతి రాష్ట్రంలోనూ అవినీతిమయం చేసేశారు… రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, కొత్త బ్యాగుల్లో నింపి మళ్లీ ఎఫ్సీఐకి లెవీ పెడుతున్న సంగతి బహిరంగమే… ఇదొక సైకిల్… మళ్లీ ఆ బియ్యమే ప్రజాపంపిణీ వ్యవస్థలోకి వస్తాయి…
ఇప్పుడు నగదు ఇస్తే… బియ్యం పేరిట జరిగే అక్రమాలు జరగకుండా అడ్డుకున్నట్టే ఒకరకంగా… ఆహార భద్రత అనే కోణంలో పరిశీలించినా కేంద్ర సర్కారు ఇచ్చే బియ్యం ఎలాగూ అయిదేసి కిలోల చొప్పున వస్తాయి… ఎటొచ్చీ కర్నాటక ప్రభుత్వం మాత్రం నగదు ఇస్తుంది… సపోజ్, ఇంట్లో అయిదుగురు ఉంటే, కిలోకు 34 చొప్పున… 850 రూపాయల్ని లబ్ధిదారుడి ఖాతాలోకి వేస్తారన్నమాట… డీబీటీ పద్ధతిని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకంలోకి తీసుకొస్తున్నారు… ఇదీ అలాంటిదే…
అబ్బే, నగదు ఇస్తే ఇతర అవసరాలకు వెచ్చిస్తారు… బియ్యం ఇవ్వడమనే సంకల్పానికే దెబ్బ అంటారా..? కాదు… అదే ధరకు ఓ మోస్తరు బియ్యం ఓపెన్ మార్కెట్‌లో దొరుకుతాయి, లేదంటే ఇతరత్రా కుటుంబ అవసరాలకూ ఆ నగదు ఉపయోగపడుతుంది… కుటుంబ యజమానులు తాగి తగలేస్తారు అంటారా..? అదెప్పుడూ ఉండేదే…!! ఆ డబ్బును గృహిణుల ఖాతాల్లో వేయడం బెటర్…!!
Share this Article