దైనిక్ భాస్కర్… సర్క్యులేషన్‌లో దేశంలోనే నెంబర్ వన్ డెయిలీ పేపర్… సో, ప్రతి అక్షరాన్ని ఆచితూచి పబ్లిష్ చేయాలి కదా… కానీ అదీ యూట్యూబ్ గొట్టాల్లాగే వ్యవహరిస్తోంది… అందుకని అది ప్రచురించిన ఓ నిర్లక్ష్యపు వార్తపై మద్రాస్ హైకోర్టు ముక్కచీవాట్లు, అనగా కుక్కతిట్లు పెట్టింది… ఏదిపడితే అది రాసేస్తాం, మమ్మల్ని అనడానికి ఎవరికెంత ధైర్యం అనే పిచ్చి భరోసాలో గనుక బతుకుతున్నట్టయితే తెలుగు పత్రికలకూ ఇలాంటి వాతలు తప్పవేమో…
విషయంలోకి వస్తే… దైనిక్ భాస్కర్ ఈమధ్య ఓ వార్త ప్రచురించింది… బీహార్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయి, చంపబడుతున్నారు, హిందీ మాట్లాడటమే కారణమనేది ఆ వార్త సారాంశం… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమిళనాడులో నివసించే లక్షలాది మందిలో సదరు వార్త భయాందోళనల్ని క్రియేట్ చేసింది… సహజమే కదా, తమ ప్రాంతాలు విడిచి, పొట్ట చేత్తో పట్టుకుని వలస వచ్చిన వాళ్లకు ఇది ఆందోళన కలిగించేదే…
అర్జెంటుగా తమ భాషను మార్చుకోలేరు, మర్చిపోలేరు, నిజంగానే తమిళనాడు హిందీకి ప్రబల వ్యతిరేకి… దాంతో ఈ వార్త నిజమేననే ప్రచారం వ్యాప్తి చెందింది… మీడియా అంటే భయంతో వణికిపోయే ప్రభుత్వం కాదు కదా… ఆ పత్రిక మీద తిరుప్పూర్ నార్త్, తిరునందర్వూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు దాఖలు చేశారు… పత్రిక డిజిటల్ విభాగానికి చెందిన ఎడిటర్ ప్రసూన్ మిశ్రా మీద ఐపీసీ సెక్షన్ 153 ఎ, 501 (1) (బి), మరియు 505 (2) కింద అభియోగాలు మోపారు…
Ads
తమకు తమిళనాడు నుండి రిపోర్టింగ్ చేసే విజయ్ సింగ్ బాఘెల్ నలుగురైదుగురిని ఇంటర్వ్యూ చేసి, ఆ ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ వార్త ఫైల్ చేశాడనీ, రిపోర్టర్ మీద నమ్మకంతో ఆ వార్త ప్రచురించామని ప్రసూన్ మిశ్రా కోర్టులో వాదించాడు… తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శైలేంద్ర బాబు ఓ సర్క్యులర్ జారీ చేసిన తర్వాత సదరు వార్తను నెట్ నుంచి తొలగించినట్లు మిశ్రా చెప్పుకొచ్చాడు… వలస కార్మికులను భయాందోళనలకు గురిచేయడం లేదా వారికి మరియు తమిళ ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచే ఉద్దేశం తనకు లేదని అన్నాడు…
నిజానికి పత్రికలో గానీ, పత్రికకు సంబంధించిన వెబ్‌సైట్‌లో గానీ ఏ అక్షరం పబ్లిషైనా సరే సదరు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది… వాళ్లెవరో రిపోర్ట్ చేశారు, ఇంకెవరో ఆరోపించారు అని సాకులు చెబితే కుదరదు… పబ్లిషయ్యే మొత్తం కంటెంట్‌కు మేనేజ్‌మెంటే జవాబుదారీ… సో, హైకోర్టు సదరు పత్రిక సమర్థించుకునే వాదనను తోసిపుచ్చింది… ముక్క చీవాట్లు పెట్టింది… జస్టిస్ ఎ.డి.జగదీశ్ ఏమంటారంటే…
‘‘వార్తల ఖచ్చితత్వాన్ని ధృవీకరించుకోకుండా, విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వార్తల్ని పబ్లిష్ చేయడాన్ని ఈ న్యాయస్థానం తీవ్రంగా ఖండిస్తోంది… ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా మీడియాకు రెస్పాన్సిబులిటీ ప్రధానం… సంచలన వార్తాకథనాల కంటే ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం మీడియా సంస్థల ప్రధాన విధి… వెంటనే క్షమాపణలు చెప్పండి, పత్రికలో ఫస్ట్ పేజీలో కొరిజెండం (వివరణ- దిద్దుబాటు) పబ్లిష్ చేయండి అని ఆదేశించింది… వెబ్ సైట్ హోమ్ పేజీలో కూడా క్షమాపణ ప్రముఖంగా రావాలని నిర్దేశించింది…
బేషరతుగా క్షమాపణలు చెప్పి, వివరణ ప్రచురణకు అంగీకరించాక సదరు ఎడిటర్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు… ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, (సాంప్రదాయ క్రైమ్) సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, అవడి పోలీస్ కమిషనరేట్‌లో ఒక వారం, తిరుప్పూర్ పోలీస్ స్టేషన్‌లో మరో వారం రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు తీర్పు అభినందనీయం… సెన్సిటివ్ వార్తల ప్రచురణకు సంబంధించి దేశంలోనే టాప్ పత్రికకు ఇంగితం లోపిస్తే ఎలా..?!
Share this Article