ఎడిటర్ , నేనూ ప్లై ఓవర్ కింద నిలబడి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం … ప్రేమలు , బంధాలు అన్నీ మాట్లాడుకున్నాం … ఒకరి భుజం మీద ఒకరం చేయి వేసుకోని కబుర్లు చెప్పుకున్నాం అంటూ కేఎన్ చారి మురిపెంగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు . ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకునే స్నేహం ఉండడం వల్ల మధ్యలోనే ఆపేసి …
‘‘చూడు చారి, ఇప్పుడు సంతోషంగా చెబుతున్నావు కానీ దెబ్బ తింటావు … నా మాట విను … నువ్వు సైనికుడివి, సైనికుడితో స్నేహం చేయాలి కానీ రాజుతో స్నేహం చేయకూడదు .. రాజుతో స్నేహం చేస్తే నీ తప్పు ఉండవచ్చు , రాజుదే తప్పు కావచ్చు బలయ్యేది మాత్రం సైనికుడే’’ అని చెబుతుంటే చారి నవ్వి, నా భుజం మీద కొట్టి వెళ్లి పోయాడు … నువ్వు సిద్ధాంతాలను చదివి ఉండొచ్చు నేను జీవితాన్ని చదివాను అన్నాను …
ఊహించినట్టే రాజు కాటుకు సైనికుడు దారుణంగా బలయ్యాడు . పోలీసుల తూటాల నుంచి తప్పించుకున్నంత ఈజీ కాదు మనిషి కాటు నుంచి తప్పించుకోవడం అని చారికి అంతిమ దశలో అర్థమై ఉటుంది . సగం వయసులోనే తనువు చాలించాడు . నేను పక్కా ఫ్యామిలీ మాన్ ను. కుటుంబం పట్ల నా బాధ్యత నాకు ముఖ్యం . చారి దీనికి పూర్తిగా భిన్నం . ఐనా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది … అతను మరణించిన తరువాతే అతని నక్సల్స్ జీవితం , లక్షల రూపాయల డెన్ కు బాధ్యుడుగా పని చేసిన సంగతి తెలిసింది .
Ads
********
కెసిఆర్ కు మంత్రి పదవి రాకపోవడం వల్లనే తెరాస పుట్టింది . తెలంగాణ ఉద్యమం జరిగింది అని చాలా మంది భావిస్తుంటారు . 2001లో తెరాస పుడితే అంతకన్నా దాదాపు మూడు నాలుగేళ్ల ముందే ఈ అంశంపై కెసిఆర్ ఆధ్వర్యంలో విస్తృతంగా అధ్యయనం జరిగింది . తార్నాకలో ఒక ఆఫీస్ తీసుకోని అధ్యయనం జరిపేవారు . ఆ అధ్యయనంలో పని చేసింది చారి , మరో రిపోర్టర్ రామకృష్ణ . కొన్ని ప్రాంతాల్లో పేదరికం ఎందుకు ఉంటుంది , కొందరు పేదరికంలో ఎందుకు ఉండి పోతారు, సమాజం ఇలా ఎందుకు ఉంది , మారాలి అంటే ఏం చేయాలి అని అధ్యయనం జరిగేది . చారి ఈ పనిలో ఉండేవాడని ఒకసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ స్వయంగా శాసన సభలో చెప్పిన తరువాతనే అందరికీ తెలిసింది .
కేఎన్ చారి ఒకప్పుడు నక్సలైట్ …. నక్సలైట్ గా ఉన్నప్పుడు వణికించాడు … చాలా మందిలానే జనజీవన స్రవంతిలో కలిసి తరువాత ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా, అటు నుంచి ఆంధ్రభూమికి… ముందు కరీంనగర్ అటు నుంచి 95 లో హైదరాబాద్ కు వచ్చాడు . జిల్లాల్లో పని చేసి నేనూ 95లోనే హైదరాబాద్ కు వచ్చాను . చారి దాదాపు అదే సమయంలో హైదరాబాద్ వచ్చారు . ఆఫీస్ కు సంబంధించినంతవరకు ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం . ఎడిటర్ ఆఫీస్ లో ప్రతి మనిషిని … ప్రతి మనిషిని అంటే ఎడిటోరియల్ సిబ్బంది మొదలుకొని అటెండర్ వరకు … ఇన్ఫార్మర్లు గా మార్చుకున్నారు .
*************
ఎడిటర్ స్నేహంతో చారి వెలిగిపోతున్నాడు . కనకాంబరరాజును వారపత్రిక ఎడిటర్ గా తొలగించిన తరువాత చారిని ఎడిటర్ చేయబోయారు . ఏం జరిగిందో అది రద్దయింది . తరువాత ఢిల్లీ ప్రతినిధిగా పంపడానికి ఆర్డర్ తో సహా అన్నీ పూర్తయ్యాయి . ఉత్సాహం ఆగక ఢిల్లీలో ఉండే కృష్ణారావుకు ఫోన్ చేసి ఢిల్లీ వచ్చేస్తున్నా , తెలుగు వాళ్ళం అందరం కలిసి పని చేద్దాం అంటూ ఉపన్యాసం … సమాచారం ఎడిటర్ వరకు వచ్చి, ఇగో దెబ్బతిని ఆర్డర్ రద్దు చేశారు .
