Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డియర్ చిరంజీవి… పేరు విరిచేశావ్, బీజాక్షరాలకూ విధివిధానాలున్నయ్…

July 2, 2023 by M S R

Privilege  for Name:
“పేరిడి నిను పెంచిన వారెవరే?

వారిని చూపవే! శ్రీరామయ్యా!
సార సారతర తారకనామమును పేరిడి…”
రాముడికి పేరుపెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య కీర్తించాడు.

“త్వయైక తారితాయోధ్య,
నామ్నాతు భువనత్రయం”
రామా! నువ్వు ఒక్క అయోధ్యనే పాలించావు. నీ పేరు ముల్లోకాలను రక్షించి, పాలిస్తోంది. నీకంటే నీ పేరే గొప్పది- అని హనుమంతుడు రాముడితోనే అన్నాడు.

కృష్ణుడికి ఆ పేరు పెట్టినవాడు గర్గ మహాముని. నందవ్రజానికి గర్గుడు ఈ నామకరణం కోసం వెళ్లినప్పుడే…నందుడు అన్న మాటను
“ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా !”
అని పోతన తెలుగు పద్యంలో రికార్డ్ చేశాడు. తరువాత “ఊరకరారు…” అన్న మాట తెలుగు భాషకు ఒక వాడుక మాట అయ్యింది.

Ads

పురాణాల్లో అవతారపురుషులకు పేర్లు పెట్టడానికి ఋషులు తపస్సు చేసి…పుణ్యం మూటగట్టుకుని పుట్టేవారు. ఇప్పుడు మనకు రుషుల అవసరమే రాదు. ఉన్నా ఉపయోగించుకోము.

ఈరోజుల్లో-
ముద్దులు మూట కట్టినట్లున్న ఒక పాపకు తల్లిదండ్రులు పరవశించి పెట్టుకున్న పేరు- అనాయ!

విహంగమై గగనంలో ఎగురుతుందనుకుని మరొక జంట తమ గారాల పట్టికి పెట్టుకున్న పేరు- విహాయ!

తమ బిడ్డ పెదవుల మీద ఎప్పటికీ చిరునవ్వు చెరిగిపోదనుకుని ఒక జంట నవ్వుతూ నామకరణం చేసిన తెలుగుపేరు- సుహాయ!

ఇప్పుడందరూ ట్రెండీగా ఉన్న పేర్లకోసం చేయని ప్రయత్నం లేదు.

సరళ అని పేరున్న మహిళ చాలా కఠినంగా ఉండవచ్చు. హిమాంషు అన్నవాడు ఎప్పుడూ నిప్పులుగక్కుతూ చిటపటలాడుతుండవచ్చు. ధవళ్ పెద్దయ్యాక సింగరేణి బొగ్గు కంటే నలుపెక్కవచ్చు. నరసింహ గ్రామసింహానికే బెదిరిపోవచ్చు. శారద పదో క్లాసు మెట్లయినా తొక్కకపోవచ్చు. వీణ గొంతెత్తితే చెవుల్లో రక్తం కారవచ్చు.

నారాయణ, గోవిందా, దుర్గ, లక్ష్మి, ఉమ…అన్న పేర్లు పెడితే…పదే పదే ఆ పేరు పెట్టి పిలిచినందువల్ల నామోచ్చారణ పుణ్యం మన అకౌంట్లో పడుతుందని మన పోతన అజామిళోపాఖ్యానంలో అంటాడు.

తెలుగు నేల మీద పురాణ ప్రవచనాన్ని ఒక యజ్ఞంలా పవిత్రీకరించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పోతన భాగవతంలో అజామీళుడి గురించి చెబుతూ-  “ఖ్యాతి, హవ్య, కవ్య లాంటి ఎవరూ పెట్టుకోని పేర్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. చిత్రాతి, చిత్రమయిన; పలకడానికి నోరు తిరగని పేర్లు పెట్టి…లలితా సహస్రంలో ఈ మాటకు మూలం ఉందట కదా? అని మాలాంటి వారికి నామ జ్ఞాన బోధ చేస్తూ ఉంటారు. శతాబ్దాల క్రితం పోతన, కేతన, సోమన్న అని తెలుగు పేర్లు పెట్టుకునేవారు. తరువాత హాయిగా రామా, కృష్ణ అని దేవుడి పేర్లు పెట్టుకునేవారు. వంశంలో తాత ముత్తాతల; అవ్వ ముత్తవ్వల పేర్లు పెట్టుకునేవారు. ఇప్పుడు పెట్టుకునే పేర్లకు అర్థం ఉండదు. తెలిసినా చెబితే బాగోదు” అని అన్నారు.