పాశం యాదగిరి జర్నలిజంలో ఉన్న సీనియర్లు అందరికీ తెలిసిన పేరు . మేనేజ్ మెంట్ ద్వారా యాదగిరి ఢిల్లీ రిపోర్టర్ గా చేరారు . చేరారు కానీ ఒక్క వార్త కూడా రాలేదు . ఎందుకంటే ఓనర్ యాదగిరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు . ఆ రోజుల్లో ఓనర్ కన్నా శాస్త్రిదే అధికారం ఎక్కువ . ఒక్క వార్త కూడా వేయవద్దని ఆదేశం … యాదగిరి ఫోన్ చేసి ఏమైంది, వార్తలు వేయడం లేదు అని అడిగితే నీ వార్తలు వేస్తే ఎడిటర్ మా ఉద్యోగం తీసేస్తాడు అని సమాధానం … మీ అందరి ఉద్యోగాలు తీయడం ఎందుకు ? నేనే వెళ్ళిపోతాను అని యాదగిరి లాంటి సీనియర్ నెలకు మించి ఉండలేక పోయారు .
నేను మిత్రులతో జోక్ గా చెప్పేవాడిని . ఆంధ్రభూమి తన సొంతం అని ఎడిటర్ అనుకుంటున్నారు అక్కడి వరకు పరవాలేదు . మేనేజ్ మెంట్ కూడా ఆంధ్రభూమి ఎడిటర్ దేమో అనుకుంటున్నారు అని .. ఏం జరిగిందో ఎక్కడ బెడిసిందో కానీ చారిని ఎడిటర్ వేటాడడం మొదలు పెట్టారు . జూనియర్ ఐన సబ్ ఎడిటర్ అబ్దుల్ కు సహాయకుడిగా పని చేయమంటే చారి అక్కడకూ వెళ్ళాడు . ఐనా పగ చల్లారలేదు . ఏదో వంకతో ఉద్యోగం నుంచి వెళ్లిపోయేట్టు చేశారు . బతకాలి కాబట్టి తప్పదు అన్నట్టు ప్రకటనలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే పని మొదలు పెట్టారు .
ఈ పనితో ఎడిటర్ కు ఎలాంటి సంబంధం ఉండదు, ఏజెన్సీల వాళ్ళు ఇంగ్లీషులో ప్రకటన ఇస్తే తెలుగులో అనువాదం చేయాలి . ఒక్కో ప్రకటన అనువాదానికి 200 రూపాయలు ఇచ్చే వారు . ఆ పని చేస్తుండగా చూసి .. ఆ పని చేయడానికి కూడా వీలులేదని ఎడిటర్ ఆపేయించారు .
ఒకప్పుడు లక్షల రూపాయల నక్సల్స్ డెన్ చూసిన చారి మా జేబుల్లో 50 – వంద రూపాయలు ఉన్నా చేయి పెట్టి తీసుకునే స్థితికి వచ్చాడు . చివరకు ఆఫీస్ క్యాంటిన్ కూపన్లు తీసుకునేవాడు . ఒక వైపు మనిషి విషపు కాటుతో విలవిలలాడుతుంటే , మరో వైపు షుగర్ కాటేసింది . మహబూబ్ నగర్ నుంచి జీవగడ్డ అని పత్రిక నడిపాడు . మిత్రులు సహకరించారు , సహాయం చేశారు . నిలుపుకోలేక పోయాడు .
********
ఆరోగ్యం క్షిణించి దీపావళి పండుగ రోజు చారి మరణించారు . రామకృష్ణ ఫోన్ చేసి ఎడిటర్ కు చెబితే పండుగ రోజు ఏంటీ అని చిరాకు పడి ఫోన్ పెట్టేశాడు . చారిని స్మరించుకుంటూ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రెండు సార్లు వ్యాసాలు వచ్చాయి . భూమిలో సింగిల్ కాలం వార్త కూడా రాలేదు .
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది చారినే .. లక్ష్మీపార్వతితో మాట్లాడి 96లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయించారు . తరువాత బీజేపీ నుంచి గెలిచారు . చారి వల్లనే తానూ రాజకీయాల్లోకి వచ్చాను అని చారి పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు . చారి అంత్యక్రియల్లో వరవరరావు , గద్దర్ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు .
**********
తప్పంతా ఎడిటర్ దే అని చెప్పడం నా ఉద్దేశం కాదు . కాటు వేయడం పాము లక్షణం . కాటు వేటుకు పడకుండా జాగ్రత్తగా ఉండడం మనిషి బాధ్యత . ఎడిటర్ బాధ్యత ఎంత ఉందో ,, చారిది కూడా అంతే బాధ్యత ఉంటుంది . సిద్ధాంతాలు , విప్లవాలు మనిషి చనిపోతే రోడ్డున పడే కుటుంబాన్ని ఆదుకోవు …. మన కాళ్ళు నేల మీద ఉండాలి …. – బుద్దా మురళి
Share this Article