చిరంజీవి కొణిదెల తాత హోదాలో తన మనవరాలి సంస్కృతం పేరును ఇంగ్లీషులో లోకానికి ప్రకటించగానే… “Klin Kaara Konidela (క్లీన్ కార కొణిదెల)” అంటే అర్థమేమిటని భాషాభిమానులు, చిరంజీవి అభిమానులు, సాధారణ ఔత్సాహికులు గూగులమ్మను అడగడం మొదలుపెట్టారు. తెలిసిన పండితులను అడగడం మొదలుపెట్టారు. క్లిన్ కార, క్లీన్ కారా…అని ఏవేవో ఊహించి అర్థం కాక తలపట్టుకున్నారు.

లలితాసహస్రనామాల్లో ఉన్న అమ్మవారి పేరును యథాతథంగా తీసుకుని “క్లీన్ కార” అని పెట్టినట్లు… Taken from the Lalitha Sahasranamam .. the name ‘Klin Kaara’ .. signifies a transformative purifying energy that brings about a spiritual awakening! “పవిత్రీకరించిన శక్తి ఆధ్యాత్మిక చైతన్యాన్ని తట్టిలేపే,  పరివర్తన కు దారి చూపే” అనే అర్థం వస్తుందని చిరంజీవి ఇంగ్లీషులోనే వివరణ ఇచ్చుకున్నారు కాబట్టి…అర్థం కోసం అన్వేషణకు ఫుల్ స్టాప్ పడింది.

అంత మంచి దేవీ మంత్ర సంస్కృత బీజాక్షరంతో నామకరణం చేసిన చిరంజీవి ఇంగ్లీషులో Klin Kaara- క్లీన్ కార అని అక్షర దోషంతో, పదాన్ని విరవకుండా- klimKaara అని ఇంగ్లీషులో ఇచ్చి సంస్కృతంలోనో, హిందీలోనో కనీసం తెలుగులోనో “క్లీంకార” అని ఉంటే సరిపోయేది. ఈ మాటకు ఇంగ్లీషులో ఎన్ రాదు. ఎం రావాలి.

ఉప-కార; సహ-కార అని రెండు పదాలుగా విరిగి ఉండదు. అది ఉపకార, సహకార అని కలిసి ఉంటేనే అర్థం. ‘కార’ ప్రత్యయం కాబట్టి దానికి విడిగా పద యోగ్యత ఉండదు. అలా క్లీం- కార విరిగి ఉండదు. “క్లీంకార” అని కలిపే ఉండాలి.

తెలుగులో అయితే ఎలా రాయాలో…ఎలా పలకాలో…కూడా పది సెకన్ల వీడియో ఒకటి విడుదల చేసి ఉంటే…పాలకు పాలు…నీళ్లకు నీళ్లలా అంతా స్పష్టంగా అర్థమై ఉండేదేమో! ఎందుకంటే- లోకంలో మంత్ర బీజాక్షరాలను రాయడానికి…పలకడానికి కొన్ని విధి, నిషేధాలున్నట్లు భయభక్తులున్నాయి!

కొసమెరుపు:-
సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు భాషా శాస్త్రవేత్తలు; శ్రీ విద్యా ఉపాసకులు; మంత్రశాస్త్ర రహస్యాలు తెలిసిన పండితులకు “Klin Kaara” చేతి నిండా పని పెట్టింది. చూడబోతే-“పవిత్రీకరించిన శక్తి ఆధ్యాత్మిక చైతన్యాన్ని తట్టిలేపినట్లే” ఉంది!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions